Okra Water | ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఓక్రా వాటర్ అంటే ఏంటో మీకు తెలుసా..! ఎప్పుడైనా ఈ నీటిని తాగేందుకు ప్రయత్నించారా..? ఇంతకీ ఏంటి ఈ నీళ్లు అనుకుంటున్నారా.. బెండకాయ నీరు! బెండకాయలను అడ్డంగా ముక్కలు చేసి.. 8 నుంచి 12 గంటల వరకూ నానబెట్టాలి. తర్వాత వాటిని అదే నీటిలో గట్టిగా పిండేసి వడకట్టుకోవాలి. కావాలనుకుంటే రుచి కోసం ఈ బెండకాయ నీటిలో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. అంతే ఓక్రా వాటర్ రెడీ. తయారీ సరే మరి.. దీన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలియాలి కదా..
ఓక్రా నీటిలో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-కేలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి పోషకాలు, విటమిన్లు , ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఓక్రా వాటర్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
1. ఓక్రా వాటర్లోని ఫైబర్ పేగుల కదలికలను మెరుగు చేస్తుంది. అరుగుదల సమస్యలు రాకుండా, మలబద్ధకం దరిచేరకుండా కాపాడుతుంది. పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియాను సమకూర్చి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
2. ఓక్రా వాటర్ తరచుగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్ అదుపులో ఉండని వారు, మధుమేహంతో బాధపడేవారికి ఓక్రా వాటర్ చక్కటి ఔషధంగా చెప్పవచ్చు.
3. బెండకాయ నీటిలో ఉండే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ను కలిగి ఉంటుంది.
4. ఓక్రా వాటర్లో విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడిని నుంచి రక్షించడమే కాక.. హానికరమైన టాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
5. ఓక్రా నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడం ద్వారా నిర్విషీకరణలో సహాయపడుతుంది. తరచుగా ఓక్రా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.