అసలు యుద్ధం చేయాలని
ఎందుకనిపించింది నీకు ?
ఈ స్వప్న గోళాన్ని ఎందుకు విసిరి
ధ్వంసం చేయాలనిపించింది నీకు ?
రంగు రంగుల ఊహలున్న
ఈ అక్వేరియం ను తోసి
ఎందుకు గిలగిలా కొట్టుకోవడం
వేడుకగా చూడాలని పించింది నీకు ?
పరిమళాలు విరజిమ్మే
పూలకుండీని పగుల గొట్టి
ఎందుకు ఆనందించాలనిపించింది నీకు ?
గుబురుగా పెరిగిన చెట్ల మీద
గుంపులుగా పాడే పక్షులను
ఎందుకు వెంటబడి వేటాడి
ఉండేలుతో కొట్టాలనిపించింది నీకు ?
అసలు మనుషులను చూస్తే
మరో మనిషి మీద
దాడి చేయాలనిపించే పిచ్చెందుకు నీకు?
యుద్ధం తలపెట్టిన వాడా
యుద్ధం మొదలెట్టిన వాడా
తల్లులూ పిల్లలూ ఎదురు చూసే,
ఇంద్రధనుస్సు జీవితం ఇది
ఆశలనూ ఆత్మీయతలనూ
ఏడారి గాలులలో ధూళి చేయాలని
ఎందుకనిపించింది నీకు ?
శాంతిని, ప్రేమను కోరుకోలేవా ?
కలలు కనలేవా !?
ఉజ్వలంగా ఉత్సవంగా బతుకకుండా
ఈ యుద్ధం చేయాలన్న
బుద్ధేందుకు పుట్టుంది నీకు ?
సరిహద్దులు ఆక్రమిస్తావు
నగరాలను ఆక్రమిస్తావు
జనం మీద బాంబులు వేస్తావు
భూమిని శ్మశానం చేస్తావు
అంతటా బూడిద మిగిలిన ఎడారిలో
రాజ్యమెలా ఉంటుందనిపించింది నీకు
ప్రాణాలు ఉన్న ప్రజలు లేకపోతే
ప్రపంచమెలా కనిపిస్తుంది నీకు ?
దుమ్మురేగే మట్టి కోసం
మిగిలేటి పిడికెడు బూడిద కోసం
చిన్న పిల్లల నిద్ర చెడ గొట్టినట్టు
యుద్ధంచేయాలని
ఎందు కనిపిస్తుంది నీకు ?
-ఆశారాజు, 93923 02245