Life Style | మీ పొట్ట చెత్తబుట్ట కాదు. అడ్డమైన చెత్త పదార్థాలతో దాన్ని నింపేయకండి. అది ఒక దేవాలయం లాంటిది. బతుకు చక్రం నడవడానికి కావాల్సిన శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోండి. దాని ప్రయోజనాలను గుర్తించండి. ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశారంటే వ్యాధులు దాడిచేస్తాయి. అప్పుడు మందులనే ఆహారంగా తీసుకోవలసిన దుర్గతి పడుతుంది. అందుకే.. ‘ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం’ అన్న స్పృహతో ఉండాలి. మన పెద్దలు చెప్పిన ఆహార నియమాలను పాటించాలి. పౌష్టికాహార నిపుణుల సూచనలతో ముందుకు సాగాలి. జీవిత రథయాత్ర సాఫీగా సాగిపోవడానికి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి అవగాహన ఉండాలి.
-డా॥ పార్థసారథి చిరువోలు
“దీపూ, ఎలా ఉన్నావు?”
“బానే ఉన్నాను డాక్టర్”.
“నేను చెప్పినట్టు చేశావా? ఉదయం నాలుగు చపాతీలు, సాయంత్రం నాలుగు చపాతీలు తీసుకోమన్నాను. తీసుకున్నావా? అలాగే తాజా పండ్ల రసం ఒక గ్లాసు తీసుకోమన్నాను. దాంతోపాటు రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు మరిచిపోకుండా తాగమన్నాను. నేను చెప్పిన ఆరోగ్యసూత్రాలను పాటించావా?”
“ ఆ.. పాటించాను డాక్టర్..”.
“వారం దాటిందనుకుంటాను. నువ్వు ఏమైనా బరువు తగ్గావా?”
“ లేదు డాక్టర్..”
“అదేంటి?”
“లేదు డాక్టర్. మరి కాస్త పెరిగాను. ఇప్పుడు నేను..” తను పెరిగిన బరువు గురించి చెప్పింది దీపు.
“ అదెలా? చాలామందికి ఇదే సిఫారసు చేశాను. మంచి రిజల్ట్‌తో తిరిగి వచ్చారు. ఇంతకూ నేను చెప్పిన ప్రణాళికను అమలుచేశావా?”
“ఆ డాక్టర్… ఉదయం నాలుగు చపాతీలు, రాత్రి నాలుగు చపాతీలు తీసుకోమన్నారు. దానితో లంచ్‌కి ముందు ఒకసారి, డిన్నర్ తర్వాత ఇంకోసారి తీసుకున్నాను. స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. టైమ్‌కి వచ్చేసేవి”.
ఈ మాటలకు స్పృహ తప్పి పడిపోవటం డాక్టర్ వంతయ్యింది.
ఇది సరదాకు అల్లిన కథయినా చాలామంది వ్యక్తులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. తగిన ఆహార నియమాలను పాటించటం లేదు. శరీరాన్ని క్రమబద్ధంగా ఉంచుకోవటం లేదు. డైటింగ్లు, ఉపవాసాలు అంటున్నారు. అవైనా సరిగ్గా చేస్తున్నారా అంటే సంతృప్తికరమైన సమాధానం కనిపించదు.
ప్రజలు తమ వ్యక్తిగత అభిరుచుల మేరకు వివిధ ఆహారాలను ఇష్టపడతారు. కొంతమంది రోజువారీ ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటే, మరికొంతమంది ఆహారం తక్కువ తీసుకుని చిరుతిళ్లు ఎక్కువ తింటారు. బరువు పెరిగిపోతామన్న భయంతో ముద్ద ముద్ద లెక్కపెట్టుకుని తినే వాళ్లూ ఉంటారు. కొంతమంది గిర్నీలో మాదిరిగా నోట్లో ఏదో ఒకటి వేసుకుని ఎప్పుడూ నములుతూ కనిపిస్తారు. తినే పదార్థం ఏమిటనే అంశంపైన వాళ్లకు పెద్దగా పట్టింపు ఉండదు.
కానీ, ఎవరైనా తాము తినే పదార్థాన్ని ఎంచుకోవటంలోనూ, దాన్ని సరిగ్గా తినటంలోనూ ఓ పద్ధతిని, మర్యాదని పాటిస్తే ఆరోగ్యానికి పూచీ లభిస్తుంది.
