హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎన్నడూ లేనంతగా నైరుతి రుతుపవనాలు నిరాశపర్చడం, వానకాలం సీజన్ పూర్తికావడం, ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండటంతో యాసంగి సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది. వర్షాలు పూర్తిగా కనుమరుగు కావడంతో రానున్న రోజులు ఎలా ఉంటాయని భయాందోళన చెందుతున్నారు. ‘ఎల్ నినో’ ప్రభావం వచ్చే మార్చి వరకు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించిన క్రమంలో పంటల దిగుబడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వానకాలం ముందు నుంచే ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడింది. గడిచిన నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 1-2 రోజులపాటు భారీ వర్షాలు కురిసిన పరిస్థితులు లేవు. అకడకడ మోస్తరు వర్షాలే కురిశాయి. పొరుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాలకు వరదనీరు రావటం కొంతమేర ఉపశమనాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు వచ్చే యాసంగి సాగుపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ఎల్ నినో ప్రభావంతో ఈ వానాకాలం సాధారణ కంటే 17శాతం లోటు వర్షపాతం నమోదైంది. నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్, మేడ్చల్ మలాజిగిరి, నల్లగొండ, హనుమకొండ, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈసారి తకువ వర్షపాతం నమోదైంది. వీటిలో 8జిల్లాల్లో 30శాతం నుంచి 41శాతం వరకు లోటు వర్షపాతం ఏర్పడింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కలిపి 740.6 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా… 615.5 మి.మీ నమోదైంది.
ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాల నీటిమట్టాలు వేగంగా పడిపోయి కూరగాయల సాగుకు నీటి ఎద్దడి ఏర్పడింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరగడం వల్ల సాగు చేసిన పంటల్లో పూత, పిందె రాలిపోతున్నాయి. దీనివల్ల టమాటా, మిరప, బెండ, వంకాయ వంటి నిత్యావసర కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈనెల మొదటి వారం నుంచే మార్కెట్లో టమాటా కొరత ఏర్పడగా, పొరుగు రాష్ర్టాల్లో కూడా అదే పరిస్థితి నెలకొన్నది.
దీంతో ఏ కూరగాయల ధరలు చూసిన సగటున కిలో రూ.50 నుంచి రూ.80 మధ్య ధర పలుకుతున్నది. ఉల్లి, ఎల్లిగడ్డ, అల్లం వంటి వాటి ధరలు మరింత పెరిగాయి. మామిడి, బత్తాయి, నిమ్మ, అరటి వంటి బహువార్షిక తోట పంటలకు ఈ కరువు పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. తగినంత తేమ లేకపోవడంతో కాయ సైజు చిన్నగా మారుతున్నాయి. దీంతో రైతులకు సాగుకు పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
ఎల్ నినో ప్రభావంతో తకువ నీటి లభ్యత ఉన్నప్పుడు డ్రిప్ పద్ధతి ద్వారా నేరుగా వేరు వ్యవస్థకు నీరు అందించి 40-50% నీటిని ఆదా చేయవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. నేలపై ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడవచ్చని పేర్కొంటున్నారు. ఇది కలుపు మొకలను నివారిస్తుందని చెప్తున్నారు. తీగజాతి కూరగాయలకు పందిరి విధానం శ్రేయసరమని, తీవ్రమైన ఎండల నుంచి రక్షణకు తోటలపై గ్రీన్షేడ్ నెట్స్ వాడటంతో ఉష్ణోగ్రతల నుంచి కాపాడవచ్చని సూచిస్తున్నారు. రసాయన ఎరువుల కంటే సేంద్రియ, వర్మీ కంపోస్ట్, జీవామృతం వాడాలని కోరుతున్నారు.