High Blood Pressure | ప్రస్తుత తరుణంలో హైబీపీ అనేది చాలా మందికి వస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వాళ్లకే వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు. ఇందుకు ఒత్తిడే ప్రధాన కారణమని తెలుస్తోంది. దీని వల్ల చాలా మందికి గుండె జబ్బులతోపాటు హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే ప్రాణాలను కోల్పోతున్నారు. కనుక ఎవరికైనా హైబీపీ ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక సైంటిస్టుల అధ్యయనాల ప్రకారం చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తాయని తేలింది. ఈ సీజన్లో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో బీపీ పెరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక చలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
చలికాలంలో పలు సూచనలు పాటించడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు హైబీపీ కూడా తగ్గుతుంది. బీపీ తగ్గేందుకు గాను పలు సూచనలు పాటించాలి. ముఖ్యంగా రోజూ ఉదయం యోగా చేయాలి. అలాగే శ్వాస వ్యాయామాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఎంతో మేలు జరుగుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి అనే బీపీ పెరిగేందుకు ప్రధాన కారణం అవుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు గాను రిలాక్సేషన్ పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ వంటివి చేస్తుంటే ఒత్తిడి తగ్గుతుంది. దీంతో బీపీ అదుపులో ఉంటుంది.
రోజువారి ఆహారంలో మనం ఉప్పును తింటుంటాం. కానీ బీపీ ఉన్నవారు అసలు ఉప్పును మానేయడమే మంచిది. లేదంటే రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ వాడాలి. దీని వల్ల బీపీ పెరగదు. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించడం వల్ల బీపీ గణనీయంగా తగ్గుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా సూప్‌లు తాగుతారు, వీటిల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. కనుక సూప్‌లను తాగకపోవడమే మంచిది. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.
హైబీపీ ఉన్నవారు మద్యం సేవించడం మానేయాలి. మద్యం వల్ల బీపీ పెరుగుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. కనుక హైబీపీ ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించకూడదు. ఇక చలికాలంలో మనకు సహజంగానే పెద్దగా దాహం అనిపించదు. అలాంటప్పుడు నీళ్లను కూడా తక్కువగా తాగుతాం. కానీ రోజుకు శరీరానికి అవసరం అయినన్ని నీళ్లను మాత్రం కచ్చితంగా తాగాల్సిందే. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ తగ్గుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయే వారికి బీపీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అలాగే రోజూ ఒకే టైముకు నిద్రించి ఒకే టైముకు నిద్ర లేవాలి. ఇలా చేస్తుంటే బీపీ అసలు ఎప్పటికీ పెరగదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు పెరగకుండా చూసుకుంటే బీపీ నియంత్రణలోనే ఉంటుంది. హైబీపీ ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. చిన్నగా కాస్త బరువు పెరిగినా చాలు అది బీపీపై ప్రభావం చూపిస్తుంది. కనుక అధిక బరువును తగ్గించుకోవాలి. శీతల పానీయాలను అధికంగా సేవించకూడదు. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. చలికాలంలో అసలే తాగకూడదు. ఇలా పలు సూచనలను చలికాలంలో పాటించడం వల్ల హైబీపీని తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ల బారిన పడకుండా ఉంటారు.