ఎంత తింటున్నామనే కంటే ఏం తింటున్నామనేది ముఖ్యం. ఇది నిపుణులు మనకు చేస్తున్న సూచన కాదు. హెచ్చరిక! కొంతమంది జీవించటానికి తింటే, తినటం కోసమే జీవించే వాళ్లు ఉన్నారు. కొంతమంది ఏది తిన్నా బాగా ఇష్టంగా తింటారు. దాంతో అది వారికి బాగా వంటపడుతుంది. రకరకాల హోటళ్లు, రెస్టారెంట్లతో మార్కెట్లో కొత్త కొత్త రుచులు ప్రవేశిస్తున్నాయి. ఇందులో ఆరోగ్యానికి మేలుచేసే వాటికంటే రకరకాల మసాలాలతో కూడి ఆరోగ్యానికి చేటు చేసేవే ఎక్కువ. ఈ మధ్య కాలంలో యూట్యూబర్లు రకరకాల ఆహార పదార్థాలపై విశ్లేషణలు చేస్తూ ప్రజల జిహ్వకు సవాలు విసురుతున్నారు.
శరీరం సమతుల్యంగా ఉండటానికి అందులో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు, మినరల్స్, లవణాలు, విటమిన్లు అనే ఐదు భాగాలు సరైన మొత్తంలో ఉండాలి. ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకోవాలనేది ఆ వ్యక్తి బరువు, ఎత్తు, జెండర్, అతను చేసే పనిపైన ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ చేసేవాళ్లు కొంచెం అధికంగా ఆహారం తీసుకుంటారు. సాధారణమైన అంచనాల ప్రకారం రోజూ పురుషులు 2,500 క్యాలరీలు, స్త్రీలు 2,000 క్యాలరీలు, పిల్లలు 1200 నుంచి 1400 క్యాలరీల ఆహారం తీసుకోవాలి. ఒకేసారి భారీగా తినటం కంటే చిన్న చిన్న భోజనాలు రోజులో ఎక్కువసార్లు తినటం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనాల మధ్య ఆరుగంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆహారం జీర్ణం కావటానికి తగినంత సమయం దొరుకుతుంది.
గతంలో ఆహారం తినటానికి అరటి ఆకులను, తామర ఆకులను, మోదుగు ఆకులను వాడేవాళ్లు. ఈ ఆకుల్లో తినటం వల్ల అవి పరోక్షంగా లాలాజాలాన్ని ఉత్పత్తి చేసేవి. ఫలితంగా జీర్ణక్రియ వృద్ధి అయ్యేది. అలాగే ఇప్పటి మాదిరిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేయటం ఉండేది కాదు. అందరూ హాయిగా నేల మీద కూర్చుని భోజనం చేసేవాళ్లు. దీనివల్ల పొట్టలో మూడింట రెండు వంతుల భాగం వంగుతుంది. ఫలితంగా మన ఉదరం నాలుగు లీటర్ల నీటిని తనలో ఇముడ్చుకోగలుగుతుంది. ఉష్ణగతికశాస్త్రం.. అంటే లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఇక్కడ పనిచేస్తుంది. అది అద్భుతాలను చేస్తుంది. దానివల్ల కొవ్వు దూరమవుతుంది. ఊబకాయం తగ్గుతుంది. కాబట్టి, పద్మాసనం వేసుకుని భోజనం చేయాలి.
రకరకాల కాయగూరలతో ఆహారాన్ని రంగుల మయంగా చేసుకోవాలి. అన్నట్టు ఏడు రకాలైన తెల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం దూరం పెట్టాల్సిన ఆ ఏడు తెల్లటి పదార్థాలు ఏవంటే.. చక్కెర, ఉప్పు, పాస్తా, మైదా, చక్కెరలు జోడించిన పాల పదార్థాలు, బాగా మరపట్టిన బియ్యం, ఆలుగడ్డ చిప్స్. ప్రముఖ క్రీడాకారులు, సినిమా నటులు, ఇతర సెలెబ్రిటీలు ఎక్కువ కార్బొహైడ్రేట్లు కలిగిన పాలిష్డ్ బియ్యానికి దూరంగా ఉంటారు. ఉదాహరణకు ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కువగా కూరగాయలు, కినోవా, పాలకూర ఉన్న ఆహారం తింటాడు. ఉడికించి, ఆవిరిలో వండిన మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసంతో కూడిన ఆహారం ఎక్కువగా తింటాడు.
