Winter Virus | శీతకాలంలో సహజంగానే వైరస్ల ప్రభావం ఎక్కువ. వీటితోపాటు బ్యాక్టీరియాలు కూడా తమ ప్రతాపం చూపుతున్నాయి. కొన్ని వైరస్‌లలోని జన్యువులలో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్) జరగడం వల్ల కొత్తరకం వైరస్లు ఏర్పడతాయి. ఇవి మందులకు తొందరగా లొంగవు. వేగంగా వ్యాప్తి చెంది విజృంభిస్తాయి. ఒక్కోసారి ఆ వైరస్ మహమ్మారి (ఎపిడిమిక్)గా ప్రబలే ప్రమాదమూ ఉంది. గతేడాది చలి కాలంలో ఎడినో వైరస్ పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సంవత్సరం ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాజ్మా, ఆర్ఎస్ వైరస్లు పిల్లలకు ఎక్కువగా సోకుతున్నాయి. వీటిలో మైకోప్లాజ్మా తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. చలి కాలంలో చిన్నారులు ఎలాంటి సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదముంది? వాటివల్ల కలిగే అనర్థాలేమిటి? ఈ సీజన్లో మైకోప్లాజ్మా బారినపడకుండా చిన్నారులను ఎలా కాపాడుకోవాలి? ఆ వైరస్‌కు గురైతే ఎలా గుర్తించాలో నేటి ‘ఊపిరి’లో తెలుసుకుందాం.
చలికాలంలో అనారోగ్యం కలిగించే వైరస్‌ని ‘వింటర్ వైరస్’ అంటారు. వీటిలో రైనో వైరస్, ఎంటిరో వైరస్, కరోనా వైరస్, ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) పిల్లలకు ఎక్కువగా సోకుతుంటాయి. ఈ సీజన్లో పిల్లలపై ఆర్ఎస్వీ, మైకోప్లాజ్మా బ్యాక్టీరియా అధికంగా ప్రభావం చూపుతాయి. వీటి తర్వాత ఇన్‌ఫ్లూయెంజా(ఫ్లూ) వైరస్ ఎక్కువమందిపై ప్రభావం చూపుతుంటుంది. 1-5 ఏండ్ల మధ్య వయసు పిల్లలు ఎక్కువగా ఆర్ఎస్ వైరస్ బారినపడుతుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైన వైరస్ మహమ్మారి (ఎపిడిమిక్)గా మారుతున్నది. ఇలా ఏడాదికి ఒక వైరస్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నెలలు నిండకుండా పుట్టిన (ప్రీమెచ్యూర్డ్) పిల్లలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు, పుట్టుకతో గుండె సమస్యలు ఉన్న బాలలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలకు ఈ వైరస్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. వీటి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.
ఈ సంవత్సరం మైకోప్లాజ్మా బ్యాక్టీరియా విజృంభిస్తున్నది. ఇది పిల్లల్లో న్యుమోనియా కలిగిస్తుంది. సాధారణంగా మైకోప్లాజ్మా ఐదేండ్లు పైబడిన పిల్లలకు సోకుతుంది. కానీ, ఈ సీజన్లో 5 ఏండ్లలోపు పిల్లలకు కూడా వస్తున్నది. ఈ బ్యాక్టీరియా వల్ల న్యుమోనియా బారినపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. మైకోప్లాజ్మా ఈ స్థాయిలో విజృంభించడం దేశంలో ఇదే తొలిసారి.
మైకోప్లాజ్మా సోకిన రోగికి ప్రత్యేక చికిత్సా విధానమంటూ లేదు. లక్షణాల ఆధారంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. న్యుమోనియా బారినపడితే అది ఏ రకమైన వ్యాధి? దానికి కారణం ఏమిటి? తెలుసుకోవాలి. న్యుమోనియాకి కారణాన్ని గుర్తించకుండా గుడ్డిగా చికిత్స చేస్తే కోలుకోరు. కొందరికి ఐసీయూ చికిత్స అవసరం ఏర్పడవచ్చు. ఆలస్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.
రెస్పిరేటరీ సిన్షీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) ఒక సీజనల్ వైరస్. సీజన్ వ్యాధుల్లో మైకోప్లాజ్మా తర్వాత ఆర్ఎస్వీ రెండోస్థానంలో ఉంది. ఇది జూలై – డిసెంబర్ మధ్య ప్రభావవంతంగా ఉంటుంది. గుండె సమస్యలున్న పిల్లలు, నెలలు నిండక ముందు (ప్రీ మెచ్యూర్డ్) పుట్టిన పిల్లలపై ఆర్ఎస్వీ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దగ్గడం, తుమ్మడం, నోటి తుంపర్లు ద్వారా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. రోగి వాడిని వస్తువులు వినియోగించినా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
ఆర్ఎస్వీ బారినపడిన రోగి కోసం ప్రత్యేకంగా మందులేవీ లేవు. లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. కొందరికి ఐసీయూ చికిత్స కూడా అవసరం పడవచ్చు. సాధారణంగా ఏడాదిలోపు వయసు పిల్లల్లో వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల 1- 5 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో కూడా కనిపిస్తున్నది. తల్లిదండ్రులు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాధి లక్షణాలు కనిపిస్తే సకాలంలో చికిత్స చేయించాలి.
ఇన్‌ఫ్లూయెంజా సాధారణ సీజనల్ వ్యాధి. అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగానూ మారవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉంది. ఇన్‌ఫ్లూయెంజా కూడా ఒక అంటు వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఫ్లూ ఉన్నవారు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా గాలిలో వ్యాపిస్తూ ఇతరులకు సోకుతుంది. ఇంట్లో ఒకరికి సోకితే దాదాపు అందరినీ చుట్టేస్తుంది.
ఇన్‌ఫ్లూయెంజాకు ప్రత్యేకమైన చికిత్స లేదు. లక్షణాలను బట్టి మందులతో చికిత్స చేస్తారు. ఇన్ఫ్లూయెంజాను గొంతు, ముక్కు ద్వారా స్వాబ్ పరీక్షలు నిర్వహించి ఏ రకమైన వైరస్ సోకిందో నిర్ధారించవచ్చు. ఈ వ్యాధి సోకిన పిల్లలకు చికిత్స ఆలస్యం చేస్తే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది.