బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Jan 17, 2020 , 00:53:15

జాతీయస్థాయి సూపర్‌ -7 క్రికెట్‌ చాంపియన్‌ తెలంగాణ

జాతీయస్థాయి సూపర్‌ -7 క్రికెట్‌ చాంపియన్‌ తెలంగాణ
  • - రన్నర్‌గా నిలిచిన చత్తీస్‌గఢ్‌, ఢిల్లీ
  • -మూడో స్థానంలో ఢిల్లీ, మహారాష్ట్ర
  • - ప్రతిభ చాటిన అంజలి, అనిత

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌  : జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ సూపర్‌-7 క్రికెట్‌ టోర్నీ ముగిసింది. టోర్నీలో తెలంగాణ, బాల, బాలికల జట్లు చాంపియన్లుగా నిలిచాయి. బుధవారం బాలుర కళాశాల మైదానంలో బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు చత్తీస్‌గఢ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చత్తీస్‌గఢ్‌ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. జట్టులో దీపిక 16 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెలంగాణ జట్టు 5.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 70 పరుగులు చేసి గెలిచింది. జట్టులో అంజలి 24, అనిత 20 పరుగులు చేసి జట్టునే చాంపియన్‌గా నిలిపారు. రన్నర్‌గా చత్తీస్‌గఢ్‌ జట్టు నిలువగా, బాలుర విభాగంలో తెలంగాణ జట్టు విజేతగా, రన్నర్‌గా ఢిల్లీ జట్టు నిలిచింది. మూడో స్థానంలో బాలికల విభాగంలో ఢిల్లీ, బాలుర విభాగంలో మహారా్రష్ట్ర జట్లు నిలిచాయి.

గెలుపు ఓటములు సహజం : ఎండీసీఏ

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలని జిల్లా క్రికెట్‌ సంఘం ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి అన్నారు. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. జాతీయ స్థాయి టోర్నీలో వివిధ రాష్ర్టాల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. టోర్నీలో విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కేంద్రం జాతీయస్థాయి టోర్నీకి వేదిక కావటంతో సంతోషంగా ఉందన్నారు. టోర్నీలో ప్రతిభచాటిన క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ అండర్‌ -19 కార్యదర్శి పాపిరెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ సురేశ్‌కుమార్‌, టెక్నికల్‌ అఫీషియల్‌ బాలరాజ్‌, రాష్ట్ర, జాతీయ పరిశీలకులు విశాల్‌ పాటక్‌,  బీఎస్‌ ఆనంద్‌, నరేందర్‌గౌడ్‌, జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి రాజశేఖర్‌, సభ్యులు అశోక్‌, కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్‌, అబ్దుల్లా, జగన్మోహన్‌ గౌడ్‌, రాఘవేందర్‌, నాగరాజు, ముకరం, రాంమోహన్‌ పాల్గొన్నారు.




logo