Beer Or Wine | మద్యం ప్రియులు ఆల్కహాల్లో అనేక రకాల వెరైటీ మద్యాలను సేవిస్తుంటారు. ఈ క్రమంలోనే రుచిని బట్టి బీర్, బ్రాందీ, విస్కీ, వైన్, రమ్, జిన్ వంటి మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. మద్యం ప్రియులు తమకు ఇష్టమైన మద్యాన్ని సేవిస్తుంటారు. శుభ కార్యాలు, విందులు, వినోదాల సమయంలో చాలా మంది మద్యం సేవించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మద్యం విషయానికి వస్తే దీన్ని పరిమిత మోతాదులో సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొందరు డాక్టర్లు సైతం చెబుతుంటారు. సైంటిస్టులు సైతం తమ అధ్యయనాల ద్వారా ఇదే విషయాన్ని పదే పదే చెబుతుంటారు. అయితే మద్యంలో బీర్, వైన్‌ను ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది సేవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందని మద్యం ప్రియులు అన్వేషిస్తున్నారు. దీనికి ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వైన్‌లో రెండు రకాల వైన్స్ ఉంటాయి. ఒకటి వైట్ వైన్, రెండోది రెడ్ వైన్. రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెను సంరక్షిస్తుంది. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం వైన్‌ను మోతాదులో తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
బీర్ విషయానికి వస్తే దీంట్లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల బీర్, వైన్ రెండూ గుండెకు ఆరోగ్యకరమైన పానీయాలే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎముకల ఆరోగ్యం విషయానికి వస్తే బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. బీర్లో సిలికాన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంతో వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇక వైన్‌లో సిలికాన్ ఉండదు. కనుక ఎముకల ఆరోగ్యం కావాలనుకునే వారు బీర్ తాగితే మంచిది.
బీర్లో ప్రీ బయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వైన్‌లో టానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి వస్తే బీర్, వైన్ రెండూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెదడు ఆరోగ్యం విషయానికి వస్తే వైన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరుపు వంటి వ్యాధులు రాకుండా వైన్ కాపాడుతుంది. అయితే బీర్లో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పెద్దగా ఉండవు. కనుక మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో వైన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.
అయితే క్యాలరీల విషయానికి వచ్చినా, ఆరోగ్యం విషయం చూసుకున్నా బీర్ కన్నా వైన్ అందించే లాభాలే ఎక్కువగా ఉంటాయి. కనుక వైన్‌ను తాగడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వైన్ తాగడం వల్ల లాభాలు కలిగినప్పటికీ మోతాదులో మాత్రమే సేవించాలని, మరీ విపరీతంగా సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలు కలగకపోగా శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుందని అంటున్నారు. కనుక ఆల్కహాల్‌ను సేవించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.