Building Muscle | సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బలహీనంగా మారుతుంటాయి. అస్తవ్యస్థ జీవనవిధానం, అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలు చిన్న వయసులో కండరాలు బలం కోల్పోయేలా చేస్తాయి. కండరాలు ఎంత బలంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉన్నట్లుగా లెక్కించాలి. కండరాల బలాన్ని పెంచుకోవడం ద్వారా నడి వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలను సమర్ధంగా నివారించుకోవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
30 సంవత్సరాల వయస్సు నుంచి మన శరీరానికి వృద్ధాప్యం మొదలవుతుంది. ప్రతి కణం, అవయవం, జీవ ప్రక్రియ కాలక్రమేణా క్షీణించడం ప్రారంభమవుతుంది. తొలి దశలో ఈ మార్పు దాదాపుగా కనిపించదు. కానీ వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు గోచరిస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా కండర ద్రవ్యరాశి, బలం కోల్పోవడం వంటి మార్పు ఎక్కువగా కనిపిస్తుంది.
తక్కువ మజిల్ మాస్ సమస్యలు
కండరాల ద్రవ్యరాశి ఎక్కువగా లేకపోవడం అనేది తీవ్రమైన నొప్పులకు దారితీస్తుంది. శరీరం సమతుల్యత కోల్పోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. స్వాతంత్ర్యం కోల్పోతాయి. మజిల్ మాస్ సమస్యలు ఎక్కువగా రావడం వలన డయాబెటిస్, గుండె జబ్బులు, చిత్తవైకల్యం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
కండరాల బలం పెంపు ప్రభావం
శరీర వయస్సు పెరిగిన కొద్ది కండర ద్రవ్యరాశి ఎందుకు తగ్గుతుందో పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, సాధారణ వ్యాయామం సహాయపడుతుందని మాత్రం చెప్తున్నారు. వ్యాయామాలు వృద్ధాప్యం ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే, కండరాల నష్టం ఆలస్యమయ్యేలా చేస్తాయి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంతోపాటు వృద్ధాప్యంలో శరీరం పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం కూడా సాధ్యమవుతుందని అధ్యయనాలు తేల్చాయి.
కండర ద్రవ్యరాశి మెరుగు ఎలా..?
కండర ద్రవ్యరాశిని అనేక మార్గాల్లో మెరుగుపరుచుకోవచ్చు. భారీ కండర నిర్మాణ శక్తి శిక్షణ యువకులు, వృద్ధులపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెప్తున్నారు. 18-65 ఏండ్ల వయసు వారు నిత్యం తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవడం ద్వారా మజిల్ మాస్ పెంచుకోవచ్చు. కనీసం వారంలో రెండు రోజులు వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా కండరాలు పెంచుకోవచ్చు. అలాగే,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
ఎలాంటి డైట్ పాటించాలి..?
కండర ద్రవ్యరాశిని పెంపొందించుకోవడానికి ప్రోటీన్ ఆహారాలు చాలా ముఖ్యం. పెద్దలంతా రోజుకు ఒక కిలో శరీర ద్రవ్యరాశికి కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేస్తూ కండరాలను నిర్మించుకోవాలని చూస్తున్నట్లయితే ఈ మొత్తం 1.6 గ్రాములకు పెంచుకోవాలి. 70 కిలోల బరువున్న వ్యక్తి తన కండరాలను నిర్మించడానికి 112 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇందుకు చికెన్ బ్రెస్ట్, ప్రోటీన్ షేక్, మూడు గుడ్లు, ఒక క్యాన్ ట్యూనా తినడం ద్వారా కండర ద్రవ్యరాశిని సాధించవచ్చు.
చివరగా, కండరాలు ఒకేసారి పెంచాలని మాత్రం అనుకోవద్దు. ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని మరిచిపోవద్దు. చేస్తున్న వ్యాయామాలకు అనుగుణంగా పోషకాహారం తీసుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి.