యవుసం జేసుడంటే…
నాగేటిసాళ్ళు కొట్టుడు కాదు
దుక్కి దున్ని కొయ్యలేరి గింజనాటి ధాన్యం కొలుసుడు!
రాజ్యమేలుడంటే గద్దెనెక్కుడు కాదు
ప్రజల కష్టసుఖాలనెరిగి కడుపుల పెట్టుకునుడు!
ఉద్యమమై బిగిసిన పిడికిళ్లు
నేలకొరిగిన ప్రాణాల ఫలితమే తెలగాణ!
నెత్తురోడిన నేలల్ల పంటతడిపెట్టనింకే నీళ్ళు యాడుండె?
కుంచెలు నింపనింకే గింజలెక్కడివి?
పంటలెయ్యాలంటే పోయినేడాది తీసుకున్న అప్పు
మిత్తి పైసలు యాదికొస్తుండె!
తల్లసొంటి పొలాన్ని అప్పుకింద జమగట్టి
ఊరిడిసిన దినాలు ఎరుకున్నయా?
కట్టలేని అప్పుకిందికి కన్నపేగును
ఆసామికి కుదువ పెట్టుడు ఇప్పుడున్నదా?
నమ్ముకున్న పొలం మెడిమె తిప్పిననాడు
ఉరికొయ్యలకు వేలాడిన
రైతన్నల జీవితాలకు లెక్కలున్నయా?
ఇప్పుడు ఇండ్లు మొలిచిన జాగలల్ల
మునుపటి చెరువుల ఆనవాళ్లు పట్టిన చరిత్ర
ఇయ్యాల నవ్వుతున్న చెరువుల పేరు మిషన్ కాకతీయ
పంటపెట్టనింకె ఇమ్మతి రైతుబంధు
నూకల కూడు తిన్న ఇండ్లల్లో సన్నబియ్యం పండుగ
కన్నబిడ్డల బతుకులు మొదటితరం విద్యావంతులు!
అతను…
బిగిసిన పిడికిళ్ల తరపున నాయకుడై
వృద్ధుల బతుకులకు ఆసరా ఇస్తూ
ఆడపడుచులకు అండదండై
ప్రజల గుండెల్లో దీపమై…
ఎనిమిదేండ్ల తెలంగాణ వెలుగులు పంచుతూంది..!
– జయంతి వాసరచెట్ల,
99855 25355