Acidity Home Remedies | మారుతున్న జీవన శైలి, సమయపాలన లేకుండా భోజనం చేయడం గ్యాస్, అజీర్తి సమస్యలకు కారణమవుతున్నాయి. పండుగల సీజన్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేయించిన నూనెలో కాల్చిన వంటకాలు, అర్థరాత్రి వరకు మేల్కొనడం వంటివి పాటిస్తారు. పండుగ వేళ, సంవత్సరానికి ఒకసారే వస్తుంది.. అంటూ నచ్చినవి విందుగా లాగించేస్తుంటారు. పండుగ వేళ రుచికరమైన వంటకాల రుచి చూడకుండా ఉండడం కాస్త కష్టమే అని చెప్పవచ్చు. అయితే కింద ఇచ్చిన చిట్కాలను పాటించి అజీర్తి, గ్యాస్ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
రోజువారీ జీవితంలో అజీర్తి, గ్యాస్ సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. సరైన సమయానికి నిద్ర పోకపోవడం, ఆహారంలో మసాలాలు, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, సమయ పాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం, భోజనానికి, భోజనానికి మధ్యలో ఎక్కువ విరామం తీసుకోవడం, ఆహారాన్ని త్వరగా నమిలి మింగడం, అర్థరాత్రి వరకు మెళకువగా ఉండడం, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి వాటిని అసిడిటీకి కారణాలుగా చెప్పవచ్చు.
భోజనం చేసిన అనంతరం చిన్న బెల్లం ముక్కను తింటే గ్యాస్, అసిడిటీ ఉండవు. అలాగే ఉదయాన్నే పరగడుపునే కనీసం 2 గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న లవంగం మొగ్గను నమలడం వల్ల కూడా గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు తులసి ఆకులను నమిలి తినవచ్చు. భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్ సోంపు గింజలను నమిలి తింటుండాలి.
బంగాళాదుంపలను కాల్చి లోపలి గుజ్జులో కాస్త ఉప్పు కలిపి తింటుంటే అసిడిటీ తగ్గుతుంది. బాగా పండిన అరటి పండును తింటున్నా కూడా గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు. అలాగే అర టీస్పూన్ వామును బాగా నలిపి తిని కాస్త ఉప్పు తినాలి. అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఇలా చేసినా కూడా అసిడిటీ నుంచి బయట పడవచ్చు. రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తుంటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపులో మంట కూడా తగ్గుతుంది.
ఫ్రాజెన్ పౌల్ట్రీ లేదా డెయిరీ ఉత్పత్తులు. వీటిలో హై ప్రోటీన్లు, ఫ్యాట్ ఉంటాయి. వాటిని జీర్ణం చేసుకోవడం కష్టం. చక్కెర లేదా దాంతో చేసిన పదార్థాలను అతిగా తినకండి. నిమ్మ, ద్రాక్ష, దానిమ్మ, యాపిల్ పండ్లను మోతాదులో తినండి, అతిగా తింటే గ్యాస్, కడుపులో మంట వస్తాయి. పాలను మరీ వేడిగా కాకుండా చల్ల లేదా గోరు వెచ్చగా తాగడం. టీ, కాఫీలను అతిగా తీసకోవద్దు. ఇన్స్టంట్ ఫుడ్స్‌ను లేదా చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను, నూనె పదార్థాలను, జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా తినకండి.