7 Foods For Eye Sight | మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. ఇవి లేకపోతే మనకు ఏమీ కనిపించదు. ప్రపంచం మొత్తం చీకటిగా మారుతుంది. నయనం ప్రధానం అని పెద్దలు అందుకనే అన్నారు. కానీ నేటి తరుణంలో చిన్నారులకు సైతం కంటి చూపు మందగిస్తోంది. దీంతో చిన్న వయస్సు నుంచే వారు కంటి అద్దాలను ధరించాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే కంటి చూపు మందగించేందుకు పోషకాహార లోపమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. పోషకాలు ఉండే ఆహారాలను తింటే కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చని వారు చెబుతున్నారు.
కంటి చూపు లేదా కళ్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే వృద్ధాప్యంలో మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడడమే కాదు, కళ్లలో శుక్లాలు రాకుండా ఉంటాయి. కళ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడాలంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఎ, సి, ఇ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆకుపచ్చని కూరగాయలతోపాటు సముద్రపు ఆహారాన్ని తరచూ తీసుకోవాలి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. గురుగ్రామ్‌కు చెందిన నోబుల్ ఐ కేర్ హాస్పిడల్ డాక్టర్ దిగ్విజయ్ సింగ్ చెబుతున్న ప్రకారం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉండడంతోపాటు కంటి చూపు కూడా మెరుగు పడుతుందట. దీంతోపాటు వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. కనుక పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకు కూరల్లో లుటీన్, జియాజంతిన్ అనే పోషకాలతోపాటు విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. కనుక వారంలో రెండు సార్లు ఆకుకూరలను కచ్చితంగా తినాలి. 3 రోజుల పాటు తింటే ఇంకా మంచిది. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. నిమ్మజాతికి చెందిన పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇది కణాలను రక్షిస్తుంది. దీని వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. సముద్రపు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డి అందేలా చూస్తాయి. దీంతో కళ్లలోని కణాలు రక్షించబడతాయి.
పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా తరచూ తింటుండాలి. వీటిల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కళ్లను రక్షిస్తుంది. కోడిగుడ్లు, క్యారెట్లు కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రెండింటిలోనూ అధిక మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. అలాగే చిలగడ దుంపలు, అవకాడోలు, డార్క్ చాకొలెట్లను కూడా తినవచ్చు. ఇవి కూడా కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కంటి చూపును పెంచుతాయి.