An Apple A Day | రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని చెబుతుంటారు. అయితే ఈ నానుడి పూర్వకాలం నుంచి ఉన్నదే. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమీ లేనప్పటికీ మనకు ప్రకృతిలో అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన పండ్లలో యాపిల్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అందుకనే ఈ పండును రోజూ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే రోజుకో యాపిల్ పండును కచ్చితంగా తినాల్సిందేనని సోషకాహార నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకనే విషయంపై కూడా వారు సమాధానాలు చెబుతున్నారు. అవేమిటంటే..
నేటి తరుణంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. మలబద్దకం సమస్య నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది అవయవాల ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. మలబద్దకాన్ని నివారించకపోతే దీర్ఘకాలంలో ఇది పైల్స్‌గా మారుతుంది. అప్పుడు సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు యాపిల్ పండు పనిచేస్తుంది. దీన్ని రోజూ తింటే మలబద్దకం తగ్గడమే కాదు, జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్య బాధించదు. అజీర్తి తగ్గుతుంది. చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు కనుక వీటికి మెడిసిన్లను వాడే బదులు రోజుకు ఒక యాపిల్ పండును తింటే ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుకనే రోజుకు ఒక యాపిల్‌ను తినాలని వారు సూచిస్తున్నారు.
ఇక జీర్ణ వ్యవస్థల తరువాత అసలు సమస్య గుండెకు సంబంధించింది. ప్రస్తుతం చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. గతంలో పెద్దలకు మాత్రమే ఇది వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారు కూడా గుండె పోటుతో మరణిస్తున్నారు. అయితే ఇలా కాకుండా ఉండాలంటే రోజుకు ఒక యాపిల్‌ను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. యాపిల్‌ను తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బీపీ అదుపులోకి వస్తుంది. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే గుండె ఆరోగ్యంగా ఉండాంటే రోజూ ఒక యాపిల్‌ను తినాల్సిందేనని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు తగ్గడం అన్నది చాలా కష్టంగా మారుతోంది. అయితే రోజుకో యాపిల్‌ను తింటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోజుకో యాపిల్‌ను తింటే టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని, ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా యాపిల్ పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె, క్యాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే రోజూ ఒక యాపిల్‌ను తినాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.