వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగానే అందరిలో క్యాల్షియం తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనపడి,పటుత్వం కోల్పోవడం కూడా సహజమైన విషయమే. కాకపోతే ఈ సమస్య ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించేది. ఈ మధ్యకాలంలో మాత్రం చిన్న వయసులోనే.. ముఖ్యంగా స్త్రీలలో ఎముకలు బలహీనంగా మారి కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సూర్యరశ్మికి దూరంగా ఉండటం, క్యాల్షియం లోపం తదితర కారణాల వల్ల మహిళల్లో ఎముకలు బలహీన పడుతున్నాయి. దీన్నే బోన్లాస్ లేదా బోలు ఎముకల వ్యాధి అంటారు. బోన్లాస్ వ్యాధి రావడానికి గల ప్రధాన కారణాలు, వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, చికిత్స పద్ధతులు మొదలైన అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ఎముకలు వాటి సాంద్రతను కోల్పోయి పటుత్వం తగ్గిపోతుంది. దీనినే ‘బోలు ఎముకల వ్యాధి’ లేదా ‘బోన్లాస్’ అంటారు. వైద్య పరిభాషలో ‘ఆస్టియోపొరోసిస్’ అనికూడా అంటారు. ఈ వ్యాధి పురుషుల కంటే స్త్రీలలోనే అధికంగా కనిపిస్తుంది. మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సాధారణంగా సంభవించే వ్యాధిగా పరిగణిస్తారు. దీనికి కారణం రుతుస్రావం ఆగిపోవడం వల్ల హార్మోన్లలో కలిగే మార్పులు. ఎముకలు వాటి సాంద్రతను కోల్పోయి రంధ్రాలమయమై స్పాంజిలా తయారవుతాయి. ఇలా బలహీనపడిపోయిన ఎముకలు పటుత్వం కోల్పోయి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆస్టియోపొరోసిస్ వ్యాధి రెండు రకాలు. ఒకటి ప్రైమరీ ఆస్టియోపొరోసిస్, రెండోది సెకండరీ ఆస్టియోపొరోసిస్.
రోగికి ఎలాంటి ఇతర వ్యాధులు లేకున్నా వచ్చే బోన్లాస్ వ్యాధిని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది ఎముక ఏర్పడటం తగ్గిపోవడం, రిసాప్షన్ వల్ల వస్తుంది. ప్రైమరీ ఆస్టియోపొరోసిస్ వ్యాధిని… ‘పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్’, ‘సెనైల్ ఆస్టియోపొరోసిస్’ అని రెండు రకాలుగా విభజించారు.
1. పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్
ఈ వ్యాధి స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. పోస్ట్ మెనోపాజ్ అంటే మహిళల్లో రుతుస్రావం ఆగిపోవడం. ఈ దశలో కలిగే హార్మోన్ల మార్పిడి వల్ల బోన్ రిసాప్షన్కు గురవుతుంది. ఫలితంగా క్యాల్షియం ఎముకలలో నుంచి శరీరంలోకి వచ్చేసి ఎముకలు బలహీనపడతాయి. అంటే ఎముకల్లో ఉన్న క్యాల్షియం నిలువలు తగ్గిపోతాయన్నమాట. సాధారణంగా మహిళల్లో 50 ఏళ్లు దాటుతున్న సమయంలో ఈ దశ మొదలవుతుంది. ఈ వయసులోనే పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్ వ్యాధి వచ్చే అవకాశాలు అత్యధికం. ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు 50 ఏళ్లలోపే పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్‌కు గురవుతున్నారు.
