తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో సింహభాగంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా’ ఆయన వ్యవహరిస్తున్నట్టు మరోమారు రుజువైంది. మొన్నటివరకు మాదిగలకు రాజకీయ అవకాశాలను దూరం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఉపాధ్యాయ నియామకాలు, వైద్య విద్యలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా మాదిగ నిరుద్యోగ యువతను బహిరంగంగా వంచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాదిగలకు రాజకీయ, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.
మూడు దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2024 ఆగస్టు 1న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశంలోనే అందరికన్నా ముందుగా అమలుచేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తాం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం’ అని అదే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. కానీ, 60 రోజుల్లోనే ఆయన మాట తప్పారు. డీఎస్సీ (ఉపాధ్యాయ) ఉద్యోగ నియామకాలు, వైద్య విద్య ప్రవేశాల్లో వర్గీకరణను అమలు చేయకుండా సహజ స్వభావం చాటుకున్నారు. త్వరలో చేపట్టనున్న గ్రూప్ ఉద్యోగాల నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేయకుంటే మాదిగలకు మరింత నష్టం జరుగుతుంది.
ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి తన తొలి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించకుండా ఆదిలోనే అవమానపరిచారు. ప్రభుత్వ విప్, టీజీపీఎస్సీ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వంటి సాధారణ పదవులను కట్టబెట్టి మమ అనిపించారు. కీలక పదవుల్లో మాదిగలను విస్మరిస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో మాదిగల ప్రాధాన్యాన్ని క్రమంగా ఎందుకు తగ్గిస్తున్నారు? తాము రాజకీయంగా అంటరానివారమా? అనే ప్రశ్నలు మాదిగ ప్రతినిధుల్లో ఉదయిస్తున్నాయి. త్వరలో జరగనున్న రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు మొండిచెయ్యి తప్పదనే వార్తలు వినవస్తున్నాయి. పొరుగు రాష్ట్రం ఏపీలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితకు అత్యంత కీలకమైన హోం శాఖ మంత్రిత్వ బాధ్యతలు కట్టబెట్టి ఎన్డీయే కూటమి సముచితంగా గౌరవించింది. ప్రజా పాలన అంటూ స్వీయ గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ ప్రభుత్వంలో ఈ విధానం ఎందుకు లేదు? అనే ప్రశ్నకు హస్తం అగ్రనేతలు సమాధానం చెప్పాలి.
రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే విషయంలోనూ తొలిసారిగా మాదిగ సామాజికవర్గం అవకాశం కోల్పోవడం ఆవేదన కలిగిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా, వాటిలో పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాల నుంచి రాజకీయ పలుకుబడి కలిగిన ఇద్దరు మాలలతో పాటు బైండ్ల (మాదిగ ఉపకులం) సామాజికవర్గానికి చెందిన మహిళను బరిలో నిలిపింది. తద్వారా ఒక్క స్థానంలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మొదట్లోనే నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో మాదిరిగానే జనాభా ప్రాతిపదికన ఇద్దరు మాదిగ, ఒక మాల సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలపగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఇదే పద్ధతిని అనుసరించింది. హోరాహోరీగా జరిగిన లోక్‌సభ ఎన్నికల సమరంలో మూడు రిజర్వ్డ్ స్థానాల్లోనూ ‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదంతో ముందుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి మాదిగలను పార్లమెంట్ మెట్లు ఎక్కకుండా చేసిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు.
ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎంపీ టికెట్లు ఇవ్వడం సరికాదని మాదిగ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ బాహాటంగా అభిప్రాయాన్ని తెలపగా.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై ఆరేండ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఏకంగా అధిష్ఠానం నియమించిన రాష్ట్ర వ్యవహారాల కమిటీ ఇన్చార్జీ గురించి అనుచితంగా మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దాని ద్వంద్వ నీతిని తెలియజేస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కాక నామినేటెడ్ పదవుల భర్తీలోనూ మాదిగలకు అన్యాయమే జరిగింది. మొత్తం 34 మందితో కూడిన తొలి జాబితాలో మాదిగ సామాజికవర్గానికి ఒక్కరికి మాత్రమే చోటు దక్కడం శోచనీయం. అది కూడా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కావడం గమనార్హం. ఇక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మాదిగలకు టికెట్‌ను నిరాకరించి మరోసారి మోసం చేసింది. తన రాజకీయ ఎదుగుదలలో మాదిగలు కీలకపాత్ర పోషించారని స్వయంగా రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభలు, సమావేశాల్లో చెప్పారు. ‘ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన’ చందంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్.. మట్టి మనుషులైన మాదిగలను తీవ్రంగా అణచివేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఆరు పర్యాయాలు ఎన్నికైన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి ఇష్టపడలేదు. మాదిగ సామాజికవర్గానికి రాజకీయంగా జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని పలుమార్లు ఆయన బహిరంగంగా కోరినా రేవంత్ స్పందించలేదు. రేవంత్ పాలనలో తమ కులం రాజకీయంగా అణచివేతకు గురవుతున్నదని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం పెడచెవిన పెడుతున్నది. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎంపీ టికెట్లు ఇవ్వడం సరికాదని మాదిగ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ బాహాటంగా అభిప్రాయాన్ని తెలపగా.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై ఆరేండ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఏకంగా అధిష్ఠానం నియమించిన రాష్ట్ర వ్యవహారాల కమిటీ ఇన్చార్జీ గురించి అనుచితంగా మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దాని ద్వంద్వ నీతిని తెలియజేస్తున్నది. ప్రజా పాలనలో మొదటి బహిష్కరణ వేటు మాదిగ సామాజికవర్గానికి చెందిన జడ్సన్‌పై పడిందన్న విషయాన్ని చరిత్ర ఎన్నటికీ మరచిపోదు.
‘మార్పు రావాలి.. ఒక్క అవకాశం’ అంటూ అధికారంలో వచ్చిన రేవంత్.. సామాజిక న్యాయానికి యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. మంత్రివర్గంలో అతి తక్కువ జనాభా కలిగిన సామాజికవర్గాలను అందలమెక్కించి.. మెజారిటీ జనాభా కలిగిన వర్గాలకు అరకొర అవకాశం ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, నామినేటెడ్ పదవుల్లోనూ తన సొంత సామాజికవర్గానికి రేవంత్ అధిక ప్రాధాన్యం ఇవ్వడం బహుజనుల కన్నెర్రకు కారణమవుతున్నది.
బ్యూరోక్రాట్ల హోదా, శాఖల కేటాయింపులోనూ వర్గ ప్రీతిని ప్రదర్శించారు. ఇలా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నియంతృత్వ విధానాలను అవలంబిస్తుండటాన్ని బహుజనులు గమనిస్తూనే ఉన్నారు. మాదిగల పుట్టుకలోనే పోరాటం ఉంది. న్యాయమైన హక్కుల సాధన కోసం కొట్లాడటం మాదిగలకు కొత్తేం గాదు. ఇంకా అణచివేస్తామంటే కాంగ్రెస్‌కు రాజకీయంగా చావు ‘డప్పు’ కొట్టడం తథ్యం.