దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు అంటారు. ఈ సూత్రాన్ని అనుసరించే.. కొందరు సమయం చిక్కినప్పుడే పనులను చక్కబెట్టుకుంటారు. శని/ ఆదివారాల్లోనే ఆ వారం వంటలకు కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా.. అల్లం, వెల్లుల్లి పొట్టుతీయడం, ఉల్లిగడ్డలను కోసిపెట్టడం.. ఇలా కష్టంగా అనిపించేవాటిని ముందే పూర్తిచేస్తారు. వాటిని ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టేసి.. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమయం కలిసొచ్చినా.. ఆయా పదార్థాలు ఆరోగ్యానికిహాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉల్లిపాయలు : ఒకేసారి కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకునే ఉల్లిపాయలు.. ఆరోగ్యానికి హానికరం. ఘాటైన వాసన కలిగే ఉల్లిపాయలను పొట్టుతీసి ఉంచేస్తే.. అవి విషపూరితంగా మారుతాయి. ఇందులో ఉండే సల్ఫర్.. కంటైనర్‌లోని ప్లాస్టిక్‌తో రసాయన చర్య జరిపి సల్ఫర్ సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. అంతేకాదు.. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉల్లిపాయల్లోని పిండి పదార్థం చక్కెరగా మారిపోతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
అల్లం : పొట్టు తీసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే అల్లంలో ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. అది మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆరోగ్యానికి మేలుచేసే అల్లంలోని సహజ సుగుణాలూ కోల్పోతుంది. కాబట్టి, అల్లాన్ని ఆరుబయట ఉంచడమే మంచిది. తాజాగా, ఎప్పటికప్పుడు పొట్టుతీసి వాడుకుంటేనే బాగుంటుంది.
వెల్లుల్లి : ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను ప్లాస్టిక్ బాక్స్‌లలో ఉంచి అమ్మకానికి పెడుతున్నారు. శ్రమ తగ్గుతుందని వీటిని కొని.. అలాగే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు కొందరు. కావాల్సినప్పుడు తీసి వాడుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే.. అందులోని పోషకాలు తగ్గిపోతాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ కారకంగానూ మారుతాయి. నిజానికి వెల్లుల్లిని ఆరు బయట గాలికి పెట్టేస్తేనే.. ఎన్నిరోజులైనా తాజాగా ఉంటుంది. కావాల్సినప్పుడు పొట్టు ఒలిచి వాడుకుంటే.. అందులోని సుగుణాలు శరీరానికి అందుతాయి. ఇక బయట కొన్నా, ఇంట్లోనే చేసుకున్నా.. అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ను కూడా ఎక్కువరోజులపాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు.