ఉదయం చేసే అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలిసినా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. తినకుండా ఉండటమో, చాలా ఆలస్యంగా తినడమో చేస్తుంటారు. అందులోనూ ఉపాహారానికి సంబంధించి మనలో బోలెడు అపోహలూ ఉంటాయి.
అపోహ: బరువు తగ్గాలనుకుంటే అల్పాహారం మానేయాలి
నిజం: రాత్రిపూట శరీరం విశ్రాంతి పొంది, రోజుకు కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. కానీ, ఉదయం లేచాక కూడా కొన్ని గంటల సేపు మనం ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ చర్య మరింత ఎక్కువగా జరుగుతుంది. దాంతో జీవక్రియ వేగం సన్నగిల్లుతుంది. అందుకే, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడం, లేదా మరీ ఎక్కువ కావడం వంటి
సమస్యలు ఏర్పడవు.
అపోహ: కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు కలిపి తినకూడదు
నిజం: బ్రేక్ఫాస్ట్ అనేది కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాల సమాహారంగా ఉండాలి. అందుకోసం గుడ్డు, కూరగాయలు, బ్రెడ్, గింజలు, పండ్లు, పాలు ఓట్స్, కూరగాయలతో నిండిన రోటీలు… ఇలా విభిన్న ఆహార పదార్థాలను ప్రయత్నించవచ్చు. నిజానికి కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు రెండూ జీవక్రియల వేగాన్నీ, కొవ్వు కరిగించే రేటునీ పెంచుతాయి.
అపోహ: ఆలస్యంగా తిన్నా ఫర్వాలేదు
నిజం: అల్పాహారం తీసుకోవడం ముఖ్యం కానీ, ఏ సమయంలో తిన్నామన్నది ముఖ్యం కాదు అనుకుంటారు చాలామంది. అలా భావించడం తప్పు. లేచిన గంటలోపు అల్పాహారాన్ని ముగించడం ఉత్తమం. ఆలస్యమైతే శరీరం ఎక్కువగా కొవ్వుల్ని కరిగించలేదు.
అపోహ: ఈట్ లైక్ ఎ కింగ్ అన్నట్టు, అల్పాహారం ఎక్కువ పరిమాణంలో అధిక పోషకాలతో తినాలి
నిజం: రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకుని, ఉదయం కడుపు నిండా తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అల్పాహారం ఎంత తీసుకోవాలి అన్నది ఆ మనిషి ఎత్తు, బరువు, ఎంత వ్యాయామం చేస్తున్నారు తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
అపోహ: అల్పాహారంగా కూరగాయలతో చేసిన స్మూతీ తీసుకుంటే సరిపోతుంది
నిజం: కేవలం స్మూతీలతో కడుపు నింపుకోవాలనుకోవడం సరికాదు. దీనివల్ల మళ్లీ ఆకలి వేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో సమతుల్యత ఉండదు. జీవక్రియ వేగం మందగిస్తుంది. స్మూతీతోపాటు ప్రొటీన్ ఉండే ఆహారాన్నీ, పండ్లనూ అల్పాహారంలో చేర్చుకుంటే మంచిది.