రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) సంచలనం సృష్టించింది. అయితే, ఈ హడావుడిలో ప్రజలు వేస్తున్న కొన్ని ప్రశ్నలకు ‘హైడ్రా’కు సమాధానాలు దొరకడం లేదు. ఇప్పుడు కూల్చుతున్న ఆక్రమణలకు గతంలో అనుమతులు జారీ చేసింది అధికారులే కదా? కబ్జాకు గురవుతున్నప్పుడు ఈ రెవెన్యూ అధికారులు ఏం చేసినట్టు?
గత జూలైలో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వివరాలు నోటిఫై చేయనందుకు హెచ్ఎండీఏను హైకోర్టు మందలించింది. అయినా, హైడ్రా ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్), బఫర్‌జోన్ పరిధిలో ఉన్న భవనాలను, బస్తీలను కూలగొట్టడం మొదలుపెట్టింది. హైకోర్టు పేర్కొన్నట్టు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వివరాల్లేకుండా ‘హైడ్రా’ కూలగొట్టడం ఎలా మొదలుపెట్టిందన్నది అంతుచిక్కని ఒక ప్రశ్న. ‘ఎవరైనా ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేస్తే ఫోన్ చేసి చెప్పండి’ అని జూలై నెలాఖరులో హైడ్రా పకటన ఇవ్వడం ఆశ్చర్యం. అసలు ప్రభుత్వ భూము లు ఏమేం ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్న వివరాలు రెవెన్యూ విభాగం నుంచి హైడ్రా అధికారులు తీసుకున్నారా? ఆ ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారా? హెచ్ఎండీఏ ఏర్పాటుచేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సంగతి ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.
‘హైడ్రా’ అధికారులు కూల్చబోతున్న భవనం లేదా బస్తీ, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అని సర్వే చేయనక్కర్లేదా, చెరువు దగ్గరకి వెళ్లి, దాని చుట్టుపక్కన ఉన్న ఇండ్లలో ఏది కూల్చాలని నాణెంతో చిత్తు బొత్తు వేసుకుని నిర్మాణాలను తొలగిస్తారా? THE TELANGANA PUBLIC PREMI SES (EVICTION OF UNAUTHORISED OCCUP ANTS) ACT, 1968 ప్రకారం.. ఆక్రమణదారులకు ముం దు షోకాజ్ నోటీసు ఇవ్వాలి. దానికి వారు సమాధానం ఇస్తారు. వారు చూపించిన పత్రాలన్నీ పరిశీలించి, వారి వాదనలు విని, వారు చట్టానికి వ్యతిరేకంగా అక్కడున్నారం టే, అప్పుడు ఎవిక్షన్ ఆర్డర్ జారీచేయాలి. ఈ ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల్లోగా కబ్జాదారులు అక్కడినుంచి కదలకపోతే అప్పుడు బలవంతంగా తొలగించేయవచ్చు.
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్ హాల్, గండిపేటలోని భవంతులు హైడ్రా కూల్చుతున్నప్పు డు సంపన్నులకు గుణపాఠం జరుగుతున్నదని కొందరు చంకలు గుద్దుకోవచ్చు. కానీ, మరి పేద ప్రజల సంగతేమిటి. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణానికి వచ్చే పేద ప్రజలకు ప్రభుత్వ భూములే కాస్త ఆసరా. అక్కడ ఓ గుడిసె వేసుకొని, దగ్గరలో ఏదో పని చేసుకుంటుంటారు. వారి ఆదాయానికి అద్దె కట్టడం కూడా కష్టమే. అలా గుడిసె వేసుకోవాలనుకునే వాళ్లకు హైదరాబాద్‌లోని పలు చెరువుల పక్కన ఉన్న భూమి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సరే, వారిని అక్కడినుంచి వెళ్లండని నోటీసులిచ్చి, వారికి ప్రత్యామ్నాయాలు చూపించి అక్కడికి పంపించడం ఒక పద్ధతి. బుల్డోజర్లతో మీద పడిపోవడం మరో పద్ధతి. ‘హైడ్రా’ విధానాలను కొందరు విమర్శిస్తున్నారంటే , వారంతా చెరువుల పరిరక్షణకు వ్యతిరేకం అని కాదు.
గూడు చెదిరిన పక్షుల వలె తలోదిక్కు అవుతున్న పేద బతుకుల సానుభూతిగానే చూడాలి. చెరువులు కబ్జా అవుతుంటే అది చెరువులకే కాదు, నగరానికి, ప్రజలకే నష్టం జరుగుతుందనేది నిజం. అయితే, చెరువుల పరిరక్షణలో భాగంగా ఒకవేళ పేదల గుడిసెలను తొలగించాల్సి వస్తే వారికి ముందస్తు నోటీసులిచ్చి, ఆ సమీపంలోనే వారికి ప్రత్యామ్నాయాలని చూపడం ప్రభుత్వ యంత్రాంగం కనీస చర్యలు అని నొక్కి చెప్పక తప్పదు.
చెరువులు, నదుల బఫర్జోన్లను కాపాడటం చాలా ముఖ్య విషయం. అవి ప్రకృతిలో భాగం. అయితే, ప్రస్తుతం ఉన్న భవంతులను కూలగొడితేనే చెరువులను కాపాడినట్టు కాదు. వాటిని కాపాడాలంటే, వాటి బఫర్‌జోన్ మార్కింగ్ సజావుగా జరగాలి. దాని చుట్టూరా ప్రహరీనో, సరిహద్దు రాళ్లో పెట్టాలి. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న ప్రజలకు పర్యవసానాలను వివరించాలి. చెరువు భూములు కబ్జాకు గురికాకుండా రెవెన్యూ చట్టంలోని లోటుపాట్లను సవరించాలి. చట్టాలు అనుసరించకపోతే ప్రజలకు శిక్ష పడుతుంది. మరి, చట్టాలు అనుసరించని ప్రభుత్వ విభాగాల సంగతి ఏమిటి? అందుకే, భూమి రిజిస్ట్రేషన్ అయ్యే విషయం దగ్గరినుంచి, రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూముల వివరాలు బయటపెట్టడం దగ్గరి నుంచి మార్పు మొదలవ్వాలి. ఇవన్నీ జరగకుండా ‘హైడ్రా’ అక్రమ నిర్మాణాలను యథేచ్ఛగా కూలగొడుతూ పోవడం అర్థరహితం.