భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట కేంద్రంలో మూడో ప్రత్యామ్నాయం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇతర వామపక్షాల మద్దతుతో కేంద్రంలో 2004 నుంచి 2008 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు నడిచింది. కమ్యూనిస్టులు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కూడా మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యేంత వరకు కొనసాగింది. వామపక్షాల మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్ ఆధిపత్యమున్న మన్మోహన్సింగ్ ప్రభుత్వ ఏర్పాటుతోనే దేశంలో మూడో ప్రత్యామ్నాయానికి నూకలు చెల్లినట్టయింది.
ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భాగస్వామ్యం లేని మూడో ప్రత్యామ్నాయ కూటమికి చెందిన చివరి ఇద్దరు ప్రధానులు ఎవరంటే.. హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ అని చెప్పకతప్పదు. కానీ, కాంగ్రెస్ బయటి నుంచి ఇచ్చిన మద్దతుతో దేవెగౌడ, గుజ్రాల్ నాయకత్వాన ఈ ప్రభుత్వాలు నడిచిన కారణంగా వాటిని అసలుసిసలు మూడో ప్రత్యామ్నాయాలుగా పరిగణించలేం. వరుసగా 2009, 2014, 2019, 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఇండియాలో మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం లేదని నిరూపించాయి. కమ్యూనిస్టు పార్టీలు, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో పూర్వపు పాలకపక్షాలు సమాజ్‌వాదీ, ఆర్జేడీలు పది, పదిహేనేండ్ల క్రితం వరకు దేశంలోని రెండు ప్రధాన జాతీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌కు సమాన దూరం పాటిస్తామనే వైఖరిని అవలంబించాయి. తర్వాత ఈ రెండు పెద్ద హిందీ రాష్ర్టాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తమ రాజకీయ పంథాకు స్వస్తి పలికాయి.
రెండు చోట్లా ముఖ్యంగా యూపీలో బీజేపీ 2014 నుంచీ బలీయ శక్తిగా అవతరించడం, బీహార్‌లో బీజేపీ బలం క్రమేపీ పెరగడం దీనికి కారణం. వాస్తవానికి యాదవులు, కుర్మీలు, ఇతర వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లిం మద్దతు మెండుగా ఉన్న ఎస్పీ, ఆర్జేడీలు ఈ రెండు రాష్ర్టాల్లో బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ప్రస్తుత బలహీన స్థితికి నెట్టివేయడంలో కీలకపాత్ర పోషించాయి. యూపీలో అయితే బయటి నుంచి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఎస్పీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (1990ల చివర్లో) తన సంకీర్ణ సర్కారులోకి కాంగ్రెస్‌ను తీసుకోలేదు. మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. చివరికి 2017 యూపీ అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్వల్ప సంఖ్యలో సీట్లిచ్చి, ఎస్పీ కలిసి పోటీచేసింది.
ఇక బీహార్ విషయానికి వస్తే ఆర్జేడీ (ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ భార్య రబ్డీ దేవీ నాయకత్వంలో) చివరి దశ పాలనకాలంలో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా చేరింది. మళ్లీ 2014 తర్వాత రెండుసార్లు జేడీయూ నేత నితీశ్ కుమార్ నాయకత్వాన సాగిన మహా ఘటబంధన్ సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా కాంగ్రెస్ చిన్నపాటి భాగస్వామి అయింది. కేంద్రంలో, అనేక ఉత్తరాది రాష్ర్టాల్లో పదేండ్లకు పైగా అధికారంలో పాతుకుపోయిన బీజేపీని గద్దె దింపాలంటే కాంగ్రెస్ కూటమిలో ఉండక తప్పదనే నిర్ణయానికి డీఎంకే వంటి దక్షిణాది పార్టీ సహా జనతా పరివార్ పార్టీలుగా పిలిచే ఎస్పీ, ఆర్జేడీ, ఇంకా కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు వచ్చేశాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎన్నికల్లో పొత్తు, అధికారం పంచుకునే పార్టీలు ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కేరళలో వామపక్షాలు, తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్, ఒడిశాలో బీజేడీ వంటి కొన్ని పార్టీలే ఎన్డీయే, ఇండియా కూటములకు దూరంగా ఉన్నాయి.
దేశంలో, ముఖ్యంగా కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకుండా త్రిశంకు లోక్‌సభల ఏర్పాటుకు 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 పార్లమెంట్ ఎన్నికలు దారితీశాయి. ఒక్క 1991 పార్లమెంటు మధ్యంతర ఎన్నిక తర్వాత మాత్రమే కాంగ్రెస్ ఇతర పార్టీలను చీల్చి, మైనారిటీ సర్కారును మెజారిటీ మద్దతు ఉన్న ఏక పార్టీ ప్రభుత్వంగా రెండున్నరేండ్లలో మార్చగలిగింది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు చాణక్యం, పాండిత్యం అందుకు దోహదం చేశాయి. అలా కాకుండా కేంద్రంలో పాలక కూటమికి నాయకత్వం వహించిన జనతాదళ్, బీజేపీలకు 1996-2004 మధ్య రెండొందల సీట్లు మాత్రమే లోక్‌సభలో ఉన్న కారణంగా రాజకీయ సుస్థిరత లేదనే చెప్పవచ్చు.
