బుధవారం 27 జనవరి 2021
Gadwal - Nov 08, 2020 , 01:51:54

20నుంచి తుంగభద్ర పుష్కరాలు

20నుంచి తుంగభద్ర పుష్కరాలు

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

అలంపూర్‌/అయిజ: ఈనెల 20నుంచి ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నిరాడంబరంగా నిర్వహించుకుందామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం అలంపూర్‌ క్షేత్రంలో తుంగభద్ర నది పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై అలంపూర్‌ హరిత టూరిజంలో ఆలయ దర్శనం అనంతరం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర పుష్కరాలను గతంలో మాదిరిగా నిర్వహించడానికి అవకాశం లేదని, కరోనా నేపథ్యంలో కేంద్రం నిబంధనలు పాటిస్తూ ముందుకుసాగాలన్నారు. తెలంగాణలో కేవలం అలంపూర్‌ నియోజకవర్గంలోనే ప్రవహిస్తున్న తుంగభద్ర నది పొడవునా ఈ ఏడాది అలంపూర్‌, కలుగోట్ల, పుల్లూరు, రాజోళి, వేణిసోంపురం ప్రాంతాల్లో మొత్తం ఐదు ఘాట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. పుష్కరఘాట్ల ఏర్పాట్లు, పారిశుధ్యం, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, తాగు నీటి సౌకర్యం, వాహన పార్కింగ్‌, షవర్‌బాత్‌ సౌకర్యం, వంటి చర్యలు ఆయా శాఖలకు అప్పగించి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. పుష్కర స్నానాలకు చిన్న పిల్లలు, వృద్ధులు రాకుండా చూసుకోవాలన్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని పుణ్యస్నానాలకు రావాల్సి ఉంటుందన్నారు. ఎన్‌సీసీ, స్కౌట్స్‌, పీఈటీలను, పుష్కరఘాట్ల వద్ద విధులకు కేటాయించేలా చూసుకోవాలన్నారు. కురుమూర్తి జాతర కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పుష్కరాలను విజయవంతం చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. దాతలను సంప్రదించి భక్తులకు అన్నదానం, అల్పాహారం, ఇతర సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని, అనుమానం ఉంటే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ర్యాపిడ్‌ టెస్టు కిట్లను, తగిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం మాట్లాడుతూ చలికాలంలో కరోనా వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరికల మేరకు పుష్కరాలు నిర్వహించుకుందామన్నారు. కలెకర్‌ శృతి ఓఝా మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు వివిధ శాఖల ద్వారా చేపట్టవలసిన పనుల నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ట్రిబ్యూనల్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌, ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహర్ష, అలంపూరు మున్సిపల్‌ చైర్మన్‌ మనోరమ, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.

జోగుళాంబ సన్నిధిలో..

అలంపూర్‌: దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం దర్శించుకున్నారు. ఈవో ప్రేమ్‌కుమార్‌ అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిని, పుష్కరఘాట్‌ను పరిశీలించారు. వారివెంట దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, పంచాయతీ రాజ్‌ ట్రిబ్యూనల్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌, కలెక్టర్‌ శృతిఓఝా, ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో రాములు, అలంపూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మనోరమ ఉన్నారు. 

ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తా..

భూత్పూర్‌: రాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తానని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అలంపూర్‌ జోగులాంబ దేవాలయానికి వెళ్తూ మార్గ మధ్యలో అన్నాసాగర్‌లో  మంత్రులకు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి ఘనస్వాగతం పలుకుతూ సన్మానం చేశారు. ఈ సందర్భంగా అన్నాసాగర్‌లోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని పరిశీలించారు. నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే ఆల మంత్రి దృష్టికి తీసుకురాగా, మంత్రి స్పందిస్తూ రూ.40లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి తండ్రి దివంగత ఆలరఘుపతిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు నివాళులర్పించారు. భూత్పూర్‌లో ఆంజనేయస్వామి దేవాలయంలో దూపదీప నైవేద్యాలను నిధులు మంజూరు చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌బస్వరాజ్‌గౌడ్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అశోక్‌గౌడ్‌, సత్యనారాయణ కోరారు.logo