Low Blood Pressure | బిజీగా ఉండడం, మారిన జీవనశైలితో అనేక మంది బీపీ( BP ) బారిన పడుతున్నారు. ఒకరిద్దరు కాదు.. రోజురోజుకు బీపీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బీపీ రోగుల్లో కొందరికి హై బీపీ, మరికొందరికి లో బీపీ( Low Blood Pressure ) ఉంటుంది. అయితే హై బీపీనే ప్రమాదకరం.. లో బీపీ ప్రమాదకరం కాదనుకుంటే పొరపాటే. లో బీపీ వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లో బీపీ కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో లో బీపీ లక్షణాలు ఏంటి..? లో బీపీ నివారణకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో బీపీ అనేది 120/80 mmHg ఉంటుంది. 90/60 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు దానిని లో బీపీ అంటారని పేర్కొన్నారు. ఈ లో బీపీ అనేది శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని సూచిస్తుంది.
ఉన్నట్టుండి తల తిరగడం
నీరసంగా మారడం
అలసట రావడం
వికారం, వాంతులు రావడం
గుండె వేగంగా కొట్టుకోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం
కళ్లు మసకబారి పోవడం
మూత్ర పిండాల సమస్యలు సంభవించడం.. ఈ లక్షణాలు లోబీపీకి సంకేతాలు అని చెప్పొచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
బీట్రూట్లో నైట్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటి కారణంగా రక్తనాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాబట్టి లో బీపీ ఉన్న వారు బీట్రూట్ను తీసుకోవడం మంచిది.
ఎండు ద్రాక్షలు అడ్రినల్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. ఎండు ద్రాక్షలను రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితోనే కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
వంటింట్లో లభ్యమయ్యే వెల్లుల్లి కూడా రక్తపోటును నియంత్రిస్తుంది. లోబీపీ ఉన్న వారు రాత్రి పడుకునే సమయంలో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మంచిది. మృదువైన కండరాల సడలింపునకు వెల్లుల్లి సహాయపడి.. రక్తం సరిగ్గా ప్రసరణ అయ్యేలా చేస్తుంది.
లోబీపీతో బాదపడేవారు ఉప్పును సాధారణ మోతాదులో వాడాలి. ఉప్పు శరీరంలో నీటిని నిల్వ చేసేందుకు సహాయ పడుతుంది. తద్వారా రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుని.. లో బీపీ సమస్య నుంచి బయటపడేస్తుంది. అయితే కొంచెం ఉప్పు కలిపిన నిమ్మ రసం తాగితే లో బీపీ నుంచి తక్షణ ఉపశమనం పొందొచ్చు.
వీటితో పాటు నీటిని కూడా బాగా తీసుకోవాలి. అంటే రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్లను తాగడం వల్ల లో బీపీని కంట్రోల్ చేయొచ్చు. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా మితంగా తినడం బెటర్. ఇక వ్యాయామం చేయడం వల్ల కూడా రక్తప్రసరణ మెరగవుతుంది.