Apple Vs Banana | ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారు. బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. బరువు వేగంగా పెరుగుతున్నారు కానీ అంతే వేగంగా దాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. అయితే బరువు తగ్గాలంటే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే అందుబాటులో ఉన్న పండ్లను తింటుంటారు. అయితే అందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు, యాపిల్స్ పేరుగాంచాయి. ఈ పండ్లను రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయి. పైగా ఇవి బరువు తగ్గించడంలో ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే బరువును తగ్గించడంలో ఈ రెండింటిలో ఏ పండ్లు ఎక్కువ మేలు చేస్తాయి..? అని కూడా చాలా మందికి సందేహం వస్తుంటుంది. ఇక ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువును తగ్గించడంలో యాపిల్స్ ఎంతో ఉపయోగపడతాయని, అరటి పండ్ల కన్నా యాపిల్స్‌ను రోజూ తింటేనే బరువు త్వరగా తగ్గుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే యాపిల్‌ను ఒకటి తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. క్యాలరీలు చాలా తక్కువగా లభిస్తాయి. ఒక మీడియం సైజ్ యాపిల్‌ను తింటే సుమారుగా 95 క్యాలరీల శక్తి లభిస్తుంది. అదే అరటి పండు అయితే 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. యాపిల్ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక తక్కువ యాపిల్స్‌ను తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక అరటి పండ్ల కన్నా యాపిల్స్‌ను తింటేనే త్వరగా బరువును తగ్గించుకోవచ్చు. పైగా ఎక్కువ శాతం పోషకాలను కూడా పొందవచ్చు.
యాపిల్ పండును భోజనానికి, భోజనానికి మధ్య తింటే ఉపయోగం ఉంటుంది. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే వ్యాయామం చేసేవారు మాత్రం యాపిల్స్ కన్నా కూడా అరటి పండ్లను తింటేనే మేలు జరుగుతుంది. ఎందుకంటే అరటి పండ్లను తింటే శక్తి లభిస్తుంది. దీని వల్ల మరింత ఎక్కువ సేపు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయవచ్చు. దీంతో మరిన్ని క్యాలరీలను ఖర్చు చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఎక్కువగా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసేవారు అరటి పండ్లను తింటే మేలు జరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే యాపిల్ పండ్లను తిన్నంత మాత్రాన వ్యాయామం చేయకూడదు అని కాదు. యాపిల్ పండ్లను తిన్నా, అరటి పండ్లను తిన్నా వ్యాయామం చేయాల్సిందే. కానీ ఎక్కువ వ్యాయామం చేసేవారికి అరటి పండ్లు సూట్ అవుతాయి. తక్కువ వ్యాయామం చేసేవారు లేదా వ్యాయామం చేయని వారు యాపిల్ పండ్లను తింటే మేలు జరుగుతుంది.
ఇక ఈ రెండింటినీ కలిపి సలాడ్ రూపంలోనూ రోజూ తినవచ్చు. సగం అరటి పండును, సగం యాపిల్‌ను ముక్కలుగా కట్ చేసి సలాడ్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని రోజూ సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు. ఈ సలాడ్‌ను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధిత వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అయితే ఈ రెండు పండ్లను విడివిడిగా తినాలని చూస్తే యాపిల్ పండ్లను లంచ్‌కు 30 నిమిషాల ముందు లేదా డిన్నర్‌కు 30 నిమిషాల ముందు తింటే మంచిది. అదే అరటి పండ్లు అయితే ఉదయం వ్యాయామం చేయడానికి ముందు లేదా చేసిన తరువాత తినవచ్చు. ఇలా పండ్లను రోజూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.