గోధుమలు, మక్కజొన్న, రాగి, ఇతర రకాల పప్పులు, తృణధాన్యాలు, బార్లీ, పెసర, శనగ, పల్లీ, బటానీ, సోయాబీన్ వంటి వాటిని మొలకలుగా ఉపయోగించుకోవచ్చు. ఆల్ఫాల్ఫాను మొలకలన్నిటిలో రారాజుగా చెప్పుకోవచ్చు. ఇందులో అత్యధికస్థాయిలో ఖనిజాలు, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. మొలకలు తయారు చేసుకోవడం చాలా సులువైన ప్రక్రియ. మనం ఎంచుకున్న గింజలను శుభ్రమైన నీరున్న పాత్రలో నానబెట్టాలి. తగినంత గాలి పోయే విధంగా ఏర్పాటుచేసి మూతపెట్టాలి. దాదాపు 8 నుంచి 12 గంటల తర్వాత, నీటిని మొత్తం తొలగించాలి. అంతే మొలకలు సిద్ధం. పోషక విలువలు యథాతథంగా అందాలంటే మొలకలను పచ్చిగానే తీసుకోవాలి.
పదిహేను రోజుల్లో 2 నుంచి 5 కిలోల బరువు తగ్గే చిట్కా ఉంది. ‘ఇది శాస్త్రీయమా? ఆయుర్వేదం లేదా అలోపతి వైద్యవిధానాలు సిఫారసు చేశాయా?’ అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే, దీని వెనక ప్రాచీన భారతీయ సంప్రదాయ రుజువులు ఉన్నాయి. కొన్ని తరాల వారు దాన్ని ఆచరించి మంచి ఫలితాలను అందుకున్నారు. అవసరమైన వాళ్లు ప్రయత్నించి చూడొచ్చు. ప్రకృతి మనకు 32 దంతాల అమరికను ఊరకే ఇవ్వలేదు. కానీ, మనం దాని ప్రయోజనాన్ని విస్మరిస్తున్నాం. జంతువులా ఆహారాన్ని గబుక్కున మింగేస్తున్నాం. దానివల్ల అది అరగటానికి ఎక్కువ శక్తిని వెచ్చిస్తున్నాం. జంతువులకు నెమరువేసుకునే వెసులుబాటు ఉంది. మనుషులకు ఆ సౌలభ్యం లేదు. కానీ ఆహారాన్ని బాగా నమిలి తింటే అది బరువు తగ్గటానికి ఉపకరించే ప్రక్రియగా మారుతుంది. మీరు నోట్లో పెట్టుకునే ప్రతి ముద్దనూ దవడలకు రెండు వైపులకీ తీసికెళ్లి 32 సార్లు నమలాలి. ఆ తర్వాతే ఆహారాన్ని ఒక్క గుటకలో మింగేయాలి.
మనం తినే ఆహారంపైన పరిమితి విధించుకునే సందర్భంలో మన మనసు దానికి అంగీకరించదు. అయితే, మన బుద్ధి పూర్తిగా సహకరించకపోతే మనం పనీ చేయలేం. అందుకే చాలామంది బరువు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో మునుపటి కంటే ఎక్కువ కొవ్వు వాళ్లలో చేరుతుంది. అందుకే మనస్ఫూర్తిగా ఆహార నియంత్రణ పాటించటానికి సిద్ధం కావాలి. డైటింగ్ చేస్తున్న సమయంలో మనసులో ఆయా ఆహారపదార్థాల గురించిన చింతనను పక్కన పెట్టాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని గుర్తించాలి.
