HomeHealthCan People Who Like The Taste Of Cashews Eat A Handful Of Nuts A Day
Cashew | రోజూ జీడిపప్పు తినడం మంచిదేనా?
Cashew | జీడిపప్పును రోజువారీ తినే డ్రైఫ్రూట్స్, నట్స్‌తో నిక్షేపంగా తీసుకోవచ్చు. అయితే ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కేలరీలు ఎక్కువ. దీనివల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
Cashew | బాదం, పిస్తాలాగే ఆరోగ్యకరమైన నట్స్ జాబితాలో జీడిపప్పునూ చేర్చవచ్చా. రోజువారీ డ్రైఫ్రూట్స్‌తోపాటు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి. వేయించి తింటే మేలా, నేరుగా మంచిదా? జీడిపప్పు రుచి ఇష్టం ఉన్నవాళ్లు రోజుకొక గుప్పెడు గింజలు తినవచ్చా?
ఓ పాఠకురాలు
జీడిపప్పును రోజువారీ తినే డ్రైఫ్రూట్స్, నట్స్‌తో నిక్షేపంగా తీసుకోవచ్చు. అయితే ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కేలరీలు ఎక్కువ. దీనివల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజువారీగా వీటిని తినేప్పుడు మోతాదు చాలా ముఖ్యం. ఎంత తిన్నామన్నదాన్ని బట్టే మనకు ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా అనేది ఆధారపడుతుంది. జీడిపప్పులో పోషకాలు కూడా ఎక్కువే. అధిక మోతాదులో అసంతృప్త కొవ్వులు, విటమిన్-ఇ, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫాస్పరస్, విటమిన్-కె లాంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడానికి, బీపీని నియంత్రణలో ఉంచడానికి సాయపడతాయి. ఇందులోని అసంతృప్త కొవ్వులు మెదడును చురుగ్గా ఉంచుతాయి.
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి. మంచి నిద్రకు తోడ్పడతాయి. కాబట్టి, పూర్తి ఆరోగ్యవంతులు రోజులో మూడు నాలుగు జీడిపప్పులు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే మాత్రం అదనపు కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే బరువు పెరుగుతారు. జీడిపప్పు అధికంగా తింటే కొందరిలో కడుపుబ్బరం, తలనొప్పిలాంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. వీటిని నెయ్యి, నూనెలో వేయించి తింటే ఇందులోని కేలరీలు మరింత అధికమవుతాయి. కాబట్టి నేరుగానే తీసుకోవాలి. రుచి కోసం మూకుడులో వేయించి తినొచ్చు. ఇక, సాయంత్రాల కన్నా ఉదయం తింటేనే మేలు. దీనివల్ల రోజంతా మనం కేలరీలు ఖర్చుచేసే అవకాశం ఉంటుంది. గుండెజబ్బులు ఉన్నవాళ్లు, మధుమేహులు.. పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటేనే మంచిది.