Amla For Hair Growth | చలికాలంలో మనకు సహజంగానే చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారి దురద పెడుతుంది. మృదుత్వాన్ని, తేమను కోల్పోతుంది. అలాగే ఈ సీజన్లో మనల్ని జుట్టు సమస్యలు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. జుట్టు చిట్లిపోతుంది. కాంతి హీనంగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతోపాటు చుండ్రు సమస్య కూడా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఈ సీజన్లో లభించే ఉసిరికాయలతో అన్ని రకాల జుట్టు సమస్యలకు మనం చెక్ పెట్టవచ్చు. ఉసిరికాయలలో ఉండే పోషకాలు మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉసిరికాయను పలు రకాలుగా వాడడం వల్ల జుట్టును ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మార్కెట్లో మనకు ఉసిరికాయ నూనె లభిస్తుంది. దీన్ని జుట్టుకు వాడవచ్చు. జుట్టుకు బాగా మర్దనా చేసి గంట సేపు అయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అయితే ఈ నూనెను జుట్టుకు రాత్రిపూట పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మారుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
ఉసిరికాయ పొడిలో కాస్త పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాల్సి ఉంటుంది. అనంతరం 30 నిమిషాల పాటు ఆగి తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారంలో ఒకసారి పాటించాలి. దీంతో జుట్టుకు తేమ లభించి మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి.
జుట్టుకు షాంపూ పెట్టి తలస్నానం చేశాక జుట్టుకు ఉసిరికాయ జ్యూస్‌ను పట్టించాలి. తరువాత 5 నిమిషాల పాటు ఉండి కడిగేయాలి. ఇలా వారంలో ఒకసారి చేయాల్సి ఉంటుంది. దీంతో జుట్టు కుదుళ్ల దగ్గర పీహెచ్ స్థాయిలు సక్రమంగా ఉంటాయి. జుట్టు కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది.
ఎండిన ఉసిరి కాయ ముక్కలను కొబ్బరినూనెలో వేసి నూనె సగం అయ్యే వరకు మరిగించాలి. దీంతో తయారయ్యే మిశ్రమాన్ని జుట్టుకు వారంలో 3 సార్లు పట్టించాలి. దీంతో జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. ఇలా ఉసిరికాయలను ఉపయోగించడం వల్ల చలికాలంలో ఎదురయ్యే జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.