‘అల్జీమర్స్’ బాధితుల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తక్కువ స్థాయిలో ఉంటున్నాయట. సాధారణ మహిళలతో పోలిస్తే.. చిత్తవైకల్యం ఉన్న మహిళల్లో 20శాతం తక్కువగా ఉన్నట్లు ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. ‘కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్’ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా అల్జీమర్స్ ఉన్న 306 మంది, తేలికపాటి సమస్య ఉన్న 165 మంది, ఆరోగ్యకరమైన 370 మందిని ఎంపికచేశారు. వారి రక్తంలో కొవ్వు సమ్మేళనాలైన లిపిడ్ల స్థాయిలను విశ్లేషించారు. అల్జీమర్స్తో బాధపడుతున్న స్త్రీలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
నిజానికి అల్జీమర్స్ వ్యాధి పురుషుల కంటే మహిళల్లో రెండు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల సగటు జీవితకాలం ఎక్కువ కావడం, హార్మోన్లలో తేడాలు, రోగనిరోధక ప్రతిస్పందనలు, విద్యా అవకాశాలు వంటి వివిధ అంశాలు ఈ వ్యాధి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనకారులు చెబుతున్నారు.
అంతకుముందు జంతువులపై జరిపిన పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని తెలిపారు. ఒమేగా-3 సప్లిమెంటేషన్ మెదడులోని బీటా-అమిలాయిడ్ స్థాయులను తగ్గిస్తుందని అంటున్నారు. అదే సమయంలో అల్జీమర్స్తో బాధపడుతున్న వృద్ధులకు ఒమేగా-3 సప్లిమెంట్లు ఇవ్వడం వల్ల.. వారి జ్ఞాపకశక్తి పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదని గుర్తించారు. అందుకే, మొదటి నుంచీ ఒమేగా-3 సప్లిమెంట్లను తీసుకుంటే భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చినా.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.