గతంలో అతిథులను ఇంటికి ఆహ్వానించినప్పుడు వారికి షడ్రసోపేతమైన విందు ఇచ్చామని చెప్పుకొనేవారు. అంటే, షడ్రుచులతో కూడిన భోజనం వారికి అందించారని దీని అర్థం. అసలు షడ్రుచులు అంటే ఏమిటి? తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటువు), చేదు (తిక్తం), వగరు (కషాయం). తరతరాలుగా ఆయుర్వేద నిపుణులు పోషకవిలువలను కాపాడుకునేలా ఆహారపదార్థాలను స్వీకరించాలని, జీర్ణప్రక్రియని ఉత్తేజపరిచేలా శిక్షణ ఇవ్వాలని చెబుతూ వస్తున్నారు. అందుకు వారంలో కనీసం ఒక రోజైనా మీ భోజనంలో ఈ ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆరు రుచులు అదనంగా ఉండే వాత, కఫ, పిత్తాలను తొలగించటానికి పరిష్కారం చూపుతాయి. ప్రతి మనిషి శరీరం వాత, కఫ, పిత్తాల సమాహారం. కాబట్టి, మీ శరీర తత్త్వానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
దవడలు రెండు వైపులా ఆహారాన్ని నములుతున్నప్పుడు, ఎడమ భాగం మెదడులో కుడివైపుని, కుడి భాగం మెదడులో ఎడమవైపుని చైతన్యపరుస్తాయి. అంటే.. మెదడు రెండు వైపులా చైతన్యానికి గురవుతుంది. మరే సందర్భంలోనూ ఇది సాధ్యం కాదు. 32 సార్లు నమలకుండా ఏ ఒక్క చిన్న భాగం లోపలకు వెళ్లకూడదన్న విధానం వల్ల మొత్తం ఆహారం అంతా గుజ్జు మాదిరిగా తయారవుతుంది. దానికి లాలాజలం కూడా జత కూడుతుంది. లాలాజలంలో జీర్ణశక్తిని పెంచే ‘టయలిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే తిన్న ఆహారం 30 శాతానికి వచ్చేస్తుంది. దాంతోపాటు 200 మిల్లీ లీటర్ల లాలాజలంతో కూడి ఆహారం పొట్టలోకి వెళుతుంది. జీర్ణప్రక్రియ తేలికగా, తక్కువ శక్తితో పూర్తవుతుంది. దీనివల్ల మలబద్ధకం అన్న సమస్య ఉత్పన్నం కాదు.
భోజనం చేసే సమయంలో దిక్కులు చూడటం, ఇతరులతో మాట్లాడటం, చదవటం, వినటం లాంటివి చేయకూడదు. వీడియోలు, ఆడియోల ద్వారా వినోదం పొందాలని చూడొద్దు. భోజనం చేయటానికి ముందు మనసును పూర్తిగా దానిపైనే లగ్నం చేయాలి. లక్షలాది మంది తినటానికి తిండి లేక పస్తులు ఉంటున్న పరిస్థితిలో మనకు ఆహారం వండి, వడ్డించిన వ్యక్తులకు కృతజ్ఞత చూపాలి. భారతీయ సంస్కృతి కూడా ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవిస్తుంది. అలాగే తినేటప్పుడు మంచినీళ్లు తాగే అలవాటును పూర్తిగా పక్కన పెట్టాలి. భోజనం అయ్యాక ఓ అరగంట తర్వాత నీరు సేవించండి. అప్పుడే మన శరీరం ఆహారాన్ని వేగంగా శోషించుకుంటుంది.
జంక్ ఫుడ్ విపరీతంగా తినడం, వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు అనారోగ్య కారకాలు. వారానికి ఓసారి ఉపవాసం ఉండటం మంచిదే. అప్పుడప్పుడు కడుపును ఖాళీ చేయటానికి మన పెద్దవాళ్లు ఉపవాసాన్ని సిఫారసు చేసేవారు. పాత రోజుల్లో చంటి పిల్లలతో ఆముదం తాగించటం ఇందులో భాగమే. ఉపవాసం పేరుతో భోజనం చేయకుండా ఇష్టమైన ఫలహారాలను దండిగా లాగించటం మంచి పద్ధతి కాదు. ఉపవాసం.. అంటే దైవానికి సమీపంగా ఉండటం. తక్కువ తిని మనసును భగవంతునిపైన లగ్నం చేయటానికి ఇదో మార్గం.
