Blood Cancer Causes And Symptoms | ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి ఏటా ఎన్నో కోట్ల మంది చనిపోతున్నారు. క్యాన్సర్‌ను ఆరంభ దశలో గుర్తించలేకపోతున్నారు. దీంతో క్యాన్సర్ ముదిరి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్‌లో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందులో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి. దీన్నే లుకేమియా, లింఫోమా, మైలోమా అని పలు రకాల పేర్లతో పిలుస్తారు. క్యాన్సర్లు ఏర్పడే భాగం, కణాలు వృద్ధి చెందే తీరును బట్టి బ్లడ్ క్యాన్సర్‌ను ఇలా విభజించారు. అయితే బ్లడ్ క్యాన్సర్ వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. జన్యు సంబంధ లోపాల వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. కొందరికి పుట్టుకతోనే జన్యు లోపాలు ఏర్పడుతుంటాయి. ఇవి బ్లడ్ క్యాన్సర్‌కు దారి తీస్తాయి. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ తరహా క్యాన్సర్ ఉంటే వారి పిల్లలకు లేదా ముందు తరాల వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే క్యాన్సర్ ఎలా వస్తుంది.. అన్న కారణాలను మాత్రం ఇప్పటికీ పరిశోధకులు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిందంటే మన శరీరం మనకు ముందస్తుగానే పలు లక్షణాలు, సంకేతాలను తెలియజేస్తుంది. అవేమిటంటే.. ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గిపోవడం క్యాన్సర్ ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఎలాంటి డైట్ లేదా మెడిసిన్‌ను వాడకపోయినా ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గుతుంటే దాన్ని క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి. అలాగే రాత్రి పూట నిద్ర సరిగ్గానే తగినన్ని గంటలపాటు పోయినా కూడా ఉదయం లేవగానే తీవ్రమైన అలసట, నీరసం ఉంటున్నా వాటిని కూడా క్యాన్సర్ లక్షణాలుగానే అనుమానించాలి.
కొందరికి చిన్న పనిచేసినా విపరీతమైన అలసట వస్తుంది. నీరసం కూడా ఉంటుంది. ఇలా తరచూ జరుగుతుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. అలాగే క్యాన్సర్ ఉన్నవారిలో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణం. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తూ అవి తగ్గకపోతుంటే దాన్ని కూడా క్యాన్సర్‌గా భావించాలి. అలాగే బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారిలో చాలా సులభంగా రక్త స్రావం అవుతుంది. తరచూ ముక్కు లేదా నోరు నుంచి రక్తం పడుతుంది. చిన్న గాయం అయినా కూడా రక్తస్రావం అధికంగా జరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే అది కచ్చితంగా బ్లడ్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే క్యాన్సర్ ఉన్నవారికి రాత్రి పూట విపరీతంగా చెమటలు పడుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శరీరంలో ఆయా భాగాల్లో వాపులు, నొప్పులు వస్తుంటాయి. జ్వరం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ క్యాన్సర్ ఉన్నట్లు తేలితే ముందుగానే చికిత్స తీసుకుని ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. క్యాన్సర్‌ను ఆరంభ దశలో గుర్తిస్తే చికిత్స తీసుకోవడం, దాన్ని నయం చేసుకోవడం, మళ్లీ రాకుండా చూసుకోవడం చాలా సులభతరం అవుతుంది. దీంతో ప్రాణాపాయం రాకుండా అడ్డుకోవచ్చు. క్యాన్సర్ కు గాను వైద్యులు వివిధ రకాల చికిత్సలను అందిస్తుంటారు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనో థెరపీ, టార్గెటెడ్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ, యాక్టివ్ మానిటరింగ్, సర్జరీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు క్యాన్సర్ తీవ్రతను బట్టి భిన్న రకాల చికిత్సలను అందిస్తారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాలను కాపాడుకోవచ్చు.