Apples | అత్యంత ప్రాచుర్యం పొందిన, ప్రకాశవంతమైన పండ్లల్లో ఆపిల్ కూడా ఒకటి. వివిధ రకాల ఆపిల్స్ ను అన్ని కాలాల్లో మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. రోజూ ఒక ఆపిల్ ను తీసుకోవడం వల్ల వైద్యుడి దగ్గరకు వెళ్లవలిసిన అవసరమే లేదన్న నానుడి కూడా మనందరికీ తెలిసిందే. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోనాలు పొందవచ్చు. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఖనిజాలతో పాటు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కనుక ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రోజువారీ ఆహారంలో భాగంగా ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
ఆపిల్ పండులో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకలిని నియంత్రిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అధిక ఆహారాన్ని, చిరుతిళ్లను తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుంది. దీంతో మన శరీర బరువు అదుపులో ఉంటుంది. అయితే ఆపిల్ జ్యూస్, ఫ్యూరీ వంటి వాటి కంటే పూర్తి ఆపిల్ ను తీసుకున్నప్పుడే మనకు ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆపిల్ లో ఫైబర్ తో పాటు క్వెర్సిటిన్, ఎపికాటెచిన్ అనే ఫినోలిక్ రసాయన ఆమ్లాలు ఉంటాయి. ఇవి ధమనుల గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి. దీంతో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
పిత్తాశయంలోని పిత్తం, అధిక కొలెస్ట్రాల్ కారణంగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడాన్ని నివారించవచ్చు. ఆపిల్స్ లో ఉండే ఫైబర్ శరీర బరువును అదుపులో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. తద్వారా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఆపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగులల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. విరేచనాలను తగ్గించడంలో కూడా ఆపిల్ మనకు సహాయపడుతుంది. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆపిల్స్ లో పాలీశాకరైడ్ పెక్టిన్ ఉంటుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను, చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆపిల్స్ లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను, కాలుష్య కారకాలను సహజంగా బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఆపిల్స్ లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒత్తిడితో బాధపడేటప్పుడు ఆపిల్ ను తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల మెదడు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మెదడు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడంతో పాటు నరాల ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఆపిల్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని రోజూ తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.