Periods Control | పెళ్లిళ్లు, దేవాలయాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన సమయంలో మహిళలు పీరియడ్స్‌తో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వాయిదా వేసుందుకు మాత్రలను ఆశ్రయిస్తుంటారు. ఈ మాత్రలు పీరియడ్స్‌ని తాత్కాలికంగా నియంత్రించేందుకు సహాయపడుతాయి. కానీ, వాటిని అనవసరంగా.. పదపదే వినియోగించడం వల్లతీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళల్లో హార్మోన్స్ మార్పులు పీరియడ్ సమయాన్ని నిర్ణయిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి నెలా మొదటి రెండువారాల్లో అండాశయాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా గర్భాశయ లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర బాగా ఎదిగి, మందంగా మారుతంది. అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు ఈ పొర సిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే.. ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావాల్సిన పోషకాలను, రక్త సరఫరాను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుపోయి ఎదగడానికి సహాయపడుతుంది. ఒవ్యులేషన్ తర్వాత రెండువారాలు ప్రొజెస్టెరాన్ ఎండోమెట్రియమ్ పొరను రక్షిస్తుంది. గర్భధారణ జరగకపోతే ప్రొజెస్టెరాన్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. దాంతో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బ్లీడింగ్ రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అయితే, ఈ పీరియడ్స్ ఆలస్యంగా వచ్చేందుకు భారీగా మాత్రలను వినియోగించే ధోరణి పెరుగుతోందని.. దాంతో మహిళలు తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
పీరియడ్స్ వాయిదా వేసుకుందుకు మాత్రలు వాడడం సరికాదని వైద్యులు పేర్కొంటున్నారు. పీరియడ్స్ ఇబ్బంది నుంచి తప్పించుకోవడడానికి ఈ మాత్రలు సహాయపడుతాయని.. ఈ మందులు పదే పదే వేసుకోవడంతో శరీరంలోని హార్మోన్లపై ప్రభావం పడుతుందని.. నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి శరీరం సహజ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. వీటిని క్రమం తప్పకుండా, అధికంగా వాడటం వల్ల తలనొప్పి, తల తిరగడం, మానసిక స్థితిలో మార్పులు వస్తుంటాయి. వికారం, రొమ్ములో గడ్డలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. వైద్యుల సూచనలు, సలహాలు లేకుండా ఈ మాత్రలను ఎక్కువగా తీసుకోవడం రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులు.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే, కొంతమంది మహిళల్లో ఈ మాత్రలు పునరుత్పత్తిపై ప్రభావం చూపుతాయి.
ఇప్పటికే థైరాయిడ్, డయాబెటిస్, అధిక రక్తపోటు, రక్త సంబంధిత వ్యాధులు ఉన్న మహిళలు వైద్యులను సంప్రదించకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మాత్రలు తీసుకోకూడదు. ఇవి 40 ఏళ్లు పైబడిన మహిళలు, ధూమపానం చేసే మహిళలకు మరింత ప్రమాదకరం హెచ్చరిస్తున్నారు. ఏదైనా ప్రత్యేక కారణం వల్ల పీరియడ్స్ వాయిదా వేయాల్సి వస్తే ముందుగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుందని.. కాబట్టి ఒకరికి సురక్షితమైనా.. మరొకరికి హానికరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.