మహిళ జీవితంలో ముప్పై ఓ మైలురాయి. ఆ అంకెను దాటితే నవ యవ్వనం నుంచి ప్రౌఢత్వం వైపు తొలి అడుగు పడినట్టే. ఇదే అదునుగా భావించి శరీర వ్యవస్థ తిరుగుబాటు చేస్తుంది. చర్మం తొలి ఫిరంగి పేలుస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. వృద్ధాప్య ఛాయలూ మొదలవుతాయి.
ఇప్పటి వరకూ రకరకాల స్నానపు సబ్బులు వాడే ఉంటారు. ఇక నుంచి అవన్నీ బంద్. వాటిలోని రసాయనాలు మీ చర్మంలోని మృదుత్వాన్ని లాగేసుకుంటాయి. ఫేస్‌వాష్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేయండి. సంప్రదాయ లేపనాలూ మంచే చేస్తాయి.
మునుపటి నిగారింపు తగ్గిపోతూ వస్తుంది. ఆందోళన పడాల్సిన విషయమే ఇది. అలా అని, భయపడాల్సిన అవసరం లేదు. శరీరాన్ని మరింత తేమగా ఉంచడం ద్వారా.. పాత మెరుపును నిలబెట్టుకోవచ్చు. పండ్ల రసాలు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ.. తరచూ తీసుకోండి.
మొక్కుబడిగా తినడం కాదు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోండి. ప్రొటీన్స్కు ప్రాధాన్యం ఇవ్వండి. చక్కెర మోతాదుకు కోత తప్పదు. దురలవాట్లు ఉంటే వెంటనే వదిలించుకోండి.
ఆఫీస్ డెడ్లైన్లు, కుటుంబ బాధ్యతలు, వెబ్‌సిరీస్‌లు.. కారణం ఏదైతేనేం నిద్ర వేళ బాగా తగ్గిపోతున్నది. మనం నిద్రలో ఉన్నప్పుడే
చర్మం తనకు తాను మరమ్మతులు చేసుకుంటుంది. కాబట్టి, నిద్రకు తగినంత సమయం కేటాయించండి.
బయటికి వెళ్తున్నప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. ఇవి అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. పార్టీ నుంచో, ఫంక్షన్ నుంచో రావడం ఎంత ఆలస్యమైనా సరే.. మేకప్‌తో పడుకోకండి. దాంతోపాటే, మనసు మీద భారం పెంచుకోవద్దు.