ఈ కారణంగానేఅప్పట్లో మధ్య తరగతి పౌరులు.. ‘దేశంలో రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఏదో ఒకదానికి పార్లమెంటు ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సీట్లు రావాలి. మన లాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తున్న బ్రిటన్, అధ్యక్ష తరహా పాలన ఉన్న అమెరికాలో మాదిరిగానే రెండు ప్రధాన ఆధిపత్య రాజకీయపక్షాలు మాత్రమే సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చే రాజకీయ వ్యవస్థ భారత్‌లోనూ వేళ్లూనుకోవాలి’ అనే భావనతో ఉండేవారు. అయినా బీజేపీ, కాంగ్రెస్ మీద ఆధారపడకుండా మూడో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలపడితేనే భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండేది.
కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణులను, ఇతర ప్రాంతీయపక్షాలను స హించని ఆధిపత్య ధోరణులను గట్టిగా వ్యతిరేకించే వామపక్షాలు సహా అనేక పక్షాలు 1967-1989 మధ్యకాలంలో హిందూ మ తతత్వ భావజాలంతో ఉన్న జన్‌సంఘ్, బీజేపీ, శివసేన వంటి పక్షాలతో చేతులు కలపడానికి వెనుకాడలేదు. 2014 నుంచీ కేం ద్రంలో, దేశంలోని నాలుగు వైపులా ఉన్న అనేక రాష్ర్టాల్లో బీజేపీ బలపడే క్రమంలో దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం గురించి మాట్లాడే ఓపిక, ఆసక్తి వామపక్షాలు సహా అనేక బలమైన ప్రాంతీయపక్షాలకు లేకుండా పోయాయి.
యూపీఏ-2 హయాం మధ్యలో 2012లో వేగం పుంజుకున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన అదే ఏడాది నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అవతరించింది. వామపక్ష విధానాల వైపు మొగ్గుతో బయల్దేరిన ఆప్ ఆరంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఏడాది తర్వాత 2013 చివర్లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లలో 26 స్థానాలు, 29.5 శాతం ఓట్లు సాధించి సంచలనం సృష్టించింది. 32 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించడానికి ఆప్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీ సీఎం అయ్యారు. కాంగ్రెస్‌తో విభేదాల వల్ల కొద్ది నెలలకే కేజ్రీవాల్ సర్కార్ కూలిపోయాక ఎప్పటిలా రెండు జాతీయపక్షాలకు ఆప్ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించే ప్రయత్నం చేసింది.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి కూడా నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్రమోదీపై కేజ్రీవాల్ పోటీకి దిగి, కాంగ్రెస్, బీజేపీలకు తాను వ్యతిరేకమని నిరూపించారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ పెంచుకోవడం, కేంద్ర సర్కారు ఆదేశాలకు అనుగుణంగా నడిచే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లతో గొడవల కారణంగా గత రెండేండ్లలో కాంగ్రెస్‌కు ఆప్ కాస్త దగ్గరైంది.
అయితే, 2022 పంజాబ్ ఎన్నికల్లో నాటి పాలకపక్షం కాంగ్రెస్, అకాలీదళ్, బీజేపీ కూటములను ఓడించి మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే భావన కలిగించింది. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలనే కాంక్షకు నెమ్మదిగా తెరదించింది.
2024 బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికల్లో 33 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకున్న లేబర్ పార్టీ మంచి మెజారిటీ (మొత్తం 650కి 411 సీట్లు) సాధించింది. పూర్వపు అధికారపక్షం కన్జర్వేటివ్ పార్టీ 23.7 శాతం ఓట్లతో కేవలం 121 సీట్లే గెల్చుకుంది. కొత్తగా రంగంలోకి దిగి 600కు పైగా సీట్లలో పోటీచేసిన మితవాద రిఫామ్ పార్టీ (పాత బ్రెగ్జిట్ పార్టీ) గెలిచింది 6 సీట్లే అయినా 14.3 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. అంతేకాదు, ఇటీవల వివి ధ రాజకీయపక్షాల పనితీరుపై జరిగిన ఒక స ర్వేలో రిఫామ్ పార్టీ బాగా పుంజుకుంటున్న ట్టు తేలింది.
నిండా ఏడు కోట్ల జనాభా లేని ఇంగ్లండ్‌లోనే నూరేండ్లకు పైగా కొనసాగుతున్న రెండు ఆధిపత్య రాజకీయపక్షాల (లేబర్, కన్జర్వేటివ్) పాలనకు స్వస్తి పలికి మూ డో ప్రత్యామ్నాయానికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం జనంలో బలపడుతోంది. ఈ నే పథ్యంలో దాదాపు నూరు కోట్ల మంది ఓటర్లు, ఏడెనిమిది మతాలు, వేలాది సామాజికవర్గాలు ఉన్న సువిశాల భారతదేశంలో కే వలం రెండు జాతీయ రాజకీయపక్షాలే ఒకదా ని తర్వాత ఒకటి కేంద్రంలో అధికారం చేపట్టడం వాంఛనీయ పరిణామం కాదు.
– మెరుగుమాల నాంచారయ్య