బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Sep 08, 2020 , 00:09:10

ఏ మాస్కు బెస్టు?

ఏ మాస్కు బెస్టు?

మాస్కులు మన రోజువారీ ఆహార్యంలో భాగమైపోయాయి. అయితే ఎన్‌ 95 మాస్కే వాడాలా? బట్ట మాస్కు వాడితే సరిపోతుందా? లేకుంటే ఫేస్‌ షీల్డ్‌ పెట్టుకుంటే ఎక్కువ మేలు కలుగుతుందా..? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని చుట్టుముడుతాయి. వీటన్నింటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌. 

మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపరలను బయటికి వెళ్లకుండా బంధించి ఉంచడానికి మాస్కులు ఉపయోగపడుతాయి. వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఫేస్‌ షీల్డ్స్‌, వాల్వ్‌తో కూడిన మాస్కులు, బట్ట మాస్కులలో ఏది మంచిదన్న కోణంలో ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌ ఒక అధ్యయనం చేసింది. కొవిడ్‌ వ్యాప్తి గురించి అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనం కొత్త కోణాన్ని చూపింది. ఈ అధ్యయనం కోసం గ్లిజరిన్‌, డిస్టిల్డ్‌ వాటర్‌ మిశ్రమాన్ని పంపించి తుమ్ము, దగ్గు తెప్పించారు. వివిధ రకాల మాస్కులపై లేజర్స్‌ పంపించి, దాని మార్గాన్ని అధ్యయనం చేయడం ద్వారా వేర్వేరు మాస్కులు ఏ మేరకు రక్షణ కల్పిస్తాయో గమనించారు.  

ఫేస్‌ షీల్డ్స్‌ 

పారదర్శకంగా ఉండే ఫేస్‌ షీల్డ్‌ను ధరించినప్పుడు పెద్దగా ఉండే తుంపరలు షీల్డ్‌ వెనుక నుంచి, కింది నుంచి బయటికి వచ్చేసే ప్రమాదం ఉంది. పైగా 10 మైక్రాన్లు, అంతకన్నా చిన్నగా ఉన్న తుంపరల నుంచి ఇవి కాపాడలేవు. కాబట్టి ఇది అంత శ్రేయస్కరం కాదు. వాల్వ్‌డ్‌ మాస్క్‌ 

 వాల్వుతో కూడిన మాస్కులు ఎన్‌ 95 అయినా సరే వాడకపోవడమే మంచిది. ఎందుకంటే దీని నుంచి సూక్ష్మజీవులు బయటికి వెళ్లిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. 

బట్ట మాస్కులు 

కనీసం రెండు పొరలతో ఉన్న బట్ట మాస్కు వాడాలి. ఇది ముక్కు నుంచి గడ్డం వరకు మూసి ఉంచాలి. మాస్కుతో పాటుగా ఫేస్‌ షీల్డ్‌ వాడితే అదనపు రక్షణ ఉంటుంది. ఇండోర్స్‌లో ఇతరులతో కలిసి పనిచేయాల్సిన వాతావరణంలో ఈ రెండూ వాడటం మంచి ఫలితాన్నిస్తుంది.అయితే అసలు ఏదీ వాడకుండా ఉండే బదులు ఏదో ఒక మాస్కు వాడటం మేలు. బట్ట మాస్కులు బాగా పనిచేస్తాయి. డాక్టర్లు వాడే సర్జికల్‌ మాస్కులైనా, పేపర్‌ మాస్కులైనా, ఎన్‌95 మాస్కులైనా (వాల్వు లేనివి) రక్షణ కల్పిస్తాయి. అయితే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం మాత్రం మరవద్దు. 


logo