Apple Watch : హృద్రోగ లక్షణాలను పసిగడుతూ ఎమర్జెన్సీ పరిస్ధితుల్లో యూజర్లను అప్రమత్తం చేసి వారి ప్రాణాలను కాపాడటంలో యాపిల్ వాచ్‌లు పలు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించిన ఘటనలు కోకొల్లలుగా వెలుగుచూశాయి. ఈసీజీ వంటి ఫీచర్ల ద్వారా గుండె ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంతో పాటు గుండె లయ తప్పిన సమయాల్లో నోటిఫికేషన్లు పంపడం ద్వారా యాపిల్ వాచ్ తమను ఎలా కాపాడిందనేది పలువురు యూజర్లు చెబుతుంటారు.
యాపిల్ వాచ్ యూజర్లు తమ స్మార్ట్‌వాచ్‌లపై ఆధారపడుతున్న క్రమంలో ముఖ్యంగా హృద్రోగాలను గుర్తించడం, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో యాపిల్ వాచ్‌లు డాక్టర్లకూ కీలక టూల్‌గా మారాయి. యాపిల్ వాచ్ వైద్యులకూ ఎంతో సాయపడుతున్నదని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్‌కు చెందిన కార్డియాలజిస్ట్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ రాడ్ పాస్మన్ చెబుతున్నారు. హెల్త్ కేర్, గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించడం, సర్జరీ అనంతర రికవరీ వంటి విషయాల్లో ఈ డివైజ్ కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య సంరక్షణలో యాపిల్ వాచ్ రోగులకు మెరుగైన సూచనలు అందచేస్తుందని, జీవనశైలి ఎంపికలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి అవి బాగా అర్ధం చేసుకుంటాయని తెలిపారు. యాపిల్ వాచ్‌తో తన రోగులు ఏ ప్రాంతంలో ఉన్నా వారికి సరైన సూచనలు ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్య పరిస్ధితిని పూర్తిగా అవగతం చేసుకుని చికిత్స చేసే వెసులుబాటు ఉందని డాక్టర్ పాస్మన్ వివరించారు.
వ్యాధిని గుర్తించడంతో పాటు గుండె అసాధారణంగా కొట్టుకునే పరిస్ధితులను నియంత్రించేందుకూ ఈ డివైజ్ శక్తివంతమైన టూల్‌గా తమకు ఉపయోగపడుతుందని తెలిపారు. యాపిల్ వాచ్ ద్వారా యూజర్లు తమ గుండె ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంతో పాటు ఆయా వివరాలను తమ వైద్యులకు షేర్ చేసే వెసులుబాటు ఉందని చెప్పారు. దీంతో వైద్యులకు ఆయా రోగులకు అనువైన చికిత్సను నిర్ణయించే అవకాశం లభిస్తుందని అన్నారు.
Read More :
ప్రేమ పేరుతో ఆకతాయిల వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి