లండన్ : వయసు మీరుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వయసును ఎవరూ ఆపలేకున్నా శరీర బయలాజికల్ వయసును తగ్గించి దీర్ఘకాలం ఆరోగ్యంగా, యవ్వనంతో జీవించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వ్యక్తి యొక్క బయలాజికల్ ఏజ్‌ను పసిగట్టే ఎపిజెనెటిక్ క్లాక్‌ను రివర్స్ చేయడం ద్వారా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని కాలిఫోర్నియాలో చేపట్టిన క్లినికల్ స్టడీలో వెల్లడైనట్టు నేచుర్.కాంలో ప్రచురితమైన నివేదిక తెలిపింది. ఈ అధ్యయనంలో మానవ బయలాజికల్ వయస్సును వెనక్కి మళ్లించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇమ్యూనిటీని పెంచి వయసు మీద పడటాన్ని నివారిస్తూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఐదు ఆహార పదార్ధాలు కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి : మన వంటింట్లో నిత్యం వాడే వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలతో కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు అదుపులో ఉంటాయి. వెల్లుల్లి తీసుకోవడంతో మన శరీరం వైరస్‌లతో పోరాడే శక్తి మెరుగవువుతంది. రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ పేర్కొంది. రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే అది అత్యంత సహజమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు ప్యాట్రిక్ హల్ఫోర్డ్ చెబుతున్నారు.
గుమ్మడి విత్తనాలు : గుమ్మడి గింజలు తరచూ తీసుకుంటే బ్లాడర్ ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి చెక్ పెట్టడంతో పాటు బీపీ, మధుమేహ నియంత్రణకు చక్కగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గుమ్మడి విత్తనాలతో శరీరానికి అవసరమైన జింక్ అందుతుందని న్యూట్రిషనల్ థెరఫిస్ట్ నినా ఒమొట్సో చెబుతున్నారు. ఇమ్యూనిటీ పెంచే మినరల్స్‌లో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. గుమ్మడి విత్తనాల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.
మసాలా దినుసులు : భారతీయ వంటిళ్లలో నిత్యం కనిపించే పసుపు వంటి మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధ గుణాలు మసాలా దినుసుల్లో పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కివీ : జలుబు, దగ్గుతో పోరాడి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడేందుకు కివీ ముందువరుసలో నిలుస్తుంది. రోజుకు రెండు కివీస్ తీసుకుంటే వాటిలో 160మిల్లీగ్రాముల సీ విటమిన్ లబిస్తుంది. విటమిన్ సీ ద్వారా మన శరీరంలో తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు వృద్ది చెందుతాయి.
కొకొవా : నిత్యం కొకొవా బీన్స్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. అయితే చాక్లెట్స్ వంటి వాటిలో కొకొవా తక్కువ మోతాదులో ఉండటంతో పాటు చక్కెర అధికంగా ఉండటంతో వాటికి దూరంగా ముడి బీన్స్‌ను తీసుకునేందుకే మొగ్గుచూపాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొకొవా బీన్స్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ఫ్లేవనాల్స్ పుష్కలంగా ఉంటాయి.