Diabetes | మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిని నేరుగా తినడంతో పాటు వివిధ వంటకాల్లో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనితో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, చర్మానికి, జుట్టుకు ప్రయోజనాలను చేకూర్చడంలో పచ్చి కొబ్బరి దోహదపడుతుంది. అయితే డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చా.. లేదా అన్న సందేహం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చికొబ్బరిని తీసుకోవచ్చా.. లేదా.. పోషకాహార నిపుణులు దీని గురించి ఏమంటున్నారో.. తెలుసుకుందాం.
పచ్చికొబ్బరి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తీసుకోవచ్చు. అయితే తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చికొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చికొబ్బరిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగుపడుతుంది. డయాబెటిస్ తో బాధపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చికొబ్బరిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలల్లో వచ్చే ఆకస్మిక హెచ్చుతగ్గులను తగ్గించవచ్చు.
రక్తంలో స్థిరమైన చక్కెర నియంత్రణకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది. శరీర బరువు అదుపులో ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. పచ్చి కొబ్బరిలో మాంగనీస్, రాగి, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ తో బాధపడే వారికి పచ్చికొబ్బరి ఆరోగ్యకరమైన ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చికొబ్బరిని మితంగానే తీసుకోవాలని దీనిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వారు తెలియజేస్తున్నారు. రోజూ 30 నుండి 40 గ్రాముల పచ్చికొబ్బరిని మాత్రమే తీసుకోవాలి. పచ్చికొబ్బరిని చక్కెరతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇలా అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల క్యాలరీలతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. కనుక పచ్చికొబ్బరిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.