AYUSH | యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆయుర్వేద వైద్యం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాణ్యతా ప్రమాణాల కొరతతో రోగులను ఆగం చేస్తున్నది. మెడికల్ అధికారులను బోధనా సిబ్బందిగా వాడుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణమని రోగులు ఆరోపిస్తున్నారు. అయితే, ‘ఆయుష్ అసిస్టెంట్ ప్రొఫెసర్’ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఎప్పుడో ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ సిద్ధమై కూడా ఏండ్లు గడుస్తున్నది. కానీ, ఆ నోటిఫికేషన్ మాత్రం విడుదల కావడం లేదు. ఆ నోటిఫికేషన్ ఎందుకు ఆగిపోయిందో ఉద్యోగార్థులకు సైతం అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో రెండు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలున్నాయి. అయితే, రాష్ట్రంలో 36 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెండేండ్ల కిందట ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేశారు.
ఆయుర్వేద విద్యనభ్యసించిన విద్యార్థులు సైతం వేల సంఖ్యలోనే ఉన్నారు. వీళ్లు నోటిఫికేషన్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగుల కోసం కాకపోయినా, ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించే విద్యార్థుల కోసమైనా ‘ఆయుష్ అసిస్టెంట్ ప్రొఫెసర్’ పోస్టులను భర్తీచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా ఆయుర్వేద వైద్య విద్య బలోపేతమయ్యే అవకాశాలున్నాయి. ఆయుర్వేద వైద్యచికిత్సపై గొప్పలకు పోయే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వైద్య కళాశాలల్లో ఏర్పడే ఖాళీలను ఏండ్ల తరబడి భర్తీ చేయకపోవడం శోచనీయం. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుర్వేద కళాశాలల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తాయని ఆశిద్దాం.
– రావుల రాజేశం, సామాజిక కార్యకర్త