మా చెల్లి వారం క్రితం ప్రసవించింది. బిడ్డ పుట్టగానే ప్రసవం చేసిన వైద్యుల్ని ‘ఆడబిడ్డా? మగబిడ్డా’ అని అడిగితే.. ‘ఆడ, మగ అనేది ఇంకా చెప్పలేం. జననేంద్రియాలు సరిగా లేవు. కొన్ని పరీక్షలు చేస్తేనే చెప్పడం సాధ్యమవుతుంది’ అన్నారు. మాకు భయంగా ఉంది. ఎందుకిలా జరిగింది? ఏం చేయాలో చెప్పండి.
ఇది కొన్ని సందర్భాల్లో అరుదుగా జరుగుతుంది. బిడ్డ పుట్టడం కుటుంబంలో ఆనందకరమైన విషయం. బిడ్డ పుట్టిన వెంటనే.. ఆ బిడ్డ ఆడా, మగా తెలుసుకోవాలని, అలాగే బిడ్డ బరువు తెలుసుకోవాలని అడుగుతారు. వైద్యులు కొన్ని సందర్భాల్లో ఆడ, మగ చెప్పలేకపోతారు. జననేంద్రియాల నిర్మాణం సరిగా లేనప్పుడు ఇలాంటి సందిగ్ధ స్థితి వస్తుంది. అప్పుడు ఆ బిడ్డ.. మగబిడ్డా, ఆడబిడ్డా నిర్ణయించడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. సాధారణంగా మన శరీరాల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో 22 జతలు మన రంగు, రూపు, ఎత్తు మొదలైన వాటిని నిర్ణయిస్తాయి. ఒక జత జన్యువులు మాత్రం ఆడా, మగా అనేది నిర్ణయిస్తాయి. ఆడవాళ్లలో ఆ జతలో ఎక్స్ – ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి.
మగవాళ్లలో ఎక్స్ – వై క్రోమోజోములు ఉంటాయి. ఇరవై మూడో జతలోని రెండో క్రోమోజోమ్ ఎక్స్ లేదా వై అనేది (జన్యుపరంగా) లింగాన్ని నిర్ధారిస్తుంది. మీ చెల్లికి పుట్టిన బిడ్డ ఆడనా, మగనా అనేది తెలియాలంటే బయటికి కనిపించే జననేంద్రియాలతోపాటు లోపల గర్భాశయం ఉందో, లేదో తెలుసుకోవాలి. వృషణాలు సరిగా లేకపోవడం, మగపిల్లల్లో జననేంద్రియం అభివృద్ధి చెందకపోవడం, ఆడపిల్లల్లో ఎక్కువగా అభివృద్ధి చెందడం, ఆడపిల్ల జననాంగానికి ఇరువైపులా ఉండే కణజాలం పెరగకపోవడం వంటి సమస్యలు కొద్దిమంది శిశువుల్లో ఉండే సమస్య. వీటిని ‘డిజార్డర్స్ ఆఫ్ సెక్సువల్ డిఫరెన్షేషన్’ అంటారు.
పిండం పెరిగేటప్పుడు విడుదలయ్యే హార్మోన్ల కారణంగా అవయవాల నిర్మాణ లోపాలు ఏర్పడతాయి. ఈ సందర్భంలో బిడ్డ లింగ నిర్ధారణ చేయాలంటే హార్మోన్ల ప్రభావం, జననేంద్రియాలు, ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవిధంగా ఉన్నాయో నిర్ధారించాలి. కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి బిడ్డ లింగ నిర్ధారణ జరిపించాలి. ఈ సమస్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్