కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పట్టా పుచ్చుకుంటే, బీజేపీ పీహెచ్డీ చేసింది. అయితే మోదీ, కాదంటే ఈడీ అనే మాట ఊరికే రాలేదు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బీజేపీ సర్కార్ ఉపయోగించే సాధనాల్లో ఈడీ కేసులు పెట్టడమనేది ప్రముఖంగా ఉండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అదే పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు ఓ విచిత్రమైన చట్టాన్ని పార్లమెంట్ ముందుంచింది. ప్రధాని, సీఎం, మంత్రులు ఇలా ఎవరైనా, ఏదైనా కేసులో అరెస్టయి నెలరోజులు జైలులో ఉండాల్సి వస్తే వారి పదవులను ఉన్నపళంగా ఊడగొట్టేందుకు ఈ చట్టం తెస్తున్నట్టు చెప్పుకొంటున్నది. సంబంధిత మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గందరగోళం మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాలతో వాటిని జేపీసీకి పంపారు. పెద్ద రాజకీయ దుమారానికి కారణమైన బిల్లుల్లో ఏముందో పరిశీలిస్తే విస్మయం కలుగక మానదు. ప్రధాని, కేంద్రమంత్రులు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలతో అరెస్టయి జైలుకు వెళ్తే వారిని ఆ పదవుల నుంచి తొలగించే చట్రాన్ని కొత్త చట్టాలు సమకూరుస్తాయని కేంద్రం అంటున్నది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలుశిక్ష పడేందుకు అవకాశమున్న నేరారోపణలపై 30 రోజులు కస్టడీలో గడిపితే, 31వ రోజు వారిని తొలగించేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. విడుదలయ్యాక తిరిగి పదవుల్లో నియమించవచ్చనీ తెలియజేస్తున్నాయి.
రాజకీయాలను నేర, అవినీతి రహితం చేయాలనే సదుద్దేశంతో బీజే పీ ప్రభుత్వం ఈ బిల్లులను తెస్తున్నదంటే ఎవరూ నమ్మడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ విపక్ష నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బీజేపీ హయాంలో కేసులు పెరిగితే అవి కంచికి చేరి శిక్షలు పడిన సందర్భాలు బహుతక్కువ అని గణాంకాలు ఉద్ఘోషిస్తున్నాయి. అనేక సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలపై, ముఖ్యంగా ఈడీపై కోర్టులు మండిపడ్డాయి. జార్ఖండ్ సీఎం హేమంత్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. నేరం రుజువ య్యేవరకు శిక్ష విధించరాదనేది సహజ న్యాయ సూత్రం. కానీ, కేవలం ఆరోపణలు ఎదుర్కొంటూ నెలరోజులు జైల్లో గడిపితే పదవి ఊడగొట్టడమనే నిరంకుశ చట్టం అవసరమా? అనేది అసలు ప్రశ్న.
కేవలం విపక్ష ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టి, తాత్కాలికంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయా ప్రభుత్వాల ముఖ్యులను అరెస్టు చేసి నెలల తరబడి జైళ్లలో పెట్టడం బీజేపీ హయాంలో రివాజుగా మారింది. తన పక్షం అయినవారు కేసులున్నా రాత్రికి రాత్రే కడిగిన ముత్యాలు అయిపోవడమూ చూస్తున్నాం. ఈ చరిత్ర అంతా కండ్ల ముందే ఉంటే, ఇప్పుడు ప్రధాని సహా అందరినీ చట్ట పరిధిలోకి తెస్తున్నామని కేంద్రం గడుసుతనం చూపిస్తున్నది. అయిదేండ్లకు పైగా శిక్ష పడే క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తి ప్రధాని పదవిలోకి వస్తారా? ఒకవేళ వస్తే గిస్తే ఆయనపై తగిన చర్య తీసుకునేందుకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవా? అనేది మరో ప్రశ్న. ఇది పిల్లికి రొయ్యల మొలతాడు కట్టడం తప్ప మరోటి కాదని చెప్పక తప్పదు.