నాకు నాలుగు నెలల కిందట ఆడబిడ్డ పుట్టింది. మూడు కిలోల బరువు ఉంది. పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తల్లిపాలు మాత్రమే ఇస్తూ వచ్చాను. ఇన్నాళ్లూ సెలవుల్లో ఉన్నాను. ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈ సమయంలో పాలు ఇవ్వడం కష్టం కదా! ఆవుపాలు, గేదెపాలు, ఫార్ములా పాలు వీటిలో ఏది పడితే మంచిదో సూచించగలరు?
నాలుగు నెలలుగా బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మారిన కాలమాన పరిస్థితుల కారణంగా.. మహిళలు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో మీ బిడ్డకు పోతపాలు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ, ఆవుపాలు, గేదెపాలు, డబ్బాపాలు.. ఇవేవీ తల్లిపాలకు సరిపోలవు. అమ్మపాలు అమృతం కన్నా మిన్న. అందులో సజీవ కణాలు ఉంటాయి. బిడ్డకు సరైన పోషకాలు అందుతాయి. బిడ్డ అవసరానికి అనుగుణంగా మారే జీవ రసాయన ద్రవం తల్లిపాలు. జీవితాంతం బిడ్డకు రక్షణనిచ్చే దివ్యౌషధం. బిడ్డ ఆరోగ్యానికి పునాది అమ్మపాలే! ఒకరకంగా బిడ్డకు మొదటి వ్యాక్సినేషన్ అనొచ్చు. తల్లిపాలు తాగే క్రమంలో బిడ్డ అమ్మను హత్తుకుంటుంది. ఆ సమయంలో బిడ్డ మీద ఏదైనా బ్యాక్టీరియా ఉంటే.. అది తల్లిలోకి చేరుతుంది. దానికి విరుగుడుగా యాంటీబాడీస్ తయారై, పాల ద్వారా బిడ్డకు అందుతాయి.
చిన్నప్పుడు తల్లిపాలు సమృద్ధిగా తాగిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు తక్కువగా వస్తాయి. వారిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా పనిచేస్తుంది. అంతేకాదు బిడ్డకు పాలు పట్టడం ద్వారా తల్లి బరువు తగ్గుతుంది. తల్లులకు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బిడ్డకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే పట్టాలి. తర్వాత ఘనపదార్థాలు ఇవ్వొచ్చు. ఈ సమయంలోనూ పాలు ఇవ్వడం మానొద్దు. మీ సెలవులు మరో రెండు నెలలు కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. అలా కుదరకపోతే.. ఆఫీస్కు వెళ్లడానికి ముందు, వచ్చిన తర్వాత తప్పకుండా పాలు ఇవ్వండి. మిగతా సమయాల్లో మెత్తటి ఘనపదార్థాలు ఇవ్వొచ్చు. దీంతోపాటు తల్లిపాలు తీసి.. ఫ్రిజ్లో దాచొచ్చు.
ఇవి 24 గంటల పాటు నిల్వ ఉంటాయి. బిడ్డకు పట్టేముందు గోరువెచ్చగా చేసి పట్టొచ్చు. మీరు ఉద్యోగం చేసే చోటు ఇంటికి దగ్గరగా ఉన్నట్లయితే.. మధ్యాహ్నం వచ్చి పాలిచ్చే ప్రయత్నం చేయండి. పెద్ద సంస్థలో పనిచేస్తున్నట్లయితే.. మీ కార్యస్థలంలో బిడ్డకు పాలిచ్చే వసతి ఏర్పాటు చేయమని చెప్పండి. ఇంట్లోవాళ్లు ఎవరైనా బిడ్డను తీసుకువస్తే.. పాలివ్వొచ్చు. ఆరు నెలలు నిండే వరకైతే తల్లిపాలు మాత్రమే ఇవ్వండి. తర్వాత కూడా పైన సూచించిన సలహా మేరకు.. తల్లిపాలు రోజుకు రెండుసార్లు అయినా బిడ్డకు అందేలా జాగ్రత్త తీసుకోండి.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్