కొన్ని నెలలుగా ‘ఫార్ములా-ఈ’ రేస్ గురించి చర్చ జరుగుతున్నది. కాబట్టి ముందు అసలు కార్ రేస్‌లు ఎందుకు జరుగుతాయో క్లుప్తంగా తెలుసుకుందాం. ‘ఫార్ములా-వన్’, ‘ఫార్ములా-ఈ’ రేస్లనేవి సంపన్న క్రీడా వినోదం మాత్రమే కాదు.. కార్ల పరిశ్రమలోని ముఖ్యమైన కంపెనీలు తమ అత్యున్నత ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించే వేదిక కూడా. పోటీదారుల కన్నా మెరుగైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం కోసం కార్ల తయారీదారులను ప్రేరేపించడం, తద్వారా ఆ నవీన సాంకేతికతలు, భద్రతా ప్రమాణాలు కమర్షియల్ కార్ల తయారీలో సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఇవి సాగుతాయి.
వాతావరణ కాలుష్యాన్ని అధిగమించడానికి సంపద్రాయ పెట్రోల్ కార్లకు బదులుగా విద్యుత్తు కార్ల తయారీ, వినియోగాన్ని ప్రపంచ దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ సాంకేతికత, పరిశ్రమ రెండూ ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ఇంకా మన్నికైన సాంకేతికత అభివృద్ధి చెందాల్సి ఉన్నది. ఈ దిశగా పరిశ్రమను ముందుకు నడిపించడంలో భాగంగానే సంప్రదాయ ఇంధనంతో నడిచే ఖరీదైన ‘ఫార్ములా-వన్’ లాగానే ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా నడిచే ‘ఫార్ములా-ఈ’ రూపుదిద్దుకున్నది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తెలంగాణను అగ్రగామిగా నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోవలోనే జహీరాబాద్ నిమ్జ్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు(ట్రీటీన్ ఎలక్ట్రిక్ కంపెనీ), దాని అనుబంధ బ్యాటరీ పరిశ్రమ (అమర్ రాజా), అనేక పరిశోధన పరిశ్రమలు తెలంగాణలో నెలకొల్పారు. దీనికి కొనసాగింపుగానే తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమ మరింత విస్తరించడానికి ‘ఫార్ములా-ఈ’ ద్వారా ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నంగా ఈ పోటీలు హైదరాబాద్‌లో జరిగాయి.
ఫార్ములా ఎలక్ట్రిక్ ఆర్గనైజేషన్(ఎఫ్ఈవో) ప్రపంచవ్యాప్తంగా ‘ఫార్ములా-ఈ’ పోటీలు నిర్వహిస్తుంటుంది. పర్యావరణహిత ఇంధనరంగంలో అగ్రగామి అయిన గ్రీన్ కో, తన గ్రూపులోని ఏస్ నెక్స్ జెన్ ద్వారా స్పాన్సర్ చేయడానికి ముందుకువచ్చింది. దీనికై ఏస్ నెక్స్ కంపెనీ, ఎఫ్ఈవో కంపెనీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తనవంతుగా వారి ప్రమాణాలకు అనుగుణంగా రోడ్ ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. (ఇందుకోసం ప్రభుత్వం రూ. 12 కోట్లు ఖర్చుపెట్టింది). ఈ మేరకు మూడు పార్టీలు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2023, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మొదటి సీజన్లో పోటీలు విజయవంతంగా నిర్వహించాయి.
రెండవ సీజన్లో ఏస్ నెక్స్ జెన్ కంపెనీ పెట్టుబడికి ఆశించిన ప్రతిఫలం రాకపోవడంతో ఒప్పందం నుంచి తప్పుకున్నది. మలిదశ పోటీల కోసం ఫీజు చెల్లించాల్సిన సందర్భంలో మరో స్పాన్సర్ అందుబాటులో లేకపోవటం వల్ల ఎఫ్ఈవో సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపి, వేదిక ఇతర నగరాలకు తరలిపోకుండా తానే స్పాన్సర్‌గా వ్యవహరించడానికి ముందుకువచ్చి రూ. 55 కోట్ల ఫీజును చెల్లించింది.
ఇందులో కంపెనీకి చెల్లించాల్సిన మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఎఫ్ఈవోకు కానీ, ఏస్ నెక్స్ కంపెనీకి కానీ లాభం జరిగేలా ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయలేదు. మరి అవినీతికి అవకాశం ఎక్కడిది? నిందితులకు ఎలాంటి ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనం జరిగినట్టు ప్రభుత్వం కూడా ఫిర్యాదులో పేర్కొనలేదు. ఏసీబీ కేసు నిలబడాలంటే నిందితులకు అక్రమంగా డబ్బులు చేరినట్టు నిరూపణ జరగాలి. కానీ, ఈ కేసులో అలాంటిదేమీ లేదు.
ప్రభుత్వం అన్నాక కొన్ని నిర్ణయాలను సందర్భానుసారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మంత్రిగా కేటీఆర్ తన స్థాయిలో విచక్షణ ఉపయోగించి నిధులు విడుదల చేశారు. ఇదేమీ రహస్యంగా జరగలేదు. ప్రభుత్వం అధికారికంగానే నిధులు విడుదల చేసింది. ఈ విషయంలో ఏం జరిగిందో మీడియా ముందు చెప్పి కేటీఆర్ తన పారదర్శకతను నిరూపించుకున్నారు. అయితే, కేటీఆర్‌ను ఇరికించాలన్న ఏకైక లక్ష్యంతో విచారణ పేరుతో పిలిచి, అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది. కాంగ్రెస్ కుట్రలు ప్రజలకు అర్థం కావనుకుంటే అంతకుమించిన తెలివితక్కువ తనం మరోటి ఉండదు.