జ్యూస్ థెరపీగా పిలిచే ఈ విధానంలో వారానికి ఓసారి ఆయా వ్యక్తులకు అనుకూలంగా ఉండే విధంగా, ఆహారం స్వీకరించకుండా పొట్టకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. అది దాని శక్తిని కోల్పోకుండా పండ్లరసాలను అందించాలి. 24 గంటల జ్యూస్ థెరపీలో, నిద్రపోయే సమయాన్ని పక్కన పెట్టి.. ప్రతి రెండు గంటలకోసారి వివిధ రకాల పండ్లరసాలను స్వీకరించాలి. ఎవరికి వారు స్వయంగా దీనిపైన నిర్ణయాలు తీసుకోవటం కాకుండా, వారివారి ఆరోగ్య పరిస్థితి ప్రకారం తగిన వైద్య సలహాలను పొందిన తర్వాతే జ్యూస్ థెరపీ ఆచరించటానికి సిద్ధం కావాలి.
సంపూర్ణ పోషకాలతో ఉండే సలాడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆహార నిపుణుల మాట. ఇందుకు సంబంధించిన వివరాలు మీకు ఆన్లైన్లో ఎక్కడైనా లభిస్తాయి. సలాడ్ తయారీకి అవసరమైన పదార్థాలు… మిరియాలు, పల్లీలు, తురిమిన క్యాబేజీ ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, దానిమ్మ, నిమ్మ, తేనె, ఎండుద్రాక్ష, శొంఠి, పచ్చిమిర్చి, పిస్తాపప్పు, ఖర్జూరం, తురిమిన కొబ్బరి, వాల్నట్, బాదం మొదలైనవి. మరో రకం సలాడ్‌కి అవసరమైన పదార్థాలు… తాజా కీరదోసకాయ, పెద్ద ఉల్లిపాయ, పల్లీలు, మొలకెత్తిన పెసలు, శొంఠి, కాప్సికం (ఎరుపు/ఆకుపచ్చ), ఆలివ్ ఆయిల్.
తినే ఆహారాన్ని ఔషధంలా భావించాలి. సరైన పోషక విలువలతో కూడిన పదార్థాలను స్వీకరించాలి. అప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. మందులనే ఆహారంగా తీసుకోవలసిన దుస్థితి నుంచి బయట పడతాం. ఆ సత్యాన్ని గ్రహించి ఆహారంలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవాలి.
1 సరైన సమయంలో తినాలి. ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. చిరుతిండ్లు వద్దు.
2 ఆకలి వేసినప్పుడే భోజనం చేయాలి. అలాగని తప్పనిసరి తంతుగా ఏదో మొక్కుబడిగా మెక్కకూడదు.
3 ఆహారాన్ని దుర్వినియోగం చేయొద్దు. అవసరమైన మేరకే తినాలి. అదనపు ఆహారాన్ని పొట్టలోకి నెట్టకండి.
4 వారంలో ఒక్క రోజైనా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలనే నియమాన్ని ఆచరించాలి.
5 డైటింగ్‌ను పాటించాలని అనుకుంటే పౌష్టికాహార నిపుణుడిని, వైద్యుడిని సంప్రదించాలి.
6 ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని అర లీటరు నీళ్లు, లేదా నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి.
7 భోజనం సమయంలో మీ ఆలోచలనలన్నీ తినటంపైనే కేంద్రీకరించాలి.
8 రోజూ భోజనం పూర్తయ్యాక కనీసం ఒక పండైనా తినటానికి ప్రయత్నించాలి.
9 పడుకోవటానికి కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించాలి.
10 తినే సమయంలో మీ ఒత్తిళ్లను, విచారాలను దూరంగా పెట్టాలి. అవి తిండిపైన ప్రభావం చూపకూడదు.
11 రాత్రి సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులైన పైథాగరస్, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, లియానార్డో డా విన్చీ, ఐజాక్ న్యూటన్, వోల్టేర్, హెన్రీ డేవిడ్ థోరో, జార్జి బెర్నార్డ్ షా, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, డాక్టర్ ఆల్బర్ట్ స్త్వ్రట్జిర్, మహాత్మాగాంధీ వీళ్లందరిలో ఉమ్మడిగా కనిపించే లక్షణం ఒకటి ఉంది. వాళ్లంతా శాకాహారులు. వాళ్లందరినీ ప్రపంచం ఆదర్శవ్యక్తులుగా కొలుస్తుంది. ఊబకాయం తగ్గాలనుకునే వారు శాకాహారం తినడం వల్ల కొంతమేరకు ప్రయోజనం పొందుతారు.