అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలో పురుషులతోపాటు పనిచేసే మహిళా కార్మికులు 1857 మార్చి 8న తమ పనిగంటలను 16 నుండి 10 గంటలకు తగ్గించాలంటూ వీధుల్లో ర్యాలీ జరిపారు. నిరసన గళమెత్తిన వీరు యజమానుల దౌర్జన్యానికి గాయాలపాలయ్యారు. ఈ ఉద్యమ ఫలితంగా 1910లో డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌లో నిర్వహించిన సదస్సులో మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని జర్మన్ సోషలిస్టు లూయిస్ చీజ్ ప్రతిపాదించగా కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ సమర్థించారు.
మహిళా దినోత్సవాన్ని వివిధ దేశాలు వేర్వేరు రోజుల్లో జరుపుకొనేవి. అమెరికాలో మార్చి 19న, రష్యాలో ఫిబ్రవరి 28న జరిపేవారు. ఐక్యరాజ్యసమితి ప్రకటన ఫలితంగా 1914 నుంచి మార్చి 8న అన్ని దేశాలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్‌లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ పేరుతో తొలి మహిళా కార్మిక సంఘం ఏర్పాటయింది. అయినా నాటి నుంచి నేటి వరకు మహిళలు వివిధ రంగాలలో అసమానతలకు గురవుతూనే ఉన్నారు. మహిళా సాధికారత పోరాటం కొనసాగుతూనే ఉంది. మహిళా సాధికారత అంటే మహిళలకు అన్ని రంగాలలో సమాన ప్రాధాన్యం ఉండాలి. జీవితాశయాలను సాధించుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అందులో భావప్రకటన స్వేచ్ఛ అత్యంత ప్రధానమైనది.
స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, సృష్టే లేదు. అయినా అది గుర్తించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఏండ్ల తరబడి మహిళలు మానవ హక్కుల కోసం, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమానత్వం కొరకు పోరాడుతూనే ఉన్నారు. మహిళా సాధికారత అనేది ఏ ఒక్క వర్గం, కులం, మతానికి పరిమితమైనది కాదు.. సమస్త మహిళాలోకానికి సంబంధించినది. మహిళలు ఎవరి పరిధిలో వాళ్లు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మహిళలు విద్యావంతులు కావాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండాలి. సమకాలీన సమాజానికి అనువైన రీతిలో వ్యవహారదక్షులై ఉండాలి.
తరుణులు కూడా ఆలోచించాల్సిన తరుణమిది. మహిళాసాధికారత అంటే మగవారిని ద్వేషించడం అనే భావన కూడా సరైనది కాదు. మగవారిలో ఉత్తములు ఉంటారు. మహిళల్లో నడక, నడతలను మార్చుకోవాల్సిన వారు ఉన్నారు. అయితే భారతీయ కుటుంబ వ్యవస్థ నిలదొక్కుకోవాలి అన్నా, బీటలు వారాలన్నా ప్రధాన కారకులు మహిళలనేది మరువరాని విషయం. మహిళలు ప్రతి చిన్న విషయానికి పొంగిపోవడం, కుంగిపోవడం చేయకూడదు. జీవితంలో హెచ్చుతగ్గులు రావడం కూడా మన మంచి కోసమే అనుకోవాలి.
మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత, నైతికతతో కూడిన ఆరోగ్యకరమైన కుటుంబవ్యవస్థను, సమాజాన్ని స్థాపించుకోవాలి. మహిళలంతా సమస్యల పరిష్కారశక్తులుగా ఎదగాలి. ఎదిగిన కొద్దీ ఒదగాలి. అది మనమే ఎందుకు చేయాలి అంటే.. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. కనుకనే ప్రపంచ దేశాలు మన కుటుంబ వ్యవస్థకు జేజేలు పలుకుతున్నాయి. ఏ దేశమైనా స్త్రీలను గౌరవించితేనే గొప్ప దేశం అవుతుంది. లేకపోతే ఆ దేశ భవిష్యత్తు శూన్యం అవుతుంది.
ఎందరో మహిళామణులు అందరికీ వందనాలు. గార్గి, దేవహుతి, సీత, ఝాన్సీ, రుద్రమ వంటి వారి నుంచి నేటి ఆధునిక మహిళల వరకు వ్యవసాయం మొదలుకొని రక్షణ, సాంకేతిక, సాహిత్య, సంగీత, సామాజిక, క్రీడా, రాజకీయ, ఆర్థిక, ధార్మిక రంగాల్లో మహిళలు ఎందరో దేశాభివృద్ధిలో పాత్రధారులు అవుతున్నారు. ప్రపంచానికే తలమానికమైన భారతదేశ ప్రగతి రథసారథి అయిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
– నమిలికొండ సునీత
99084 68171