Biscuits | ప్రయాణాలలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్న సమయంలో లేదా సినిమాలు, స్పోర్ట్స్ చూసి ఎంజాయ్ చేసే టైములో చాలా మంది తినే స్నాక్స్‌లో బిస్కెట్లు కూడా ఒకటి. ఇవి మనకు అనేక రకాల రూపాల్లో అందుబాటులోఉన్నాయి. కుకీస్, క్రీమ్, సాల్ట్ ఇలా వివిధ వెరైటీల్లో మనకు బిస్కెట్లు లభిస్తున్నాయి. అయితే బిస్కెట్లను తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు మనం వాటిని తినవచ్చా..? బిస్కెట్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి..? అన్న సందేహాలు చాలా మందికి తరచూ వస్తుంటాయి. అయితే ఇందుకు వైద్య నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
బిస్కెట్లను సాధారణంగా మైదా పిండి, చక్కెర, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్‌ను కూడా కలుపుతారు. కనుక బిస్కెట్లను నిర్మొహమాటంగా మనకు హాని చేసే పదార్థాలుగా చెప్పవచ్చు. వాటి తయారీలో వాడే మైదా పిండి మనకు ఎంతో హాని కలిగిస్తుంది. అసలు మనకు వస్తున్న సమస్త రోగాలకు మూల కారణం మైదా పిండే అని వైద్యులు చెబుతున్నారు. మైదా పిండిని అసలు వాడకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. కనుక మైదా పిండితో తయారయ్యే బిస్కెట్లను అసలు తినకూడదు. అలాగే వాటి తయారీకి చక్కెర ఉపయోగిస్తారు. ఇది కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని బిస్కెట్లను తింటేనే అధిక మొత్తంలో చక్కెర మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది షుగర్ లెవల్స్‌ను పెంచడంతోపాటు శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక ఎలా చూసినా కూడా బిస్కెట్లు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి తప్ప అసలు మేలు కలిగించవు. ఈ క్రమంలో వాటితో నష్టాలే ఉంటాయి కానీ లాభాలు ఉండవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆరోగ్యం దృష్ట్యా కొన్ని కంపెనీలు బిస్కెట్లను చిరు ధాన్యాలతో చక్కెర లేకుండా తయారు చేస్తున్నాయి. అలాంటి బిస్కెట్లను తినడం కొంత వరకు ఆరోగ్యానికి మంచిదే అని చెప్పవచ్చు. కానీ వాటిల్లోనూ కొందరు మైదా పిండి, చక్కెరను కలుపుతున్నారు. అవి రెండూ ఉంటే గనక మల్టీ గ్రెయిన్ బిస్కెట్లను తిన్నప్పటికీ వేస్టే. మనకు అలాంటి వాటితోనూ ముప్పు కలుగుతుంది. కనుక బిస్కెట్లను కొనే ముందు అవి వేటితో తయారవుతున్నాయి అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మైదా పిండి, చక్కెర లేని బిస్కెట్లను తింటే మంచిది. అయితే అలాంటి బిస్కెట్లను అయినా సరే మరీ అతిగా తినకూడదు. మోతాదులో లేదా ఎప్పుడో ఒకసారి తినవచ్చు. ఇక పిల్లలకు అయితే బిస్కెట్లను ఎట్టి పరిస్థితిలోనూ బిస్కెట్లను పెట్టకూడదు. ఇవి వారిని మరింత చిరు తిండి తినేలా చేస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. అలాగే భోజనం సరిగ్గా చేయరు. పండ్లను కూడా తినలేరు. కనుక పిల్లలకు అసలు బిస్కెట్లను ఇవ్వకూడదు.
ఇక స్నాక్స్ సమయంలో మరి ఆకలి అవుతుంది కదా, అలాంటప్పుడు ఎలా అంటే.. అప్పుడు గింజలు, విత్తనాలు, పండ్లను తినేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి. అవి సహజసిద్ధమైనవి. మనకు పోషకాలను, శక్తిని అందిస్తాయి. రోగాల నుంచి బయట పడేలా చేస్తాయి. బాదంపప్పు, జీడిపప్పు, పల్లీలు, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, తాజా పండ్లను తినాలి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకానీ ఆకలి అయింది కదా అని స్నాక్స్ రూపంలో బిస్కెట్లను తినకూడదు. ఇవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి తప్ప మంచి చేయవు గాక చేయవు.