మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. మోకాళ్లు (లోపలికి) దగ్గరగా, పాదాలు దూరంగా ఉంన్నాయి. కొంచెం ఇబ్బందిపడుతూ నడిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. పిల్లల డాక్టర్‌కి చూపించాము. భయపడేంత పెద్ద సమస్య కాదన్నారు. వయసు పెరిగే కొద్ది వంకరకాళ్లు (నాక్ నీస్) సరిగా అవుతాయని చెప్పారు. ఎందువల్ల వచ్చింది? ఏం చేస్తే పోతుంది? కచ్చితంగా పోతుందా?
పిల్లలు ఎదిగే క్రమంలో కాళ్లు ఒక ఆకృతి నుంచి మరో ఆకృతిలోకి మారతాయి. మొదట్లో పిల్లల కాళ్లు మోకాలి కింద కొంచెం బయటికి వంగినట్లుగా ఉంటాయి. ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు మోకాలు స్ట్రెయిట్‌గా (తుంటిలోని కీలు, పాదంలోని కీళ్లతో సమాన వరుసలో) ఉంటుంది. అప్పడు పాదాల మధ్య దూరం కొంచెం పెరుగుతుంది.
ఇది పిల్లలు ఎదిగే క్రమంలో సహజంగా జరిగే మార్పు. పిల్లల్లో ఆర్థరైటిస్ (ఎముకల జబ్బు) ఉన్నా, డి విటమిన్ లోపించినా, అధిక బరువు (స్థూలకాయం) ఉన్నా కాళ్లలోని ఎముకలు వంగుతాయి. మామూలుగా వయసు ప్రకారం వచ్చేటువంటి బోలెక్స్ (మోకాలికి దిగువన ఎముకలు బయటికి వంగి ఉండటం) లేదా నాక్ నీస్ (మోకాళ్ల దగ్గర ఎముకలు లోపలికి వంగి ఉండటం) ఇబ్బంది కలుగజేయవు.
మీ అబ్బాయిలో ఉన్న నాక్ నీస్ సమస్యకు కారణం తెలుసుకోవడానికి సరైన వివరాలు చెప్పలేదు. మీ అబ్బాయి బరువు ఎంత? విటమిన్ డి లోపం ఉందా? పరీక్షల్లో ఏ స్థాయిలో ఉంది తెలిస్తేనే కచ్చితంగా చెప్పగలం. మీ పిల్లవాడికి ఊబకాయం ఉన్నట్టయితే డాక్టర్ సలహాతో బరువు తగ్గించుకోవాలి. అదే విధంగా ఒకసారి విటమిన్ డి పరీక్ష చేయించుకోండి.
డి విటమిన్ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఈ లోపంతో వస్తే కాల్షియం లోపం కూడా ఉండొచ్చు. ఆ పరీక్ష కూడా చేయించుకోండి. అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీయించాలి. పిల్లల డాక్టర్‌తోపాటు, ఎముకల డాక్టర్‌కి కూడా చూపించడం మంచిది. పరీక్షలు చేయించి ఏమీలేదని నిర్ధారించుకోండి. ఏదైనా సమస్య ఉంటే, సరైన వైద్య సలహాలు తీసుకుని పాటించాలి. మీ బాబుది కంగారుపడేంత తీవ్రమైన సమస్య కాదు.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్