మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jun 09, 2020 , 00:36:44

ఆ బాధ మరువలేను..

ఆ బాధ మరువలేను..

మోకాళ్ల నొప్పులు.. కీలుమార్పిడి.. అన్న మాట వినగానే డాక్టర్‌ గురవారెడ్డి గుర్తొస్తారు. పేషెంట్ల హృదయాలను చదవడంలోనే కాదు.. జీవితాన్ని ఆసాంతం ఆనందించడంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. ఎంతోమందిని నడిపించిన, పరుగెత్తించిన, నృత్యం చేయించిన ఆ వైద్యుడు ఒక రోగిని  తలుచుకోగానే మాత్రం... ఉద్వేగానికి గురవుతారు. డాక్టర్‌ గురవారెడ్డి డైరీలో ఆ పేజీకి  ప్రత్యేక స్థానం ఉంది. 

ఓసారి ఏదో ఫంక్షన్‌కి వనస్థలిపురం వెళ్లాను. అక్కడికి నా పాత పేషెంటు ఒకరు వచ్చారు. ఆమె మరో పేషెంటు గురించి చెప్పింది. వాళ్ల ఇల్లు  దగ్గర్లోనే ఉందంటూ నన్ను రమ్మని అడిగింది. మొహమాటం కొద్దీ వెళ్లాను. నేను చేసిన మొదటి పొరపాటు అది. ఇంటికి వెళ్లే దారి కారు పోలేనంత ఇరుగ్గా ఉంది. ఆ పేషెంటును చూసి షాకయ్యాను. అరవై ఏండ్లు ఉండవచ్చు. మోకాళ్లు పూర్తిగా అరిగిపోయాయి. నడవలేని పరిస్థితిలో ఉంది. ఆమె చాలా ఇండిపెండెంట్‌. ఎవరి సాయమూ తీసుకోదు. తన గదిని ప్రత్యేకంగా అమర్చి పెట్టుకుంది. ఆ గదిలో పొయ్యి, పాత్రలు, బాత్రూమ్‌లో బక్కెట్టు, సబ్బులు.. అందేలా అమర్చుకుంది. పదేండ్లుగా ఆమె ఇలాగే బతుకుతున్నదట. 

‘ఇంత కష్టపడనవసరం లేదు. నేను ఆపరేషన్‌ చేసి, బాగుచేస్తాను’ అని ఆమెను కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేశాను. మొదట్లో ఒప్పుకోలేదు. ‘నేను ఇలాగే బాగున్నాను. ఇప్పుడు ఆపరేషన్‌ చేయించుకుని నిల్చొనే అవసరం లేదు. నన్నిలా వదిలేయండి’ అని చెప్పింది. కానీ నేనే ఆమెకు, ఆమె పిల్లలకు నచ్చజెప్పాను. ఇది నేను చేసిన రెండో పొరపాటు. బాగా గుర్తుంది. ఆపరేషన్‌ థియేటర్‌లో.. ఆమె నా చెయ్యి పట్టుకుని, ‘నేను బాగవుతానా?’ అని అడిగింది. ‘తప్పకుండా’ అని కాన్ఫిడెంట్‌గా సమాధానం చెప్పాను. పదేండ్లుగా కాళ్లు కదల్చకపోవడం వల్ల ఆమె కాలిలో రక్తం గడ్డ కట్టింది. అది కాస్తా గుండెలోకి వెళ్లి కార్డియాక్‌ అరెస్ట్‌ అయింది. ఆపరేషన్‌ టేబుల్‌ మీదే చనిపోయింది. 

థియేటర్‌లో ఆమె నా కళ్లలోకి చూసిన చూపు ఇంకా గుర్తుంది. ఈ సంఘటన తరువాత 15 రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ప్రాక్టీస్‌ మానేద్దాం అనుకున్నా. కానీ భగవద్గీత నన్ను ఆ నిస్పృహ నుంచి బయటపడేసింది. నా ప్రయత్నం నేను చేయకుంటే, అది నా తప్పు అవుతుంది. నిష్కల్మషంగా మంచి చేయాలనే ఉద్దేశంతోనే ప్రయత్నించాను. నా దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. ఆ వైఫల్యాన్ని యథాతథంగా ఆమోదించాను. గుర్తొచ్చినప్పుడల్లా, ఆమె మరణం నన్ను డిస్ట్రబ్‌ చేస్తుంది. సహజంగానే నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. ఆ ఉద్వేగాలే నా బలమూ, బలహీనతా! బలహీనతల్నే బలంగా మలచుకోవడం తెలిస్తే విజయం వస్తుందని నమ్ముతాను. బలహీనతలు అవుతాయని ఎమోషన్స్‌ను వదిలేసుకుంటే, ఎంఆర్‌ఐ స్కాన్‌కూ నాకూ తేడా ఏం ఉంటుంది? డిప్రెస్‌ కావడం అనేది బలహీనత. దాన్ని అధిగమించడానికి, మళ్లీ పేషెంట్ల ప్రేమే ఉపయోగపడుతుంది. హాస్పిటల్‌ను నడపటంలో కూడా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నాను. అవేవీ నన్ను కదిలించలేక పోయాయి. కానీ, ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చే పేషెంట్లను నిరాశపరిచినప్పుడు మాత్రం.. ఆ బాధ పోవడానికి చాలా రోజులు పడుతుంది. 

డాక్టర్‌ ఎ.వి. గురవారెడ్డి

చైర్మన్‌, సీనియర్‌ ఆర్థోపెడిక్‌ అండ్‌ నీ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo