BP and Foods | మన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారాల కారణంగా మనలో రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. పని ఒత్తిళ్లు, ఇంటా బయటా సమస్యల కారణంగా రక్తపోటు ప్రస్తుతం అందరిలో సర్వసాధారణమైందని చెప్పాలి. బీపీ మనిషి నుంచి మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మారుతుంది. అలాగే, సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుంచి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంది. ఆరోగ్యవంతుల రక్తపోటు సిస్టోలిక్ ప్రెషర్లో 90 నుంచి 120 మి.మీ, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్లో 60 నుంచి 80 మి.మీ గా ఉంటుంది.
అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధులు రావడానికి అవకాశాలను పెంచుతుంది. బీపీ అతి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసకబారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావొచ్చు. కళ్లు దెబ్బతింటాయి. అయితే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా, సరైన ఆహారాలు తినడం ద్వారా అధిక రక్తపోటును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.
దాగి ఉన్న సోడియం..
ఆహారాల్లోని సోడియం స్థాయిలు రక్తపోటును పెంచుతుంది. తక్కువ క్యాలరీలు లేదా జీరో షుగర్ అని లేబుల్ చేసిన ఆహారాలు శరీరం బరువు తగ్గడంలో సహాయపడతాయనే నమ్మకంతో మనం తరచుగా తింటుంటాం. ఇక్కడ విషయమేమిటంటే ఈ వస్తువులన్నింటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది మనలో రక్తపోటును పెంచడమే కాకుండా ఉబ్బరాన్ని కలిగిస్తుంది. మన శరీరం ఆకారాన్ని మార్చేస్తుంది. ప్యాక్ చేసిన ఆహారాలను తినకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినే ముందు వాటి లేబుల్‌ని చదవాలి.
సమతుల్య ఆహారం..
మనం రోజంతా శక్తి కలిగి ఉండేందుకు, ఉత్సాహంగా పనిచేసుకునేందుకు అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. రక్తపోటును నివారించుకోవడంలో DASH ఆహారాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ముడిపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల రక్తపోటును పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారాల్లో కొలెస్ట్రాల్‌ను సంతృప్త కొవ్వులను పరిమితం చేసుకోవడంపై దృష్టిపెట్టాలి.
కెఫిన్ మానుకోవడం..
మనలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగగానే దాని నుంచి కెఫీన్ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. మొదటి సిప్‌లు టేస్టీగా ఉన్నా.. ఆ తర్వాత దాని ప్రభావం విపరీతంగా ఉన్నది బోధపడుతుంది. అడ్రినల్ గ్రంథులు మరింత ఆడ్రినలిన్‌ను విడుదల చేయడానికి కెఫిన్ కారణమవుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అందుకని, కెఫీన్‌ను తగ్గించుకోవడం లేదా డికాఫ్ కాఫీ లేదా ఇతర ప్రత్యామ్నాయాలకు మారడం ఉత్తమం.
ఫైబర్ ఎక్కువ అవసరం..
రక్తపోటును తగ్గించడంలో సహాయపడే మరో ఉత్తమ మార్గం.. ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవడం. ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి పెద్ద ప్రేగులో పులియబెట్టినప్పుడు బయోయాక్టివ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి రక్తపోటును తగ్గించడంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మిల్క్ ఓట్స్ తినడం ద్వారా రోజును ప్రారంభించడం చాలా ఉత్తమం. ఇది రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
సిట్రస్ పండ్లు తినడం..
సిట్రస్ పండ్లలో నిమ్మకాయలు, నారింజలు, ద్రాక్షపండ్లు, పుల్లని రుచి కలిగిన ఏదైనా ఇతర పండ్లు ఉంటాయి. సిట్రస్ పండ్లను తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది ఉప్పు నుంచి సోడియం ప్రభావాలను ఎదుర్కోవడంలో సాయపడుతుంది. అంతేకాకుండా, సిట్రస్ పండ్లు సహజమైన విటమిన్ సీ కలిగి ఉండి బలమైన వ్యాధినిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఉపయోగపడుతుంది. సిట్రస్ పండ్లను పగటిపూట తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.