Apples With Peel | రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు యాపిల్ లో ఉంటాయి. ఈ పండ్లు మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అందుకనే యాపిల్‌ను రోజుకు ఒకటి చొప్పున తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అందరూ చెబుతుంటారు. అయితే ఇది వాస్తవమే అయినప్పటికీ చాలా మంది యాపిల్ పండ్లపై ఉన్న తొక్క తీసేసి తింటారు. కానీ ఇలా తింటే అనేక పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. యాపిల్ పండ్ల తొక్కలో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కనుక యాపిల్ పండ్లతో పూర్తి ప్రయోజనాలు పొందాలంటే తొక్కతో సహా తినాల్సిందే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్ల తొక్కలో పండులో కన్నా విటమిన్ కె 332 శాతం అధికంగా ఉంటుంది.
విటమిన్ కె వల్ల ఎముకలు బలంగా మారడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకడుతుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు. పొట్టు తీసిన యాపిల్ కన్నా పొట్టుతో ఉన్న యాపిల్ పండులోనే విటమిన్ ఎ 142 శాతం అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. పొట్టు తీసిన యాపిల్‌తో పోలిస్తే పొట్టు ఉన్న యాపిల్‌లో విటమిన్ సి 115 శాతం అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. అలాగే పొట్టు కలిగిన యాపిల్ లో క్యాల్షియం 20 శాతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
పొట్టు కలిగిన యాపిల్ లో పొటాషియం 19 శాతం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాపిల్‌ను పొట్టుతో సహా తింటేనే ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. కనుక యాపిల్‌ను పొట్టుతో సహా తినాల్సిందే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లను తింటే ఫైబర్ అధికంగా లభించి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి అనిపించదు. దీంతో జంక్ ఫుడ్, ఇతర ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. యాపిల్‌ను పొట్టుతో సహా తింటేనే ఈ ప్రయోజనం లభిస్తుంది.
యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్వర్సెటిన్, కాటెకిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు యాపిల్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండడంతోపాటు టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. దీంతో క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఇలా యాపిల్ పండ్లను పొట్టుతో సహా తింటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే ప్రస్తుతం మనకు మార్కెట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన పండ్లు లభించడం లేదు. రసాయనాలు వాడి పండించిన పండ్లే అధికంగా లభిస్తున్నాయి. పైగా కొందరు వ్యాపారులు యాపిల్ పండ్లు మెరిసేలా కనిపించేందుకు వాటిపై రసాయనాలు, మైనం రాస్తున్నారు. కనుక చాలా మంది యాపిల్ పండ్లను తొక్కతో సహా తినేందుకు అంతగా ఇష్టం చూపించడం లేదు. కానీ బాగా కడిగి శుభ్రం చేస్తే యాపిల్‌ను తొక్కతో సహా తినవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలా యాపిల్‌ను తొక్కతో తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.