ఈ మధ్యకాలంలో 78 శాతం మహిళల్లో 50 ఏళ్ల వయసు లోపే ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముక వ్యాధి), ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు) సమస్యలకు గురవుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది స్త్రీలు తమ ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టకపోవడం. రెండోది 45- 50 ఏళ్ల మధ్య వయసులోనే రుతుక్రమం ఆగిపోవడం. సాధారణంగా ఈ వయసులో ఈస్ట్రోజన్స్ (స్త్రీల లైంగిక హార్మోన్లు) తగ్గిపోతుంటాయి. ఫలితంగా మెనోపాజ్‌కు దగ్గరవుతున్న (రుతుక్రమానికి దూరమవుతున్న) మహిళల్లో ఎముకలు పటుత్వం కోల్పోయి, బలహీనమవడం తీవ్రమవుతుంది. కొంతమందిలో మాత్రం మెనోపాజ్‌తో సంబంధం లేకుండానే నడివయసులో వివిధ కారణాల వల్ల బోలు ఎముక వ్యాధి వస్తుంటుంది. దానికి కారణాలు…
2. సెనైల్ ఆస్టియోపొరోసిస్
సెనైల్ ఆస్టియోపొరోసిస్ వ్యాధి వయసుతో ముడిపడి ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ వస్తుంది. సాధారణంగా మనిషి పుట్టినప్పటి నుంచి వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో ఎదుగుదల ఉంటుంది. ఇది 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఎముకలు పటిష్ఠంగా ఎదగాలంటే అందుకు సరిపడా డి-విటమిన్, క్యాల్షియం కావాలి. మనం తినే ఆహారం ద్వారా క్యాల్షియం లభిస్తుంది. డి- విటమిన్ సూర్యరశ్మి ద్వారా అధికంగా దొరుకుతుంది. అయితే, 70 ఏళ్ల వయసు వచ్చేసరికి బోన్ ఫార్మేషన్ (ఎముక ఏర్పడే క్రమం) తగ్గిపోతుంది. దీంతో ఎముకలు క్రమంగా బలహీనపడతాయి. ఫలితంగా 70 ఏళ్లు దాటిన వారిలో ఆస్టియోపొరోసిస్ రావడం సహజం.
సెనైల్ ఆస్టియోపొరోసిస్, పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరాసిస్ సమస్యలను అధిగమించాలంటే ‘పీక్ బోన్ మాస్’ అనేది చాలా కీలకం. పీక్ బోన్ మాస్ అంటే ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకోవడం. స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ వయసు పెరిగే కొద్దీ ఎముకలు ఎదుగుతుంటాయి. వాటి నిర్మాణం బలపడుతుంది. 30 ఏళ్ల నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 30 ఏళ్ల వయసు వరకు ఎముకల్లో క్యాల్షియం నిల్వలు అధిక మొత్తంలో డిపాజిట్ అవుతుంటాయి. అందుకే ఈ వయసులో ఏర్పడిన ఎముకల ఎదుగుదలను బ్యాంక్ డిపాజిట్లా భావిస్తారు. దీనివల్ల ఏర్పడిన ఎముకల పటుత్వం మహిళల్లో మెనోపాజ్ తర్వాత, పురుషుల్లో 70 ఏళ్లు దాటిన తర్వాత ఏర్పడే ఆస్టియోపొరోసిస్ సమస్యను అధిగమిస్తుంది. అంటే సెనైల్ దశలో బోన్ ఫార్మేషన్ తగ్గిపోయినప్పుడు పీక్ బోన్ మాస్ ఉపయోగపడుతుంది అన్నమాట. దీనివల్ల ఆస్టియోపొరోసిస్ బాధ నుంచి తప్పించుకోవచ్చు. పీక్ బోన్ మాస్ ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1. పౌష్టికాహారం,
2. శారీరక శ్రమ, 3. జన్యుపరమైన కారకాలు,
4. గొనాడల్ యాక్టివిటీస్.. అంటే కొన్ని రకాల హార్మోన్ల పనితీరు.
