వేసవి అనగానే.. పిల్లలకు ఈత నేర్పించాలని భావిస్తారు తల్లిదండ్రులు. పల్లెల్లో అయితే వాగులు, బావుల్లో పెద్దలు దగ్గరుండి ఈత కొట్టడం నేర్పిస్తుంటారు. అదే నగరవాసులు పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్‌కు తీసుకెళ్లి, శిక్షణ ఇప్పిస్తుంటారు. అయితే, ఈత నేర్చుకునే సందర్భంలో పిల్లల గొంతులోకి, చెవుల్లోకి నీరు చేరుతుంది. ఇది గొంతు, చెవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనివల్ల గొంతు, చెవిలో తీవ్రమైన నొప్పి పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే గొంతు బొంగురుపోవడం, చెవిపోటు లాంటివి ఎదురవుతాయి.
అయితే, ఈ సమస్యలకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును కలిపి.. రోజుకు 3-4 సార్లు పుక్కిలిస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. గోరువెచ్చని నీరు, అల్లం టీ, తేనె-నిమ్మరసం కలిపిన నీరు తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక చెవి నొప్పి నివారణకు.. శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో ముంచి, చెవిపై 5-10 నిమిషాలు ఉంచితే ఉపశమనం కలుగుతుంది. మూడు రోజుల కంటే ఎక్కువ కాలం నొప్పి ఉన్నా, మింగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి.