‘ఇప్పుడే, నాతో మాట్లాడాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. చిన్న వయసు. పెండ్లి కూడా కాలేదు’, ‘ముప్పై ఏండ్లే. నా స్నేహితుడు గుండెపోటుతో పోయాడు’.. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటాం. ఒకప్పుడు, అరవై దాటినవారే గుండె వ్యాధులతో మృత్యువాత పడేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో నలభై నిండకుండానే లేత గుండెలు ఆగిపోతున్నాయి. చాలా సందర్భాల్లో హృద్రోగ లక్షణాలు ఏ మాత్రం కనిపించకుండా.. అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు నిర్ధారిస్తున్నారు. అసలు, బ్లాకేజ్ ఎందుకొస్తుంది? గుర్తించడం ఎలా?.. మన జీవితంలోనూ ఆ ‘బ్లాక్’డే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని బ్లాకేజీ అంటారు. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోవడం, ఇతరత్రా కారణాల వల్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తంతో పాటు ఆక్సిజన్‌నూ సరఫరా చేస్తుంది. అదే సమయంలో గుండె తనకు తాను రక్తం, ప్రాణవాయువు అందించుకుంటుంది. ఆ సరఫరాకు సహకరించే నాళాల్లో అవరోధాలు (బ్లాక్‌లు) ఉత్పన్నం కావడం వల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్ అందవు. దీంతో, గుండె కండరాలకు రక్తసరఫరా నిలిచిపోయి ఆయా భాగాలు చచ్చుబడిపోతాయి. గుండె పనిచేయడం మానేస్తుంది. ఫలితంగా గుండెపోటు వస్తుంది.
రెండూ వేరువేరు
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. రెండూ వేరువేరు సమస్యలు. రక్త నాళాల్లో బ్లాక్‌లు.. అంటే అవరోధాలు.. ఏర్పడటం వల్ల ‘హార్ట్ ఎటాక్’ వస్తుంది. అదే గుండెలో విద్యుత్ ప్రసరణ ఆగిపోయి గుండె కవాటాల సంకోచ, వ్యాకోచాలు నిలిచిపోవడంతో ‘కార్డియాక్ అరెస్ట్’ ఉత్పన్నం అవుతుంది. అంటే, హార్ట్ ఎటాక్ అనేది కార్డియో అరెస్ట్‌కు దారితీస్తుంది. కానీ, అన్ని హార్ట్ ఎటాక్ల వల్లా కార్డియాక్ అరెస్ట్ రాకపోవచ్చు. హార్ట్ ఎటాక్ అనేది సర్వసాధారణం. ఎందుకంటే, రక్తనాళాలు 2-4 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉంటాయి. కొలెస్ట్రాల్, స్కాబ్ తదితరాల వల్ల కొన్నిసార్లు రక్తనాళాల్లో ఈ తరహా బ్లాక్స్ (అవరోధాలు) ఏర్పడతాయి. కొన్నిసార్లు, టీనేజ్లోనే రక్త నాళాల్లో బ్లాక్స్ ఆరంభం కావచ్చు. వీటిని ఓ పట్టాన గుర్తించలేం. ఎందుకంటే, ఆ అవరోధాలు చాలా చిన్నగా ఉంటాయి. ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాలంటే బ్లాక్స్ పెద్దగా ఏర్పడాలి. కనీసం డబ్భు శాతం మేర బ్లాక్ అయితేనే కనిపెట్టగలం. ఆంజియోప్లాస్టీ, స్టెంట్, బలూన్ తదితర ప్రొసీజర్స్ ద్వారా ఈ బ్లాక్స్‌ను గుర్తించి, అదీ 70 శాతం ఉంటేనే వాటిని ఓపెన్ చేసి అవరోధాలను తొలగిస్తారు, స్టెంట్ వేస్తారు.
70 శాతం బ్లాక్స్ ఉన్నవారిలో గుండెనొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి. సాధారణంగా యాభై, అరవై ఏండ్లు పైబడిన వారిలోనే ఈ స్థాయిలో బ్లాక్స్ ఉంటాయి. అవి మరింత పెరగడానికి కొంత సమయం పడుతుంది. వీటిని వివిధ మార్గాల్లో గుర్తించి తొలగిస్తారు. దీంతో గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ ముప్పు తప్పుతుంది. ఇక చిన్న వయసు వారి విషయానికొస్తే.. 20 నుంచి 40 శాతం మాత్రమే బ్లాక్స్ ఉంటాయి. ఇవి 70 శాతానికి పెరిగితే కానీ చికిత్స చేయడం కుదరదు. కానీ అంతలోనే.. 40 శాతం ఉన్న బ్లాకేజ్‌లు బ్రేక్ కావచ్చు. కాబట్టే, వీటిని ‘అన్స్టేబుల్ బ్లాక్స్’ అంటారు. వీటివల్ల గుండె రక్తనాళాల్లో గాయం ఏర్పడుతుంది. రక్తం వస్తుంది. దీంతో రక్తనాళాల్లో స్కాబ్ ఏర్పడి అప్పటి వరకూ ఉన్న 40 శాతం బ్లాకేజ్ ఒక్కసారిగా 100 శాతానికి చేరుకుంటుంది. ఈ పరిణామమంతా ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే.. నిశ్శబ్దంగా జరిగిపోతుంది. ఈ విధంగా చిన్నపాటి బ్లాక్‌లు బ్రేక్ కావడం వల్ల 70 శాతం మంది హార్ట్ఎటాక్, కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించేందుకు సరైన పరీక్షలు లేవు. బీపీ, షుగర్ వంటి రుగ్మతలు కూడా లేని పరిపూర్ణ ఆరోగ్యవంతులైన యువతలో గుండెపోటు మరణాలకు కారణం ఇదే.
