Amaranth Leaves | ఆకుకూరలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి. అయితే ఆకుకూరల్లో దేనికదే ప్రత్యేకం అయినప్పటికీ తోటకూర చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటుంది. తోటకూరతో అనేక రకాల వంటలను చేసి తింటారు. దీంతో వేపుడు, పులుసు, పప్పు వంటి కూరలను చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే పలు రైస్ వంటకాల్లోనూ తోటకూరను వేస్తుంటారు. చిన్నారులకు తల్లులు తరచూ తోటకూరను ఆహారంలో భాగంగా పెడుతుంటారు. దీని వల్ల వారికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే తోటకూర ఆరోగ్యకరమని తెలుసు కానీ దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇది మనకు ఏయే పోషకాలను అందిస్తుంది..? అన్న విషయాలు చాలా మందికి తెలియవు. కానీ ఈ విషయాలను పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తోటకూరను తరచూ తినాలని వారు సూచిస్తున్నారు.
తోటకూరలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇతర ఆకుకూరలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తోటకూరను తింటే కండరాలు నిర్మాణమవుతాయి. కండరాలకు మరమ్మత్తులు జరిగి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పి తగ్గుతుంది. కండరాలు వృద్ధి చెందుతాయి. దేహ దారుఢ్యం పెరుగుతుంది. తోటకూరలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. దీని వల్ల తోటకూరను తింటే ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. తోటకూరలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోని వారు తోటకూరను తినవచ్చు. దీని వల్ల పెద్ద మొత్తంలో క్యాల్షియంను పొందవచ్చు. క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
తోటకూరలో విటమిన్ కె కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. తోటకూరలో ఐరన్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అందువల్ల తోటకూరను తింటే హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఫోలేట్ వల్ల గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. వారు తోటకూరను తింటే ఫోలేట్ లభించి గర్భస్థ శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. దీని వల్ల పిల్లలకు పుట్టుక లోపాలు రాకుండా ఉంటాయి. తోటకూరలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఫైబర్ కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
తోటకూరలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తోటకూరలో ఉండే లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి కంటిలోని రెటీనాను రక్షిస్తాయి. దీని వల్ల కళ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా తోటకూరను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే దీన్ని రోజూ తినదలిస్తే గుప్పెడు మోతాదులో ఉడకబెట్టి తినాలి. లేదా రసం తీసి 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. ఇలా తోటకూరను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.