తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఉద్యోగ సంఘాలుగా ఏర్పడి చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. వారు తమ జీతం గురించి కాకుండా తమ పిల్లలు, తమ ప్రాంత భవిష్యత్తు గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఉద్యమించారు. సకలజనులతో సమ్మెలో పాల్గొని పాలనను స్తంభింపజేశారు. పెన్‌డౌన్ చేసి పెను సంచలనం సృష్టించారు. సహాయ నిరాకరణతో సమరశంఖం పూరించారు.
తమ ఉద్యోగాలను, కుటుంబాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అందుకే, వారు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమకారులు కూడా. కాబట్టి, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా 2015లో 10వ పీఆర్సీ సిఫారసు చేసిన 29%కు బదులుగా 43% ఫిట్మెంట్ ప్రకటించారు. తద్వారా తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనం తీసుకునే ఉద్యోగులయ్యారు.
అలాగే, 2021లో 1వ పే రివిజన్ కమిటీ 7.5% ఫిట్మెంట్ సిఫారసు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అదనంగా 22.5 పాయింట్లు జోడించి 30% పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించింది. కేసీఆర్ ఫిట్మెంట్ తర్వాత, కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేస్తే చివరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు. సగం మందికి ఒకటో తేదీన జీతాలు రావడంలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి కూడా జీతాలు అందడంలేదు. మరోవైపు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆర్థిక భారాలకు అనుగుణంగా ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు చేయాలి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే మూడేండ్లు కావొస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు.
ఇప్పటికే ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ, ప్రభుత్వం కరువు భత్యాన్ని కూడా కానుకల లెక్క దశలవారీగా ఇస్తుండటం దారుణం. మా పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఉద్యోగులు అడిగితే తనను కోసుకొని తిన్నా రూపాయి రాదని, ప్రభుత్వం దివాలా తీసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారు. తాను ఎక్కడికైనా వెళ్తే చెప్పులు ఎత్తుకపోయేవాడిలా చూస్తున్నారని మాట్లాడటం అత్యంత ఆందోళన కలిగించే అంశం. అలాగే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను తొలగించి 2004 తర్వాతి ఉద్యోగస్తులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించడం ప్రధాన డిమాండ్. ఎందుకంటే, ఉద్యోగులు తమ ఒంట్లో సత్తువ ఉన్నన్ని రోజులు ప్రభుత్వానికి సేవలు చేస్తే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. నెలవారీగా పెన్షన్ రావడం రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించినట్టు ఉన్నది. ఆ సమయంలో ఇచ్చే పెన్షన్ కేవలం డబ్బు కాదు, అదొక ఆత్మగౌరవం. మలిదశలో ఎవరి మీదా ఆధారపడకుండా జీవించే స్వేచ్ఛ. 30, 35 ఏండ్ల ప్రభుత్వ సేవకు లభించే భరోసా.
ప్రభుత్వంలో, పాలనలో భాగస్వామి అయిన ఉద్యోగికి అనారోగ్యం వస్తే హాస్పిటల్ బిల్లు ఎలా కట్టాలో అర్థంకాకనే సగం కుమిలిపోతున్నారు. అనేక సందర్భాల్లో దవాఖానలు కార్డులు స్వీకరించకపోవడం, నగదురహిత వైద్యం అందకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం అత్యంత దయనీయం. అయితే ఈహెచ్ఎస్ను పకడ్బందీగా అమలు చేస్తామని అంటూ ఉద్యోగుల కనీస వేతనం నుంచి 1.5% మొత్తాన్ని రెండు నెలలపాటు కట్ చేశారు.
కానీ ఆ పథకం ప్రారంభం కాలేదు. అందులోనూ ప్రముఖ కార్పొరేట్ దవాఖానలకు కాకుండా కేవలం ప్రభుత్వ దవాఖానలను మాత్రమే ఈ పథకంలో చేర్చారని ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతున్నది. జీవో 317 కారణంగా స్థానికత, ఉద్యోగాల కేటాయింపు వంటి అంశాల్లో అనేక మంది ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయం వాస్తవం. ఉద్యోగిని ఓ జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేయడం పరిపాలనా నిర్ణయం కావచ్చు. కానీ, ఇదొక కుటుంబాన్ని రెండు భాగాలుగా విడదీసిన విషాద నిర్ణయం అయింది. భార్య ఒకచోట, భర్త మరోచోట, తల్లిదండ్రులు ఒకచోట, పిల్లలు మరోచోట కావడంతో వారంతా గూడు చెదిరిన పక్షులయ్యారు.
ఉద్యమం చేసిన ఉద్యోగులను కేసీఆర్ పీఆర్సీ విషయంలో అడిగినదానికంటే ఎక్కువ అమలు చేసి, తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. కానీ, రాజకీయ లబ్ధి పొందిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవో 317 రద్దు చేస్తామని హామీ ఇచ్చి మూడేండ్లు కావొస్తున్నా అమలు చేయడం లేదు. మరోవైపు, ఏండ్ల తరబడి ఒకే పోస్ట్‌లో ఉద్యోగం చేస్తున్న వారు సైతం ఉద్యోగోన్నతుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే, ప్రమోషన్ తమ పనితనానికి, ప్రతిభకు దక్కిన గౌరవంగా ఉద్యోగులు చూస్తారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వారికి ఉద్యోగోన్నతి రాకపోవడం వల్ల వారిలో నిరుత్సాహం మొదలవుతుంది. వారు చేసే పనిలో సమర్థత సన్నగిల్లుతుంది. కాబట్టి, శాఖల వారీగా ఖాళీలను గుర్తించి నిర్ణీత సమయంలో ఉద్యోగోన్నతులు కల్పించాలి. ఎన్నికల ముందు ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకుడు)
-ఏనుగుల రాకేశ్‌రెడ్డి