ఎవరిలో అవుతుందో చెప్పలేం
సాధారణంగా 70 శాతం లోపు బ్లాకేజ్ ఉంటే.. వైద్యులు వాటిని తొలగించరు. వాటివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదనుకుంటారు. అయితే కొంత మందిలో 30, 40 శాతం ఉన్న బ్లాకేజ్ బ్రేక్ కావడం వల్ల కూడా హఠాన్మరణాలు సంభవిస్తాయి. చిన్న
వయసు వారిలో.. 30-40 ఏండ్లవారిలో 20-40 శాతం బ్లాకేజ్ సర్వసాధారణం కనుక దీనిని పెద్ద ప్రమాదంగా పరిగణించరు. అయితే, ఎవరిలో ఈ చిన్నపాటి బ్లాకేజ్‌లు బ్రేక్ అవుతాయో కచ్చితంగా చెప్పలేం. దీనిని ముందస్తుగా గుర్తించే పరికరాలు ఇప్పటివరకూ లేవు. ఈ అంశంపై అంతర్జాతీయంగా మరింత పరిశోధన జరుగుతున్నది. చిన్నపాటి బ్లాక్‌లు పగిలిపోయి, రోగి గుండెనొప్పికి గురవుతున్నప్పుడు, గంట లోపలే చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. కొంత కష్టమే అయినా రోగి బతికే అవకాశాలూ ఉంటాయి. అందుకే దాన్ని ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఆ సమయం మించిపోతే రోగిని బతికించడం కష్టం. ఈ కీలక ఘడియల విషయంలో చాలామందికి అవగాహన ఉండటం లేదు.
కారణాలు ఇవే..
చిన్నపాటి బ్లాకేజ్‌లు బ్రేక్ కావడానికి పొగతాగడం, షుగర్, బీపీ, మానసిక-శారీరక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఇన్ఫెక్షన్స్ .. ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఇక బ్లాకేజ్ లక్షణాల విషయానికి వస్తే..
గుండెలో బరువుగా ఉండటం.
గుండెపై కొట్టినట్టు లేదా ఏదో బరువు పెట్టినట్టు అనిపించడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
ఆయాసం.
ఎడమ చేతి భుజం, మెడ, ఛాతిలో నొప్పి.
ఈ వలయాన్ని తప్పించుకోడానికి.. ప్రత్యేకించి మందుల అవసరం లేదు. ధూమపానం మానేయాలి. మధుమేహం నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిదిద్దుకోవాలి. ధ్యానం, యోగ, మంచి ఆహారం ద్వారా కూడా బ్లాకేజ్
తగ్గించవచ్చు.
హార్ట్ ఎటాక్తోనే కార్డియాక్ అరెస్ట్
కొందరిలో హార్ట్ ఎటాక్ వస్తే.. కార్డియాక్ అరెస్టు కూడా వస్తుంది. మరికొందరికి మాత్రం హార్ట్ ఎటాక్‌తో పాటు ఇతర సమస్యలు దాడి చేస్తాయి కానీ, కార్డియాక్ అరెస్ట్ రాదు. ఇంకొంత మందికి హార్ట్ ఎటాక్ తరువాత గుండె ఫెయిల్ అవుతుంది. గుండెలోపల రంధ్రం
ఏర్పడటం, గుండె వాల్వ్స్ దెబ్బతినడం కూడా జరుగుతుంది. కొన్ని సార్లు గుండె కవాటాలు మూసుకోవు.. తెరుచుకునే ఉంటాయి. హార్ట్ ఎటాక్ వస్తే కాపాడవచ్చు. కానీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అయితే.. అందులోనూ కార్డియాక్ అరెస్ట్ వస్తే రోగిని కాపాడటం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో 10 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉంటాయి. హార్ట్ ఎటాక్ లేకుండానే కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ పరిస్థితి ఎక్కువ. కారణం విద్యుదీకరణ లోపం. అరుదుగా పెద్ద వారిలో కూడా హార్ట్ ఎటాక్ లేకుండా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి పోతారు. దీనిని ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’ అంటారు. పుట్టుకతో వచ్చిన గుండె సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. ఏది ఏమైతేనేం.. మన జాగ్రత్తలో మనం ఉండాలి. గుండెకు సంబంధించి ఏ అసాధారణ లక్షణం కనిపించినా స్పందించాలి. ఆరోగ్యకర జీవన
శైలిని ఎంచుకోవాలి. చెడు అలవాట్లను వదిలించుకోవాలి. అప్పుడే, గుండె నిండైన ఆరోగ్యంతో.. నిరంతరాయంగా పనిచేస్తుంది.
…?మహేశ్వర్‌రావు బండారి