వయసు పెరిగేకొద్దీ ఎముకల్లో క్యాల్షియం నిల్వలు అధిక స్థాయిలో జమ అవుతుంటాయి. అతి తక్కువ స్థాయిలో విత్‌డ్రా అవుతాయి. 30 ఏళ్ల వరకు ఇలా జరుగుతుంది. ఆ తర్వాత ఎముకల్లో క్యాల్షియం జమ కావడం క్రమంగా తగ్గుతుంది. విత్‌డ్రా కావడం పెరుగుతుంది. ఎముకల్లో క్యాల్షియం నిల్వలు అధికంగా ఉండాలంటే బాల్య దశ నుంచే పౌష్టికాహారం, సరిపడా క్యాల్షియం అందించే ఆహారంతోపాటు చర్మానికి సూర్యరశ్మి తగిలేలా పిల్లలను రోజూ ఎండలో కనీసం 20 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల విటమిన్- డి సమృద్ధిగా లభిస్తుంది. వీటితోపాటు శరీరానికి మంచి వ్యాయామం కల్పించే ఆటలు ఆడిపించాలి. ఫలితంగా 30 ఏళ్లు వచ్చేటప్పటికి వారిలో పీక్ బోన్ మాస్ సమృద్ధిగా ఏర్పడుతుంది. అయితే, సాధారణంగా మహిళల్లో ఈ ‘పీక్ బోన్ మాస్’ తక్కువగా ఉంటుంది. అందుకే వారు చిన్నతనం నుంచే పౌష్టికాహారంపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
కొన్ని రకాల జబ్బుల కారణంగా వచ్చే బోలు ఎముకల వ్యాధిని ‘సెకండరీ ఆస్టియోపొరోసిస్’ అంటారు. లుకేమియా, డయాబెటిస్, ఉదరకుహర వ్యాధి, హైపర్ థైరాయిడిజం, మూత్రపిండ వ్యాధి, అనోరెక్సియా, ఆస్టియోజెనెసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులతో బాధపడే వారికి సెకండరీ ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి పిల్లల్లోనూ కనిపిస్తుంది. పిల్లల్లో కనిపించే దాన్ని ‘జువెనైల్ ఆస్టియోపొరోసిస్’ అని పిలుస్తారు.
ఆస్టియోపొరోసిస్‌ను గుర్తించేందుకు ముందుగా రోగి ఆరోగ్యస్థితిపై వైద్య పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి కుటుంబలో ఎవరికైనా ఈ వ్యాధి ఉందా అనే విషయం తెలుసుకోవాలి. అనంతరం రోగికి ‘డెక్సా స్కాన్’ ద్వారా ఏ రకమైన ఆస్టియోపొరోసిస్ వచ్చిందో కచ్చితంగా నిర్ధారించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధిని టి-స్కోర్ ద్వారా నిర్ధారిస్తారు.
పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్ రోగులకు హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) ద్వారా చికిత్స అందిస్తారు. ఇదికాకుండా పారా థైరాయిడ్ హార్మోన్ ద్వారా కూడా చికిత్స అందించవచ్చు. ఈ చికిత్స పోస్ట్ మెనోపాజ్ ఆస్టియోపొరోసిస్‌తో పాటు సెనైల్ ఆస్టియోపొరోసిస్ రోగులకు సైతం ఇవ్వవచ్చు. ఈ చికిత్సలో ఇచ్చే హార్మోన్ల వల్ల ఎముక నుంచి క్యాల్షియం బయటకు పోకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఫలితంగా ఆస్టియోపొరోసిస్‌ను నియంత్రించవచ్చు. ఇది నిశ్శబ్ద మహమ్మారి కాబట్టి, వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. జీవన విధానంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్ ముప్పు తప్పించుకోవచ్చు.
ఎవరిలోనైనా ఎముకల సాంద్రత క్షీణిస్తుంటే వారిలో బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టుగా భావించాలి. దీనిని ప్రారంభ దశగా పరిగణిస్తారు. ఎముకలు వెంటనే వాటి సాంద్రతను కోల్పోవు. అందుకు కొంత సమయం పడుతుంది. ఈ దశలో రోగిలో ఎలాంటి లక్షణాలు అంతగా బయటపడవు. ఏదైనా గాయమైనప్పుడో, కిందపడినప్పుడు ఏర్పడిన పగుళ్ల వల్లనో వ్యాధి
లక్షణాలు బయటపడతాయి.
– మహేశ్వర్‌రావు బండారి
– డా. చంద్ర కృష్ణ (ఆర్థో) కొండాపూర్ ప్రభుత్వ దవాఖాన