రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలే కీలకం. ఆయా పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోలే ప్రధానం. కానీ ఓట్లడిగేటప్పుడు వందల కొద్దీ హామీలివ్వడం, తీరా ఆ ఓట్లతో గెలిచి ఆ హామీలను పక్కనపెట్టే పాడు సంస్కృతి దశాబ్దాలుగా చూసిన తెలంగాణ జనం ప్రస్తుతం ఆచరణ-ఆమోదం అనే రెండు పదాలనే చూస్తున్నారు. గతంలో అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం ఎన్నికలప్పుడు కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోలకు విలువివ్వడమే మానేసారు.
కాంగ్రెస్ పార్టీ 2018లో అలవికాని హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసి ఓట్లు పొందాలని నానా తంటాలు పడి చేతులు కాల్చుకున్నది.అనేక సాధ్యంకాని హామీలిచ్చినా, పెన్షన్లు పెంచుతామన్నా, రైతు రుణమాఫీ రూ.2లక్షలు అని చెప్పినా జనం నమ్మలేదు. మళ్లీ ఇప్పుడు ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉచితానుచితాలను మరింత పెంచి ప్రజలకు ఎర వేయాలని చూస్తున్నది. లోగడ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలకు, ఇటీవల ప్రకటించిన డిక్లరేషన్లకు ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోకు తేడా చూస్తే నక్కకు నాగ లోకానికి ఉన్నంత కనిపిస్తుంది. మ్యానిఫెస్టో విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గత పదేండ్లలో ఏం చేశారో చెప్పారు. అలాగే వచ్చే ఐదేండ్లలో ఏం చేస్తారో… ఎంత చేస్తారో క్లారిటీ ఇచ్చారు. గతంలో నెరవేర్చిన హామీలు, అమలు చేస్తున్న కొత్త పథకాలు, ప్రస్తుతం ఇచ్చిన హామీలను కలిపి వచ్చే ఐదేండ్లలో అమలు చేసే సామర్థ్యం బీఆర్ఎస్కు మాత్రమేనని వివరించారు.
తెలంగాణలో పదేండ్లుగా సుస్థిర ప్రభుత్వాన్ని నిర్మించుకుని రాజకీయ సాధికారత, ఆర్థిక స్వావలంబనతో ముందుకు సాగుతూ సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోన్న బీఆర్ఎస్ విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల మెప్పు పొందుతున్నదని చెప్పాలి. స్వీయ పాలనలో సంస్కరణలు చేపట్టి అన్ని వర్గాలకు విధానాల రూపంలో లబ్ధి చేస్తున్న తీరును మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వివరించిన తీరు అద్భుతం. అంటే ఒక పార్టీ నాయకుడు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు, తన ప్రజలకు కావాల్సిన అవసరాలు, హామీల గురించి వివరంగా చెప్పారు.
కాంగ్రెస్ ఏలుబడిలోని అరవైఏండ్లలో, బీజేపీ పాలనలోని పదేండ్లలో దేశం, రాష్ర్టాల పరిస్థితిని గమనంలోకి తీసుకుంటే అనేక ఎన్నికల్లో హామీలిచ్చి, మ్యానిఫెస్టోలను విడుదల చేసి ప్రజల చీత్కారాలకు ఆ పార్టీలు గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుండి, ఉద్యమ ఆకాంక్షల నుండి పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి రెండు సార్లు విజయం సాధించి మూడోసారి పరీక్షను నెగ్గబోతోంది. గతంలో రెండు సార్లు ప్రకటించిన మ్యానిఫెస్టోలను పరిశీలిస్తే నూటికి నూరు శాతం ఆ హామీలను నేరవేర్చుతూనే లెక్కలేనన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టి జనం మదిని గెలిచింది. విజయవంతమైన గత హామీలనే ఈ సారి మరింత పెంచుతూ ఆర్థిక భరోసా ఇచ్చింది. దేశంలో రైతు బంధు సాయాన్ని అమలు చేస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే. రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా రూ.10,000. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దాన్ని మొదటి సంవత్సరంలో ఎకరానికి ఏటా రూ. 12,000గాను, వచ్చే ఐదేండ్లలో క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా రూ.16,000లకు పెంచుతామని చెప్పారు. ఎలాంటి దళారులు, పైరవీలు లేకుండా ప్రజలకు నేరుగా అందచేస్తున్న ఈ పథకం గత ఏడేండ్లుగా విజయవంతంగా అమలవుతున్నది. వచ్చే ఐదేండ్లలో ఈ పెట్టుబడి సాయాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం ముదావహం.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని కూడా చెప్పారు. గత పదేండ్లలో హాస్టళ్లు, వివిధ వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ చేసి నాణ్యమైన భోజనం అందించిన కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఇంటింటా సన్న బియ్యం పంపిణీ చేపట్టడం రాష్ట్ర ప్రగతికి, ఆత్మ విశ్వాసానికి తార్కాణమని చెప్పాలి. పేదలకు ఆరోగ్య బీమా కోసం తెల్లకార్డు కలిగిఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ. 5 లక్షల జీవితబీమాను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో రూ 5,016కు, ఇటీవలేరూ.4,016కు పెంచిన దివ్యాంగుల పింఛన్‌ను రాబోయే ఐదేళ్లలో రూ. 6,016కు పెంచుతామన్న ప్రకటన ఆ వర్గాల్లో మరింత ఆత్మస్థైర్యం నింపింది. అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా రూ. 3,000 జీవన భృతిని అందిస్తామని, అర్హులైన పేద మహిళలకు, అక్రిడిటేషన్ గల జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండరు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉన్న ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని హామీ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలా చెప్పుకుంటే పోతే కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎన్నికల హామీల దిశగా కాకుండా పేద బడుగు బలహీనవర్గాల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే దిశగా ఉన్నదని చెప్పాలి.