Milk And Fruits | ఈ మధ్య కాలంలో చాలా మంది స్మూతీలు, మిల్క్ షేక్‌లను తాగేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. వేసవి కాలంలో సహజంగానే ఈ డ్రింక్‌లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే స్మూతీలు, మిల్క్ షేక్‌లు అంటే.. వాటిల్లో వివిధ రకాల పండ్లతోపాటు పాలను కలిపి తయారు చేస్తారు. కానీ ఆయుర్వేద ప్రకారం పాలు, పండ్లను ఒకేసారి తీసుకోకూడదు. ఇవి విరుద్ధ స్వభావం ఉన్న ఆహారాలు. కనుక ఈ ఆహారాలను కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదం చెబుతోంది. పాలు, పండ్లను కలిపి తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అనేక అసమతుల్యతలు ఏర్పడుతాయని చెబుతున్నారు.
పాల కన్నా పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. పాలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అదే సమయంలో రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో పండ్లు పులిసినట్లు అవుతాయి. దీంతో గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కొన్ని రకాల పండ్లు సహజంగానే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాంటి పండ్లను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో ఇంకా ఇబ్బంది కలుగుతుంది. పొట్టలో ఆమ్లాల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో ఆహారం భారంగా మారుతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అజీర్తి ఏర్పడుతుంది. గుండెల్లో మంట వస్తుంది. పొట్టలో అసిడిటీ కూడా పెరుగుతుంది.
పాలు, పండ్లలో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఆ పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే వీటిని ఎట్టి పరిస్థితిలోనూ కలిపి తీసుకోకూడదు. పాలను, పండ్లను తీసుకునేందుకు కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. రెండింటినీ కలిపి తీసుకుంటే వీటిల్లో ఉండే పోషకాలు ఒకదానికొకటి అడ్డుపడతాయి. దీంతో ఏ పోషకాలను కూడా శరీరం శోషించుకోలేదు. అలాంటప్పుడు వీటిని తీసుకుని కూడా ప్రయోజనం ఉండదు. పైగా పొట్టలో అసౌకర్యం ఏర్పడి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే పాలు, పండ్ల మిశ్రమం ఆయుర్వేద ప్రకారం శరీరంలో ఆమాన్ని పెంచుతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. శరీరంలో జీర్ణం కాని ఆహారాలు కొవ్వుగా మారుతాయి. దీంతో బరువు పెరుగుతారు. శరీరరంలో ఆమం చేరి దీర్ఘకాలంలో హాని కలగజేస్తుంది. గుండె జబ్బులకు కారణం అవుతుంది.
పాలు, పండ్లను కలిపి తీసుకోవడం వల్ల కొందరికి అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండూ కొందరి శరీరంలో టాక్సిన్‌గా మారే ప్రమాదం ఉంటుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ కూడా జరగవచ్చు. అలాగే అలర్జీలను కలగజేస్తుంది. పాలు, పండ్ల మిశ్రమాన్ని తరచూ తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. శరీరం పోషకాలను శోషించుకునే శక్తిని క్రమంగా కోల్పోతుంది. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. అలాగే పండ్లలో ఉండే విటమిన్ సి పాల వల్ల శరీరానికి లభించదు. దీంతో రోగ నిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. పాలు, పండ్లను కలిపి తీసుకుంటే శరీరంలో కఫం అధికంగా తయారవుతుంది. ఇది ముక్కు దిబ్బడ, దగ్గు, జలుబు, బ్రాంకైటిస్ వంటి సమస్యలను కలగజేస్తుంది. కనుక ఆయుర్వేద ప్రకారం పాలు, పండ్లను ఎట్టి పరిస్థితిలోనూ కలిపి తీసుకోకూడదు. లేదంటే సమస్యలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.